రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ) : వృథాగా పోతున్న వరదనీటిని ఒడిసి పట్టాలన్న లక్ష్యం నీరు గారిపోతున్నది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మానేరు, మూలవాగులను జీవనదులుగా మార్చాలన్న ఉద్దేశ్యంతో కేసీఆర్ ప్రభుత్వం 174 కోట్లతో 24 చెక్‌డ్యాంల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.
అందులో సిరిసిల్ల మానేరుపై గంభీరావుపేట మండలం నర్మాల నుంచి మొదలుకుని సిరిసిల్ల మానేరు బ్రిడ్జి వరకు 11, వేములవాడ మూలవాగుపై కోనరావుపేట మండలం నిమ్మపల్లి నుంచి మొదలు వేములవాడ బ్రిడ్జి వరకు 13 నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించడంతో పాటు మొత్తంగా 20 పూర్తి చేసింది.
మరో నాలుగు నిర్మాణంలో ఉన్నాయి. పూర్తి చేసిన చెక్‌డ్యాంలలో నీళ్లు నిలువడంతో రెండు వైపులా భూగర్భ జలాలు పెరిగాయి. దీంతో రైతులకు పుష్కలంగా సాగునీరు అందడంతోపాటు ఇతర అవసరాలకు ఉపయోగపడ్డాయి. అయితే, గతేడాది కురిసిన భారీ వర్షాలు, భారీ వరదల కారణంగా సిరిసిల్ల మానేరు వాగుపైన సాయినగర్‌లో ఒకటి, వేములవాడ మూలవాగుపైన రెండు చెక్‌డ్యాలు కొట్టుకు పోయాయి.
ఆ తర్వాత ఎన్నికలు రాగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలవుతున్నా చెక్‌డ్యాంలను పట్టించుకోలేదు. ఫలితంగా వర్షపు నీరంతా వృథాగా పోతున్నది. ఎండకాలంలో మరమ్మతులు చేయిస్తే ఈ నీరంతా నిలిచి ప్రయోజనం దక్కేది. ఇప్పటికైనా మరమ్మతులు చేయిస్తే రైతులకు మేలు జరుగుతుంది.