‘సినుకమ్మా.. వాన సినుకమ్మా.. నేల చిన్నబోయె సూడు బతుకమ్మ’ అంటూ మళ్లీ వర్షాల కోసం మళ్లీ ఎదురు చూసే రోజులు వచ్చాయి. వానకాలం ప్రారంభమైనా.. నైరుతి రుతుపవనాలు ముందుగానే వచ్చినా.. ఆకాశంలో మేఘాలు రోజూ దట్టంగా కమ్ముకుంటున్నా వాన జాడ మాత్రం కానరావడం లేదు. మృగశిర కార్తెకు ముందు మూడు రోజుల పాటు అక్కడక్కడా చిరుజల్లులతో కురిసినా ఆ తర్వాత మళ్లీ కురవలేదు. అసలైన తొలకరి పలకరింపు కోసం అన్నదాతలు ఆశగా ఆకాశం వైపు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో విత్తనాలు వేయాలా..? వద్దా..? అసలు వర్షాలు కురుస్తాయా..? కురవవా..? అనే ఆందోళన రైతుల్లో నెలకొన్నది.
పెద్దపల్లి, జూన్ 13(నమస్తే తెలంగాణ) : మృగశిర కార్తె తర్వాత వ్యవసాయ పనులను మొదలు పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ కార్తె నుంచి తొలకరి వర్షాలు సమృద్ధిగా కురిసేవి. కానీ, ఈ కార్తెకు ముందు ఈ నెల 3, 6, 7 తేదీల్లో జిల్లా వాప్తంగా చిరు జల్లులు పడగా, ఆ తర్వాత ముఖం చాటేశాయి. వారం రోజులుగా రోజూ మేఘాలు కమ్ముకొస్తున్నాయి. ఉరుములు, మెరుపులు రైతుల్లో ఆశలు రేకెత్తిస్తున్నాయి. అయితే, అంతలోనే గాలులు వీస్తుండడంతో మేఘాలు తేలిపోతున్నాయి. రోజూ ఇదే పరిస్థితి ఉంటున్నది. వర్షాలు కురుస్తాయని ఆకాశం వైపు ఎదురు చూడడం, అంతలోనే మేఘాలు మాయమవుతుండడంతో రైతులు నిరాశ చెందుతున్నారు. నైరుతి రుతు పవనాల రాకతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతుండడంతో ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఒకటి రెండు భారీ వర్షాలు కురవగానే విత్తనాలు వేయాలని చూస్తున్నారు. కాగా, అకడకడ కురిసిన చిరు జల్లులతో దుకులు సిద్ధం చేసుకుంటుండగా, మరికొన్ని చోట్ల విత్తనాలు వేశారు. చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ దుకులు కూడా దున్నలేదు.
విత్తనం వేయాలా..? వద్దా..? : కొన్ని ప్రాంతాల్లో దుకులు దున్నిన రైతులు విత్తనం వేయాలంటే వెనకాముందవుతున్నారు. విత్తనం వేసిన తర్వాత వర్షాలు కురవకపోతే మొలకలు రాక మట్టిలోనే విత్తనం మురిగిపోతుందని ఆందోళన చెందుతున్నారు. వర్షాలు లేకపోవడంతో ఎండల తీవ్రత ఎకువగానే ఉంది. దీంతో చాలా మంది రైతులు విత్తనం వేయడానికి వెనుకడుగు వేస్తున్నారు. ముఖ్యంగా మక, సోయా, పత్తి, మినుము, పెసర, కంది వంటి ఆరుతడి పంటలు సాగు చేసే రైతులు ఆచితూచి అడుగులేస్తున్నారు. విత్తనం వేసిన తర్వాత సకాలంలో వర్షాలు కురవకపోతే వేసిన విత్తనం నష్టపోవాల్సి వస్తుందని భావిస్తున్నారు.
ఎస్సారెస్పీలో 7.56 టీఎంసీలే : ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో 90 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి కేవలం 7.56 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. దీంతో ఈ వానకాలం పంటకు వర్షాలు పడితే తప్పా సాగునీరు ఇచ్చే అవకాశం ఏ మాత్రం కనిపించడం లేదు. దీనికి తోడు పెద్దపల్లి జిల్లాలో గోదావరినదిపై నిర్మించిన సరస్వతీ, పార్వతీ బ్యారేజీల్లోని నీటిని పూర్తిగా ఎత్తివేయగా ఎల్లంపల్లి డెడ్ స్టోరేజీకి చేరుకున్నది. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు కురిస్తేనే ప్రాజెక్టుల ఆయకట్టుకు భరోసా లభిస్తుంది. పెద్దపల్లి జిల్లాలో 1072 వరకు చిన్న, పెద్ద చెరువులు, కుంటలు ఉండగా.. చాలా వరకు ఎడారులను తలపిస్తున్నాయి.
నారుమడులకూ నీటి కరువు : ఎస్సారెస్పీ ప్రాజెక్టు కింద పెద్దపల్లి జిల్లాలో 2.8 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. జిల్లాలోని 1072 చెరువుల్లో అత్యధిక శాతం చెరువులు ఎస్సారెస్పీ కాల్వల ద్వారా గొలుసుకట్టుగా నింపే అవకాశాలు ఉన్నా ఎస్సారెస్పీలో నీరే లేదు. దీంతో నారు మడులు కూడా వర్షాలపైనే ఆధారపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
బోర్ల వైపు చూపు : ఇన్నాళ్లూ ప్రాజెక్టులపై ఆధారపడి సాగు చేసుకున్న రైతులు ప్రస్తుత ప్రభుత్వ తీరు వల్ల సాగునీరందడం కష్టమేననే ఆలోచనలో పడ్డారు. ఇన్నిరోజులు బోర్లకు దూరంగా ఉన్నా.. ఇప్పుడు క్రమంగా వాటి వైపు మల్లుతున్నారు. సాగునీరు అందే దారి లేక వ్యవసాయ పొలాల్లో బోర్లు వేయించే పనిలో పడారు.
ఎస్సారెస్పీ ప్రాజెక్టు నుంచి కాలువలకు సాగు నీటి విడుదల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. పెద్దపల్లి జిల్లాలో 2 లక్షల 8 వేల ఎకరాల వరకు ఎస్సారెస్పీ కాలువల ద్వారా సాగవుతున్నది. ఇందుకు నీటి అవసరాన్ని వివరించాం. వర్షాలు కురిస్తే చాలా వరకు ప్రయోజనం ఉంటుంది. ఎస్సారెస్పీ ఎగువన వర్షాలు సమృద్ధిగా కురిసినా నీరందుతుంది. ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న నీరు విడుదల చేసే అవకాశం లేదు.
– సత్యరాజ్ చంద్ర, నీటిపారుదలశాఖ ఎస్ఈ (పెద్దపల్లి)