వేములవాడ రూరల్, ఫిబ్రవరి 12 : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని, బీఆర్ఎస్ బలం, బలగాన్ని చూపించాలని గులాబీ శ్రేణులకు వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనర్సింహారావు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పాలనలో వైఫల్యాలను ఎండగట్టాలని, బీఆర్ఎస్ పాలనలో చేసిన అభివృద్ధిని వివరించాలని, మరోసారి గులాబీ జెండా ఎగురవేయాలని కోరారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పదేళ్ల పాలనలో ప్రజలు ఉన్నంతలో సంతోషంగా ఉన్నారని గుర్తు చేశారు. కానీ, కాంగ్రెస్ ఏడాది పాలనలో అవస్థలు పడుతున్నారని విమర్శించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీని చిత్తుగా ఓడించి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
వేమలవాడ రూరల్ మండలం చెక్కపల్లిలోని ఓ ఫంక్షన్హాల్లో బుధవారం బీఆర్ఎస్ మండల స్థాయి నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. చల్మెడ లక్ష్మీనర్సింహారావు ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కాలంగా పూటకోమాట చెబుతూ కాలం గడుపుతున్నదని మండిపడ్డారు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిందని, ఆరు గ్యారెంటీలు అమలులో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఈ ప్రభుత్వంలో ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ఇప్పటికే ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే బాగుండనే ఆలోచనలో ఉన్నారని, ఈ రాష్ర్టానికి సీఎంగా కేసీఆర్ ఉంటేనే మంచిగుంగు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.
కాంగ్రెస్‌ను నమ్మి మోసపోయామని ప్రజలు భావిస్తున్నారని, మరోసారి ఆ పార్టీకి ఓటు వేసేందుకు సిద్ధంగా లేరన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు మనం సన్నద్ధం కావాలని, ప్రతి ఇంటికీ వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని వివరించాలని పిలుపునిచ్చారు. కష్టపడ్డవారికి గుర్తింపు ఉంటుందని భరోసానిచ్చారు. సమ్మేళనంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గోస్కుల రవి, కేడీసీసీబీ డైరెక్టర్ ఏనుగు తిరుపతిరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం హన్మాండ్లు, సీనియర్ నాయకుడు ఏశ తిరుపతి, బాల్‌రెడ్డి, తిరుపతి, శ్రీనివాస్‌రెడ్డి, లచ్చయ్య, సురేందర్‌రెడ్డి, వేణుగోపాల్, అంజనీకుమార్, శంకర్, లక్ష్మణ్‌తోపాటు కార్యకర్తలు పాల్గొన్నారు.