MLA Medipalli Satyam | గంగాధర, జులై 11: రాష్ట్రంలోని పల్లెల అభివృద్ధి లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లి, కురిక్యాల, గట్టుభూత్కూర్ గ్రామాల్లో రూ.30 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చొప్పదండి నియోజకవర్గంలోని ప్రతీ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రానికి రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతామన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పల్లెల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించిందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని,రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోందన్నారు. ఒద్యారం ప్రభుత్వ పాఠశాలకు 43 ఇంచుల టీవీ, వాటర్ ప్యూరిఫైయర్, బీరువా, విద్యార్థులకు షూలు, స్పోర్ట్స్ డ్రెస్ అందజేసిన మాజీ సర్పంచ్ మునుకుంట్ల సంపత్‌ను ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.