రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన పీఎంజే జువెల్లరీ దోపిడీ కేసు పది రోజుల్లోనే వీడింది. పోలీసులకే సవాల్ విసిరిన ఈ లూటీ అత్యంత పకడ్బందీ ప్లాన్ ప్రకారం జరిగింది. తాజాగా ఇద్దరు దొంగలతోపాటు సిమ్‌లు విక్రయించిన ఒక సహాయకుడిని అరెస్ట్ చేసి విచారించగా, అందులో వెలుగు చూసిన అంశాలు జులాయి సినిమాను తలపించేలా.. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని తలదన్నేలా ఉన్నాయి. దొంగలకు ఒకరితో ఒకరికి సంబంధం లేకపోవడం, రెక్కీ నుంచి దోపిడీ వరకు.. పారిపోవడం నుంచి దోచిన సొమ్ము విక్రయించే వరకు అంతా ఒక ప్రత్యేక యాప్‌లోనే రూట్ మ్యాప్ తయారు చేసుకున్న తీరు పోలీస్‌శాఖనే నివ్వెరపరుస్తున్నది. దోపిడీ దొంగల అరెస్ట్, అందుకు సబంధించిన వివరాలను కరీంనగర్ సీపీ గౌష్ ఆలం వెల్లడించగా, దొంగలు సైతం ఆధునిక టెక్నాలజీని ఎలా వినియోగిస్తున్నారన్నది వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది.
కరీంనగర్ రాంనగర్/ విద్యానగర్, మే 14 : పీఎంజే జ్యువెల్లరీలో దోపిడీ కేసును కరీంనగర్ పోలీసులు చేధించారు. ఇద్దరు దొంగలతోపాటు సిమ్‌లు విక్రయించిన ఒక సహయకుడిని అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.51వేల నగదు, నకిలీ ఆధార్‌కార్డులు, రెండు సెల్ఫోన్లు, సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించిన వివరాలను గురువారం కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం వెల్లడించారు. అంతర్రాష్ట్ర నగల దొంగ, ‘ది గోల్డెన్ థీవ్’గా పేరొందిన ముఠా నాయకుడు బిహార్‌కు చెందిన సుభోద్ సింగ్ దోపిడీకి ప్రధాన సూత్రధారిగా వ్యవహరించాడు. అనేక రాష్ర్టాల్లో నగలు చోరీ చేసిన అతడు, నలభైకి పైగా దొంగతనం, దోపీడీ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు.
అతనికి వెస్ట్‌బెంగాల్‌కు చెందిన రఘునాథ్ కర్మాకర్ అలియాస్ జాగీర్ సింగ్‌తో ఓ సారి జైల్లో పరిచయం ఏర్పడింది. ఇరువురు కలిసి గతంలో అనేక నేరాల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం బిహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న సుభోద్ సింగ్.. ప్రధాన నిందితుడైన రఘునాథ్ కర్మాకర్‌తో దోపిడీ విషయం చెప్పి, జైలు నుంచే ప్లాన్ వేశాడు. ఆసక్తికర విషయం ఏంటంటే ఒకరికి మరొకరితో సంబంధం లేకుండా కొంతమంది నేరగాళ్లను ఎంపిక చేసుకున్నాడు. ఆ తర్వాత నిజామాబాద్, సిద్ధిపేట, ధర్మపురి, మంచిర్యాల, ఖమ్మం, జగిత్యాల ప్రాంతాల్లో ఆరు నెలలుగా భారీ దోపిడీ చేయడానికి రెక్కీ నిర్వహించారు. చివరకు కరీంనగర్‌లోని పీఎంజే జ్యువెల్లరీ ఎంచుకున్నారు.
అందులో ఎక్కువ విలువైన నగలున్నట్టు ముందుగా గుర్తించి, దోపిడీకి పాల్పడ్డారు. ఇక్కడ దోపిడీ చేయడానికి ముందు పెద్దపల్లిలో, తర్వాత ధర్మపురిలో ఓ లాడ్జీలో విడిది చేసి, రెక్కీ నిర్వహించారు. నాటు తుపాకులను చంద్రాపూర్ నుంచి తెప్పించుకున్నారు. అయితే ఎవరికీ ఎక్కడ అనుమానం రాకుండా ఉండడంతోపాటు ఆధారాలు దొరక్కుండా ఉండేందుకు జాగ్రత్త పడ్డారు. ఆ మేరకు.. నకిలీ ఆధార్‌కార్డు వినియోగించి బస చేశారు. ఇతరుల పేర్లతో ఉన్న సిమ్ నెంబర్లను వినియోగించారు. పక్కా ప్లాన్ ప్రకారం ఈ నెల 3న ఉదయం రెండు వాహనాలపై ఐదుగురు దొంగలు 6 తుపాకులతో కరీంనగర్ వచ్చారు. మొదట ఒక వ్యక్తి కొనుగోలుదారుడిగా దుకాణంలోకి వెళ్లి బయట ఉన్న ఇతర దొంగలకు సమాచారం ఇచ్చాడు. ఆ సూచన మేరకు మిగతా దొంగలు షాపులోకి చొరబడి తుపాకులతో గురి పెట్టి, రూ.82 లక్షల విలువైన 161.4 తులాల బంగారు ఆభరణాలు, 112 క్యారెట్ వజ్రాభరణాలను ఎత్తుకెళ్లారు.
