కోరుట్ల, జూన్ 28: దేశ భవిష్యత్తు నవతరం, యువతరం చేతుల్లోనే ఉందని, తమ ప్రతిభకు పదును పెట్టి ఉద్యోగాల్లో రాణించాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల పిలుపునిచ్చారు. శనివారం కోరుట్ల పట్టణంలోని కటం సంగయ్య ఫంక్షన్ హాల్లో తన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా జాబ్ మేళాకు హాజరైన నిరుద్యోగ యువతను ఉద్దేశించి మాట్లాడారు.
యువతరం గళం ఎత్తితేనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాకారమైందని గుర్తు చేశారు. కొత్త తరం రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు గడించేలా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. యువత తమ సిల్స్ను ఉపయోగించి దేశ పునర్నిర్మాణానికి అవసరమైన మేధోసంపత్తిని పెంపొందించుకోవాలన్నారు. జాబ్ ప్రొఫైల్స్ రోజురోజుకూ మారిపోతున్నాయని, కృత్రిమ మేథస్సు ద్వారా సరికొత్త ప్రపంచం ఆవిషరణ కానుందని తెలిపారు.
ఈ జాబ్ మేళాలో ఏ ఉద్యోగం సాధించినా జాయిన్ కావాలని, హైదరాబాద్, కరీంనగర్ వంటి దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు పొందిన మహిళలకు ఏ అవసరం ఉన్నా తనను సంప్రదించాలని, అందుబాటులో ఉంటానని భరోసానిచ్చారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న యువతకు కోచింగ్ అందించేందుకు అందుబాటులో ఉంటానని చెప్పారు. యువతకు విద్యార్హతను బట్టి సాఫ్ట్వేర్, ఇతర కంపెనీల్లో ఉద్యోగావకాశాలు కల్పించాలనే మంచి ఆశయంతో మెగా జాబ్ మేళా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు చీటి వెంకటరావు, దారిశెట్టి రాజేశ్, ఫహీం, తోట నారాయణ, గుడ్ల మనోహర్, బట్టు సునీల్ పాల్గొన్నారు.