జగిత్యాల, జూలై 20 (నమస్తే తెలంగాణ) : కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి నీటిని ఎత్తిపోసి రైతులను ఆదుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. కాపర్ డ్యాం నిర్మిస్తే మేడిగడ్డకు సంబంధం లేకుండా నీటిని ఎత్తిపోసుకోవచ్చని చెప్పారు. రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లో నీరు అడుగంటడంతో తాగునీటి సమస్య ఉత్పన్నం కాబోతున్నదని, హైదరాబాద్ ప్రజలు నగరాన్ని వదిలే పరిస్థితి నెలకొనే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కేసీఆర్‌పై ఏమైనా ద్వేషం ఉంటే ఎన్నికల్లో చూసుకుందామని, కానీ, సాగు, తాగునీటిని అందించేందుకు సానుకూల దృక్పథంతో ఉండాలని సూచించారు. ప్రభుత్వం ఇకనైనా కళ్లు తెరవాలని, భేషజాలకు పోకుండా రైతులకు నీళ్లివ్వాలని సూచించారు.
పోలీస్ జులుంతో ప్రతిపక్ష నాయకులను అణచివేయాలని చూస్తే అది సాధ్యం కాదని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తరఫున ఎలుగెత్తి చాటడానికి బీఆర్ఎస్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు. జగిత్యాల జిల్లాకేంద్రంలోని తన నివాసంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీవన్‌రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో రైతుల పక్షాన మాట్లాడే హక్కు లేదా..? రైతు బిడ్డగా రైతుల ధర్నాకు సంఘీభావం తెలిపే హకు లేదా..? ప్రశ్నించారు. సంఘీభావం తెలిపేందుకు వెళ్తే అడ్డుకోవడం ఏంటని మండిపడ్డారు. చొప్పదండి నియోజకవర్గంలోని మండలాలకు సాగునీరందించాలని మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ కృషి చేస్తే, ఆయనను పోలీసులు అడ్డుకోవడం అన్యాయమని ఆగ్రహించారు.
నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఇంత అప్రజాస్వామ్య పద్ధతి ఏనాడూ చూడలేదన్నారు. పోలీసుల అరాచకాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఎన్ని ఇబ్బందులకు గురిచేనా ఎదురొంటామని స్పష్టం చేశారు. పోలీసులకు ఇంత అత్యుత్సాహం పనికిరాదని, హిట్లర్ అని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి స్వభావాన్ని అలవర్చుకుంటున్నారా..? అని విమర్శించారు. కేసీఆర్ పాలనలో 24 గంటలు విద్యుత్ సరఫరా అయిందని, రేవంత్ రెడ్డి పాలనలో విద్యుత్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని దుస్థితి నెలకొన్నదని విమర్శించారు. కేసీఆర్‌కు ఎకడ పేరు వస్తుందోనని కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోయడం లేదన్నారు. ఇప్పటికే లక్షలాది క్యూసెకుల నీరు వృథాగా పోయిందని, ఎస్సారెస్పీ, మిడ్ మానేర్, ఎల్ఎండీ అడుగంటాయని ఆందోళన వ్యక్తం చేశారు.
నాడు వైఎస్సార్ వరద కాలువ తవ్విస్తే కేసీఆర్ పునర్జీవ పథకంతో ఎస్సారెస్పీని నింపడంతోపాటు లక్షలాది ఎకరాల స్థిరీకరణ చేశారని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి ఫుట్‌బాల్ మ్యాచ్, తన సరదాల కోసం రూ.100 కోట్లు ఖర్చు చేశారని, రైతులకు సాగునీరిచ్చేందుకు కాపర్ డ్యాం నిర్మాణానికి రూ.10 కోట్లు వెచ్చించలేరా..? అని నిలదీశారు. ఆరుతడి పంటల సాగు చేసే సమయం ఇప్పటికే మించిపోయిందని, రైతులు దుకి దున్నేందుకు నీళ్లు, కరెంటు లేవని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులను ఆదుకోవాలని చిత్తశుద్ధి ఉంటే రైతులకు తోడుగా నిలిచేందుకు ప్రయత్నం చేయాలని సూచించారు. ఆయన వెంట జగిత్యాల జడ్పీ మాజీ వైస్ చైర్మన్ హరిచరణ్, శీలం ప్రవీణ్, రాంచంద్రారెడ్డి, గుండా మధు, రఘువీర్ గౌడ్ ఉన్నారు.