MLA Dr. Kalvakuntla Sanjay | మెట్ పల్లి/కోరుట్ల, ఆగస్టు 31: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వాసుపత్రుల్లో మౌళిక సదుపాయాల కల్పనలో పూర్తిగా విఫలమైందని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ధ్వజ మెత్తారు. అసెంబ్లీ జీరో అవర్ లో వైద్య, ఆరోగ్య రంగానికి సంబంధించిన పలు సమస్యలపై ఎమ్మెల్యే ఆదివారం మాట్లాడారు. ఆదివారం నుంచి ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచి పోవడం బాధకరమన్నారు. ఎన్నికల వేళ కాంగ్రెస్ సర్కార్ ఆరోగ్యశ్రీ వైద్య సేవల పరిమితిని ఐదు లక్షల నుంచి పది లక్షలు చేస్తామని గొప్పలు చెప్పారని, కనీసం ఇప్పుడు బిల్లులు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉందన్నారు.
తన నియోజకవర్గ సమస్యలపై ఆరోగ్య శాఖ మంత్రికి విన్నవించగా వెంటనే స్పందించిన క్షేత్రస్థాయిలో అధికారులు మద్దతు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లేషన్ యాక్ట్ గురించి మాట్లాడుతున్నామని ప్రైవేట్ మెడికల్ ట్రీట్మెంట్కు సంబందించి బిల్లులు చెల్లించడం మానేసిన తర్వాత దాని గురించి ఏం మాట్లాడుతారని ప్రశ్నించారు. కోరుట్ల నియోజకవర్గంలోని మెట్పల్లి, కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లో సమస్యలపై అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించిన ఒక్క సమస్య కూడ ఇప్పటి వరకు పరిష్కారం కాలేదన్నారు. మంచం పట్టిన మాన్యం అని చిన్న వయసులో విన్నానని ఇలాంటి వార్తలు ఇప్పుడు మళ్లీ చూడాల్సిరావడం బాధకరమన్నారు.
మెట్పల్లి ప్రభుత్వాసుపత్రి సమస్యలపై ఆరోగ్యశాఖ మంత్రిని కలిసి వివరించానని, మంత్రి వెంటనే స్పందించి సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారని, 75శాతం పూర్తైన ఆసుపత్రి బిల్లులు వెంటనే విడుదల చేయాలని, మిగతా పనులు పూర్తి అయ్యేలా చూడాలని తన ముందే ఫోన్ చేశారని తెలిపారు. ఈ విషయంలో నాలుగు సార్లు ఆరోగ్య శాఖ మంత్రి స్పందించిన అధికారులు మాత్రం ఇప్పటి వరకు ఇటువైపు చూసిన దాఖాలాలు లేవన్నారు. ఆశా వర్కర్లకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.2500 ఉన్న వేతనాలను రూ. 10 వేలు చేశామన్నారు. ప్రభుత్వం ఆశా వర్కర్లకు రూ. 18 వేలు వేతనం పెంచుతామని మాట ఇచ్చి తప్పడం సరికాదన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరత తీవ్రంగా ఉండని, సీజనల్ వ్యాదులు ప్రభలుతున్నాయని సరిపడా మందులు ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచాలన్నారు. కోరుట్లలో 100 పడకల ఆసుపత్రి ప్రారంభించి రెండేళ్లు గడుస్తున్న కొత్తగా స్టాప్ ను నియమించలేదని, మందులు అందుబాటులో లేవని చెప్పారు. ఏరియా ఆసుపత్రిలో వైద్య సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని, వైద్య పరికరాలు లేక బోసి పోయిందన్నారు. ఇప్పటికైనా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి స్పందించాలని స్పీకర్ చొరవ చూపాలని ఎమ్మెల్యే కోరారు.