Ramagundam | కోల్ సిటీ, జూన్ 29: రామగుండం నగర పాలక సంస్థను 60 డివిజన్ లుగా అప్ గ్రేడ్ చేస్తూ అధికారులు రూపొందించిన ముసాయిదాను ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఆమోదించడంలో కార్పొరేషన్ అధికారులు సఫలీకృతులయ్యారనీ, మొత్తానికి అధికార పార్టీ నాయకుల మన్ననలు పొందారని 25 డివిజన్ మాజీ కార్పొరేటర్ నగునూరి సుమలత రాజు విమర్శించారు.
ఈమేరకు ఆదివారం ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడారు. నగర పాలక సంస్థ అధికారులు, అధికార పార్టీ నాయకులు కలిసి కూర్చొని తయారు చేసిన ముసాయిదాను కలెక్టర్ తో పాటు సీడీఎంఏ, చివరకు ప్రిన్సిపల్ సెక్రెటరీ ఆమోదించిన ముసాయిదా అంతా తప్పుల తడకగానే ఉందని విమర్శించారు. తుది జాబితాను తూర్పు, పడమర, దక్షిణం అంటూ దిక్కులతో ప్రకటించారనీ, ఇందులో డివిజన్ పరిధి ఏరియాలను పొందుపర్చకుండా ఆస్పష్టంగా విడుదల చేయడంలో అంతర్యం ఏమిటని ప్రశ్నించారు.
అధికార పార్టీ నాయకులు బయటకు ఒకటి చెబుతూ పార్టీ క్యాంపు ఆఫీసులో మున్సిపల్ అధికారులకు మరొకటి చెబుతూ నగరంలోని అన్ని డివిజన్లను ముక్కలు ముక్కలుగా చేశారనీ, తమకు వ్యతిరేక ఓటర్లు ఉన్న డివిజన్లను పూర్తిగా చిన్నాభిన్నం చేశారని ఆరోపించారు. ప్రభుత్వ పథకాలు, ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా వాటిని అటకెక్కించిన కాంగ్రెస్ పార్టీ నాయకుల చేతగాని తనంతో కార్పొరేషన్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోలేని స్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.
ఈసారి జరిగే ఎన్నికల్లో ప్రజల వద్దకు అబద్ధపు మాటలు, హామీలతో వస్తే ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. డివిజన్లను, ఓటర్లను విడదీసినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీపై ఉన్న వ్యతిరేకతను పూడ్చలేరని స్పష్టం చేశారు. డివిజన్లను మరోసారి అన్ని పార్టీల సమక్షంలో విభజన ప్రక్రియ చేయాలని, లేనిపక్షంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వస్తుందని హెచ్చరించారు.