ఆడబిడ్డల అతిపెద్ద పండుగైన బతుకమ్మ వేడుకలపై రాష్ట్ర ప్రభుత్వం అంతులేని నిర్లక్ష్యం చూపుతున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏటా బతుకమ్మ ఏర్పాట్ల కోసం ప్రతి జిల్లాకు 10 లక్షలు కేటాయించినా.. ఈ సారి మాత్రం అణాపైసా కేటాయించలేదు. దీంతో పంచాయతీలు, మున్సిపాలిటీల్లో అధికారులు ఏర్పాట్లపై చేతులెత్తేశారు. మరోవైపు ‘ఒకటి కాదు.. నా తెలంగాణ అక్కాచెల్లెళ్లకు, అవ్వలకు ఈసారి రెండేసి చీరెల చొప్పున అందజేస్తాం’ అన్న సీఎం రేవంత్‌రెడ్డి మాట.. ఆచరణకు నోచుకోక పోవడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం తమను చిన్నచూపు చూస్తున్నదని, మాటలే తప్ప చేతల్లేవని మండిపడుతున్నారు.
కరీంనగర్, అక్టోబర్ 8(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ కలెక్టరేట్ : ‘నా తెలంగాణ అక్కాచెల్లెళ్లకు, అవ్వలకు ఈసారి రెండేసి చీరెల చొప్పున బతుకమ్మ పండుగ సారె అందజేస్తాం. నామమాత్రంగా కాదు, కలకాలం గుర్తుంచుకునేలా నాణ్యమైన చీరెలను పంపిణీ చేస్తాం’ అంటూ కొద్ది నెలల క్రితం మహిళా సంఘాల సభ్యులతో హైదరాబాద్‌లో సమావేశమైన సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ఈ ప్రకటనతో ఆడబిడ్డలంతా సంతోషించారు. అయితే, నెలలు గడిచాయి. మహిళలు అతిపెద్ద పండుగగా భావించే బతుకమ్మ కూ డా వచ్చింది. కానీ, సీఎం ప్రకటన మాత్రం కార్యరూపం దాల్చలేదు. ఎంతో ఆశతో ఎదురుచూసినా సద్దుల చీరెలు రాలేదు.. సారెలు పెట్టలేదు. పండుగ పూట తమకు కనీసం ఒక్క చీరైనా అందించకపోవడంతో మహిళలంతా రేవంత్ మాటలపై మండిపడుతున్నారు. మాటలే తప్ప చేతలేమీ లేవంటూ సర్కారుపై విరుచుకుపడుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏడేళ్లు క్రమం తప్పకుండా పంపిణీ చేసిన వైనాన్ని గుర్తు చేసుకుంటూ, కాంగ్రెస్ పాలనపై పెదవి విరుస్తున్నారు. కరోనా కష్టకాలంలో సైతం ఆడబిడ్డలకు బతుకమ్మ సారె అందించి తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట నిలుపుకున్నారని గుర్తు చేస్తున్నారు.
ఎన్నికల అనంతరం కూడా మహిళలకు బతుకమ్మ చీరెలు అందజేయలేదు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళా సంఘాల సభ్యులతో సీఎం రేవంత్ నిర్వహించిన సమావేశంలో పలువురు మహిళలు ప్రశ్నించారు. దీంతో ఈ యేడు సద్దుల బతుకమ్మకు ఒక్కో మహిళకు రెండేసి చీరెలు అందజేస్తామంటూ రేవంత్ హామీ ఇచ్చారు. అయితే, ఆ హామీ మేరకు చీరుల తయారీకి ఏప్రిల్, మే నెలలోనే నేతన్నలకు ఆర్డర్లు పెట్టాల్సి ఉండగా, ఇప్పటి వరకు కూడా ఆ ఊసే లేదు. మరో నాలుగు రోజుల్లో సద్దుల బతుకమ్మ పండుగ కాగా, ఈసారి కూడా బతుకమ్మ చీరెలు రావని మహిళలు నిరాశ చెందుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం బేషజాలకు పోయి తమను చిన్నచూపు చూస్తున్నదని విమర్శిస్తున్నారు.
తెలంగాణ మహిళల అతిపెద్ద పండుగ సద్దుల బతుకమ్మ ఎప్పుడొస్తుందా..? అంటూ ఎదురుచూసే నేతన్నల్లో ఈసారి నైరాశ్యం అలుముకున్నది. ఏడేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలోని నేతన్నలను ఆదుకునే క్రమంలో ఏటా మార్చి, ఏప్రిల్ నెలల్లోనే సుమారు కోటికి పైగా బతుకమ్మ చీరెలకు ఆర్డర్లు ఇచ్చేది. ఈ చీరెల నేతతో మూడు, నాలుగు నెలల పాటు ఉపాధి పొందేవారు. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి ఆర్డర్లు ఇవ్వకుండా, బతుకమ్మ చీరెల పంపిణీ పథకానికి మంగళం పాడడంతో వేలాది నేత కుటుంబాలు ఉపాధి కరువై ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని చేనేత సహకార పారిశ్రామిక సంఘాల ప్రతినిధులు పేర్కొంటున్నారు.
