హుజూరాబాద్ రూరల్, జూలై 21: వర్షాభావ పరిస్థితులు రైతులనే కాకుండా విత్తన పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. సాధారణంగా వానకాలం సీజన్ ప్రారంభంలో విత్తన విక్రయాలు జోరుగా సాగుతాయి. అయితే ఈ సీజన్లో ఆశించిన స్థాయిలో వానలు లేక సాగు విస్తీర్ణం తగ్గి, విత్తనాలకు డిమాండ్ ఒకసారిగా పడిపోయింది. హుజూరాబాద్ ప్రాంతంలో సుమారు 15 ప్రాసింగ్ సీడ్ పాంట్లు ఉండగా, యాసంగిలో రైతులకు ఏజెంట్లతో సీడ్ అందజేసి, తిరిగి కొనుగోలు చేశారు. వాటిని ప్రాసెసింగ్ చేసి ఏటా తెలంగాణ, ఆంధ్రా, తమిళనాడు, కర్ణాటకతోపాటు తదితర రాష్ర్టాలకు విక్రయిస్తారు.
అయితే విత్తనంగా విక్రయించాలనే ఉద్దేశంతో రైతుల నుంచి భారీ మొత్తంలో కొనుగోలు చేసిన ధాన్యం, గోదాముల్లోనే నిల్వ ఉండిపోగా, సీడ్ ప్లాంట్ యజమానులు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదురొంటున్నారు. రైతుల నుంచి కొన్న విత్తన ధాన్యానికి చెల్లించాల్సిన డబ్బులు విక్రయాలపై ఆధారపడి ఉండగా, ప్రస్తుతం కొనేవారు లేకపోవడంతో వారికి చెల్లింపులు ఆలస్యమయ్యే పరిస్థితి ఏర్పడిందని యజమానులు వాపోతున్నారు. మరోవైపు బ్యాంకు వడ్డీలు, గోదాం అద్దెలు, నిర్వహణ ఖర్చులు పెరుగుతుండడంతో కోట్ల రూపాయల నష్టం వచ్చే అవకాశం ఉందని, ప్రభుత్వం తమను కాపాడాలని వేడుకుంటున్నారు.