Vemulawada | వేములవాడ, జూన్ 14 : రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని సీఐటీయూ అనుబంధ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి గుర్రం అశోక్ అన్నారు. వేములవాడ పట్టణంలో ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వచ్చాక మున్సిపల్ కార్మికులందరినీ రెగ్యులర్ ఉద్యోగులుగా పరిగణిస్తామని హామీ ఇవ్వడమే కాకుండా ప్రతీ ఉద్యోగికి రూ.26 వేల వేతనం ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. రెండున్నర సంవత్సరాలు గడిచిన ప్రభుత్వం కార్మికుల సమస్యలను పరిష్కరించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
చనిపోయిన వారి స్థానంలో కొత్తవారిని, 60 ఏళ్లు దాటిన వారి స్థానంలోనూ కొత్తవారిని నియమించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ప్రతీ కార్మికుడికి 26 వేల రూపాయల వేతనం ఇవ్వాలని రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు దశల వారి ఉద్యమం చేస్తామని చెప్పారు. ఈనెల 15న సంతకాల సేకరణ జరిపి సీఎంకు లేక పంపుతామన్నారు.
18, 19వ తేదీలలో మున్సిపల్ కార్యాలయాల ముందు నిరాహార దీక్షలు, 22న చలో కలెక్టరేట్, 29, 30 తేదీలలో ఎమ్మెల్యేలు, మంత్రుల క్యాప్ కార్యాలయం ముందు ధర్నాలు చేసేందుకు సిద్ధమవుతున్నామని తెలిపారు. కార్మికుల సమస్యను పరిష్కారమయ్యేంతవరకు నిరంతర ఉద్యమాలు కొనసాగిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో వేములవాడ మున్సిపల్ కార్మికుల సంఘం అధ్యక్షుడు సరిపల్లి నరేష్, ప్రధాన కార్యదర్శి దొబ్బల లచ్చయ్య, కోశాధికారి సావనపల్లి శ్రీనివాస్, నాయకులు కావాల సత్తయ్య, గంగిశెట్టి రమేష్ తదితరులు పాల్గొన్నారు.