మహిళలు ప్రీతిపాత్రంగా భావించే బతుకమ్మ పండగను రాష్ట్ర ఆవిర్భావం అనంతరం అత్యంత వైభవంగా నిర్వహించుకునేందుకు తొలి సీఎం కేసీఆర్ ప్రతి జిల్లాకు 10 లక్షల చొప్పున నిధులు కేటాయించేవారు. ఆ మొత్తాన్ని చిన్న గ్రామపంచాయితీలకు పంపిణీ చేస్తూ, బతుకమ్మ ఆడే చెరువు గట్లపై పారిశుధ్య పనులు, లైటింగ్, బారికేడ్లు, ఇతర ఏర్పాట్లు చేసేవారు. అయితే, ఈసారి మాత్రం కనీస నిధులు కూడా విడుదల చేయకుండా కాంగ్రెస్ సర్కారు చేతులెత్తేసి, గ్రామపంచాయతీల ప్రత్యేకాధికారులపై భారం వేసింది. దీంతో, గ్రామాల్లో బతుకమ్మ వేడుకల నిర్వహణ ఏర్పాట్లపై అధికార యంత్రాంగం మల్లగుల్లాలు పడుతున్నది. నిన్నా మొన్నటి వరకు కురిసిన వర్షాలతో గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్లు పాడై పోగా, చెరువుకట్టలపైనా ఫీటుకు పైగా లోతు మట్టి కొట్టుకుపోయి గోతులు ఏర్పడ్డాయి. వాటికి మరమ్మతులు చేపడితేనే బతుకమ్మ వేడుకలు సజావుగా జరిగే అవకాశాలున్నాయి. కానీ, ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో ఈసారి ఏర్పాట్లపై గ్రామాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పల్లెల్లో చీకట్లు కమ్ముకుంటుండగా, మహిళలు బతుకమ్మ ఆడుకునేందుకు, చెరువుల వద్ద నిమజ్జనం చేసేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గత ప్రభుత్వం హిందువులతోపాటు ముస్లింలకు కూడా బతుకమ్మ చీరెలు నిరాటంకంగా పంపిణీ చేసింది. దీంతో పేద, మద్య తరగతి కుటుంబాలకు చెందిన ముస్లిం మహిళలు బతుకమ్మ, రంజాన్ సందర్భంగా పంపిణీ చేసే చీరెల కోసం వేచి చూసేది. ముస్లింలంతా ప్రధాన పండుగగా భావించే రంజాన్‌కు కూడా చీరెలు పంపిణీ చేయకపోవడంతో కాంగ్రెస్ సర్కారు తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నది.
తెలంగాణలో ఆడబిడ్డలను లక్ష్మీదేవితో పోల్చుకోవడం పరిపాటి. పండుగకైనా, పబ్బానికైనా వారికి బట్టలు పెట్టి, తమ స్థాయిని బట్టి గౌరవించడం అనాదిగా వస్తున్న ఆనవాయితీ. స్వరాష్ట్రంలో ఆడబిడ్డలను సముచితంగా గౌరవించుకునే క్రమంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, హిందూ మహిళలకు బతుకమ్మ చీర, ముస్లింలకు రంజాన్ తోఫా, క్రైస్తవులకు దుస్తులు ఉచితంగా అందజేసే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏడేళ్లు విజయవంతంగా బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్ పండుగల సందర్భంగా అధికారులతో గత ప్రభుత్వం పంపిణీ చేయించింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 9.5 లక్షల మంది వరకు పద్దెనిమిదేళ్లు నిండిన యువతుల నుంచి పండుటాకుల వరకు ఏటా చీరెలు అందించింది. 30కోట్ల నుంచి 35 కోట్ల వరకు ఖర్చు చేసి నేతన్నలకు ఆర్డర్లు ఇవ్వగా, నాణ్యతతో కూడిన చీరెలు తయారు చేశారు. 250కి పైగా రంగుల్లో 100కు పైగా డిజైన్లతో, 4 నుంచి 5 మీటర్ల పొడవుతో చీరెలు అందించారు. గతేడాది కూడా ఇదేవిధంగా దసరాకు చీరెలు పంపిణీ చేసేందుకు గత ప్రభుత్వం సిద్ధం కాగా, కాంగ్రెస్ నాయకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి చీరెల పంపిణీని అడ్డుకున్నారు.