పేదింటి పెద్ద మరణిస్తే కుటుంబానికి తక్షణ ఆర్థిక భరోసా కల్పించేందుకు అమలు చేస్తున్న నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీం (ఎన్ఎఫ్బీఎస్) భరోసా ఇవ్వలేకపోతున్నది. కరీంనగర్ జిల్లాలో ఆశించిన స్థాయిలో అమలు కాకపోవడంతో పేద కుటుంబాలకు నిరాశే మిగులుతున్నది. ఈ పథకం అమలు తీరుపై గొప్పలు చెబుతున్నా ఆచరణలో తుస్సుమనిపిస్తుండడంపై అన్ని వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతున్నది.
కరీంనగర్ కలెక్టరేట్, మే 17 : తెల్ల రేషన్‌కార్డు కలిగిన కుటుంబాల్లో 18 నుంచి 60 ఏళ్లలోపు వయసు ఉన్న ఇంటి పెద్ద సహజంగా, ప్రమాదవశాత్తు మరణించిన సందర్భంలో ‘ఎన్ఎఫ్బీఎస్’ వర్తిస్తుంది. నిబంధనల ప్రకారం అర్హులైన కుటుంబానికి ఈ పథకం కింద పేద కుటుంబాలకు రూ.20 వేల సాయం అందుతుంది. అందుకోసం మరణించిన తేదీ నుంచి రెండేళ్లలోపు మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకొని, హార్డ్ కాపీలు సంబంధిత అధికారులకు అందజేయాలి.
కుటుంబానికి ఆధారమైన వ్యక్తులు చనిపోయిన తర్వాత తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉండే వారికి ఈ సాయం కొంత ఊరటనిస్తుందని భావించి అనేక మంది దరఖాస్తు చేసుకున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎన్ఎఫ్బీఎస్ కింద కరీంనగర్ జిల్లాలో 3వేలకు పైగా దరఖాస్తులు మీసేవా కేంద్రాల ద్వారా నమోదయ్యాయి. అయితే, వాటిలో కేవలం 1,350 దరఖాస్తులకు మాత్రమే మోక్షం లభించగా, మొత్తం రూ.2కోట్ల 70లక్షలు అందినట్లు అధికారుల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
అంటే దరఖాస్తు చేసుకున్న వారిలో సగం మందికి కూడా సాయం అందని పరిస్థితి నెలకొందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, అర్హతలున్నప్పటికీ అనేక దరఖాస్తులు ఇంకా పెండింగ్‌లోనే ఉండడం, కొన్నింటిని సాంకేతిక కారణాలతో తిరస్కరించడం, పరిశీలన ప్రక్రియ నత్తనడకన సాగడం లాంటి అంశాలపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ పోషకుడిని కోల్పోయిన పేదలకు వెంటనే అండగా నిలవాల్సిన సమయంలో ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితిని తీసుకొచ్చిందని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా దరఖాస్తులు పరిశీలించి అర్హులైన ప్రతి కుటుంబానికి సాయమందించాలని కోరుతున్నారు.