సిరిసిల్ల టౌన్, ఫిబ్రవరి 13: రాష్ట్రంలో సాగునీరందక పంటలు ఎండిపోతున్నా, రైతన్న కంటతడి పెడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టింపులేదని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ ధ్వజమెత్తారు. చాలాచోట్ల నీళ్లు వస్తయా.. రావా..? పంట చేతికి వస్తుందా.. లేదా..? అని తెలియక చాలా మంది రైతులు పెట్టుబడులు పెట్టేందుకు సందిగ్ధంలో ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వేసవి సమీపిస్తున్నందున ప్రభు త్వం వెంటనే స్పందించాలని, మేడిగడ్డ బరాజ్‌కు మరమ్మతులు చేపట్టి రిజర్వాయర్లు నింపి పంటలకు నీరందించాలని డిమాండ్ చేశారు. రైతుల పంటలకు సకాలంలో సాగునీరందించకపోతే సహించేదిలేదని హెచ్చరించారు. సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణితో కలిసి ఆయన మాట్లాడారు. గోదావరి నదీ జలాల వినియోగానికి ఎత్తిపోతల ద్వారా తప్పితే ప్రత్యామ్నాయ మార్గం లేదన్నారు.
యాసంగి పంట వేసిన రైతులు సాగు నీరు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. 1964లో శంకుస్థాపన చేసిన ఎస్సారెస్పీ 60ఏండ్లు గడిచినా ఆయకట్టుకు సరిపడా నీరందించలేదని, ఈ క్రమంలో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని గుర్తు చేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లి ప్రాజెక్టుల నుంచి ఎత్తిపోతల ద్వారా, గ్రావెటీ కెనాల్ ద్వారా తెచ్చిన నీటితో యావత్ ఉత్తర తెలంగాణ జిల్లాలకు సాగు నీరందించారని చెప్పారు. దిగువ నుంచి ఎగువకు ఎత్తిపోసిన నీటిని సిరిసిల్లలోని ఎస్సారార్ రిజర్వాయర్ (మిడ్ మానేరు) నుంచి ఎత్తిపోతల ద్వారా రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టులు నింపారని, పూర్వపు మెదక్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్లగొండ జిల్లాలకు నీరందించారని వివరించారు. మేడిగడ్డ బరాజ్‌లో ఒక బ్లాక్ కుంగితే రాజకీయం చేసిన రేవంత్‌రెడ్డి, అధికారంలోకి వచ్చి ఇంతకాలం గడుస్తున్నా ఇప్పటికీ నిర్మాణ పనులు ఎందుకు చేపట్టడం లేదో చెప్పాలన్నారు.
చట్టం ప్రకారం నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ సూచనలు మాత్రమే చేస్తుందని, ప్రభుత్వమే మరమ్మతులు చేపట్టాల్సి ఉంటుందన్నారు. డ్యాం సేఫ్టీ అథారిటీ పేరు చెప్పి ఇప్పటికే 16 నెలల సమయాన్ని వృథా చేశాడని విమర్శించారు. తాను ఇటీవల గంభీరావుపేట, ముస్తాబాద్ మండలాల్లో పర్యటించిన సందర్భంలో రైతులు నారు పోసుకొని ఎరువులు చల్లారని, ఇప్పుడు నీళ్లు లేక తల్లడిల్లుతున్నారన్నారు. నీళ్లు వస్తాయా..? రావా..? తెలియని పరిస్థితుల్లో మళ్లీ యూరియా, డీఏపీ బస్తాలు చల్లితే ఏం జరుగుతుందోనని ఆందోళనలో ఉన్నారన్నారు. ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాలో రైతులతో మాట్లాడిన సమయంలో వారు పంటపై పెట్టుబడి పెట్టేందుకు సందిగ్ధంలో ఉన్నారన్నారు
. గోదావరికి ప్రాణహిత, ఇతర నదుల ద్వారా వస్తున్న అనేక టీఎంసీల నీటిని సముద్రం పాలు చేయొద్దని కోరారు. ఎత్తిపోతల ద్వారా అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లి ప్రాజెక్టులను నింపి మార్చి, ఏప్రిల్‌లోగా రైతులకు నీరందించాలని డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఇంజినీరింగ్ సిబ్బంది సమన్వయంతో పనిచేసి రైతులను కాపాడుకునే దిశగా పనిచేయాలని సూచించారు. సాగునీరు సమృద్ధిగా ఇచ్చే అవకాశాలు ఉన్నాయని, ప్రభుత్వం ఆ దిశగా చొరవ తీసుకొని యాసంగి పంటకు పూర్తిస్థాయిలో సాగు నీరందించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు బొల్లి రామ్మోహన్, న్యాలకొండ రాఘవరెడ్డి, కృష్ణారెడ్డి, కుంబాల మల్లారెడ్డి, గజభీంకార్ రాజన్న, ఎదురుగట్ల చంద్రయ్యగౌడ్, మాట్ల మధు, పడిగెల రాజు, మ్యాన రవి, విజయరామారావు, వేణుగోపాల్‌రావు, ప్రేమ్‌కుమార్, పోచవేని ఎల్లయ్యయాదవ్, కొక్కుల ఆంజనేయులు, గుజ్జె దత్తాద్రి తదితరులు పాల్గొన్నారు.