Peddi Sudarshan Reddy | చిగురుమామిడి, జూలై 31 : తెలంగాణ ఉద్యమ సహచరుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి తెలంగాణ ఉద్యమానికి బీఆర్ఎస్ పార్టీకి వ్యక్తిగతంగా తమకు తీవ్ర లోటును మిగిల్చిందని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వోడితల సతీష్ కుమార్ అన్నారు. మంచి ఆప్తుడిని కోల్పోవడం తీవ్ర ఆవేదనకు గురి చేస్తుందని అన్నారు. మూడు రోజుల క్రితం ఆస్పత్రికి వెళ్లి చూసి, కుటుంబ సభ్యులతో వైద్యులతో మాట్లాడడం జరిగిందని గుర్తు చేశారు.
త్వరలో కోలుకొని మళ్లీ ప్రజల్లోకి వస్తాడని ఆశించానని అన్నారు. వారు లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని సతీష్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సుదీర్ఘ రాజకీయ అనుబంధం ఉన్న పెద్ది సుదర్శన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎనలేని సేవలను అందించాలని కొనియాడారు. భావితరాలకు వారి ఆశయాలను కొనసాగించడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని సతీష్ కుమార్ పేర్కొన్నారు.