యాప్ ద్వారానే రూట్‌మ్యాప్
ముఠా సభ్యులు దోపిడీకి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించారు. రెక్కీ నుంచి దోపిడీ వరకు.. అంతా పకడ్బందీగా ప్లాన్ చేసేందుకు వారే ఏకంగా ఒక యాప్‌కు రూపకల్పన చేశారు. ఎవరూ ఏ మార్గాల ద్వారా వెళ్లాలి? దోపిడీ తర్వాత ఎవరు ఏ మార్గం గుండా పారిపోవాలి? ఎక్కడ కలుసుకోవాలి? అన్న రూట్ వివరాలను మొత్తం ఆ యాప్‌లో నమోదు చేసి ఉంచారు. అందులో భాగంగానే ఎవరికీ అనుమానం రాకుండా పోలీసుల కండ్లు కప్పి దోపిడీ చేశారు. అనంతరం యాప్ ప్రకారం రూట్ మ్యాప్ ద్వారా రామడుగు, గొల్లపల్లి, ధర్మపురి గోదావరి వరకు వాహనాలతో ప్రయాణించారు.
ఆ తర్వాత వాహనాలు, సెల్‌ఫోన్ ఇతర వస్తువులను వదిలేసి పారిపోయారు. స్థానికుల ద్వారా వాటిని గుర్తించిన పోలీసులు, దొంగలను పట్టుకునేందుకు లోతైన దర్యాప్తు చేశారు. సెల్ఫోన్లో లభ్యమైన సమాచారం మేరకు సుమారు తొమ్మిది రాష్ర్టాల పోలీసుల సహకారంతో వివరాలు సేకరించారు. ఆ మేరకు ప్రధాన నిందితుడిగా ఉన్న రఘునాథ్ కర్మాకర్‌ను ముందుగా బిహార్‌లో పట్టుకున్నారు. అతని ద్వారా బిహార్ రాష్ట్రంలోని హిల్ప మండలానికి చెందిన రవిశ్ కుమార్ అలియాస్ ప్రద్యుమన్, రాధే అలియాస్ అభయ్, మిశ్రా, సూర్యమణి దోపిడీలో పాల్గొన్నట్టు గుర్తించారు. వీరిలో రవిశ్ కుమార్‌తోపాటు సిమ్‌లు విక్రయించిన సహాయకుడు రాధేను పశ్చిమ బెంగాల్లో అదుపులోకి తీసుకున్నారు. వీరందరికీ అనేక విధాలుగా సహకారం అందించిన వారితో కలిపి మొత్తం 13 మంది దోపిడీలో పాల్గొన్నట్టు నిర్ధారించారు.
మధ్యవర్తుల ద్వారా ఆభరణాలు దాటింపు
దోపిడీ దొంగలు దోచిన సొత్తును యాప్ ద్వారా వచ్చిన సూచన మేరకు మధ్యవర్తులకు అప్పగించారు. మధ్యవర్తులు వాటిని విక్రయించేందుకు ఇతర రాష్ర్టాలకు తరలించారు. ఆ ఆభరణాలు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించి పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నామని సీపీ తెలిపారు. ఎక్కువగా నేపాల్‌లో విక్రయించిట్లు సమాచారం ఉందన్నారు. ముఠాలోని దొంగలు ఎవరు ఎక్కువగా బంగారు ఆభరణాలు అపరిహస్తారో వారికి ముఠా నాయకుడు రఘునాథ్ కర్మాకర్ నగదు రూపంలో అదనపు ఇనామ్ ఇస్తారని చెప్పారు. ఈ దొంగలు ఒక్కో సిమ్‌ను పది వేల రూపాయలు చెల్లించి కొన్నట్టు తెలిసిందన్నారు. ఈ దోపిడీకి స్కెచ్ వేసిన సుభోద్ సింగ్‌ను అతి త్వరలోనే తమ ఆధీనంలోకి తీసుకొని విచారిస్తామని తెలిపారు.