Godavarikhani | కోల్ సిటీ, జూలై 4: హత విధీ… రామగుండం నగర పాలక సంస్థ అధికారుల బాధ్యతా రాహిత్యంకు పరాకాష్ట ఇది. గోదావరిఖని శివారు ప్రాంతమైన గోదావరి నది వంతెనపై ఇదీ దుస్థితి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిండుకుండలా ప్రవహిస్తున్న గోదావరి నది వద్ద వంతెనపై పర్యాటకులకు అహ్లాదకర వాతావరణం కోసం రామగుండం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో వంతెనపై చివరి వరకు రూ.లక్షలు వెచ్చించి దాదాపు వంద వరకు కుండీలను ఏర్పాటు చేసి అందులో వివిధ రకాల మొక్కలను పెంచారు.
అప్పట్లో ఆ కుండీలలో దాదాపు ఐదారడుగుల వరకు మొక్కలు పెరగడంతో గోదావరి నదికి కొత్త అందాలను తీసుకవచ్చింది.. నిండుకుండలా వంతెనను తాకుతూ ప్రవహించే గోదావరిని చూసేందుకు పారిశ్రామిక ప్రాంతం నుంచి వచ్చే పర్యాటకులకు మానసికోల్లాసం అందించింది. కానీ, హరితంపై అక్కసుతోనో లేక గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేరు చెరిపేయాలనే దురుద్దేశంతోనే తెలియదు కానీ ఇప్పుడు అక్కడ గోదావరి బ్రిడ్జిపై ఆ అందాలు కనుమరుగు అయ్యాయి.
వంతెనపై పొడవునా గల చెట్ల కుండీలు పగిలిపోయాయి. అందులో ఏపుగా పెరిగిన మొక్కలూ మాయమయ్యాయి. మరి ఈ దుస్థితికి కారకులెవరు..? నిర్లక్ష్యంనకు బాధ్యులెవరు..? అంటూ వంతెనపై రాకపోకలు సాగించే ప్రయాణీకులు, పర్యావరణ ప్రేమికులు ప్రశ్నిస్తున్నారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు పట్టింపు ఉన్నట్టా.. లేనట్టా..? అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.