మంథని రూరల్, మార్చి4 : ముందుచూపుతో మంథని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన చరిత్ర బీఆర్ఎస్దేనని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ స్పష్టం చేశారు. కేసీఆర్ నాయకత్వంలో తాము ఓట్ల కోసం కాకుండా ప్రజల కోసమే పని చేశామని స్పష్టం చేశారు. కానీ, కాంగ్రెస్ ఏనాడూ వెలుగులు అందించాలనే ఆలోచన చేయలేదని, పైగా బద్నాం చేసే పనులు చేస్తున్నదని మండిపడ్డారు. ఎంతో విలువైన గోదావరి నీళ్లను సముద్రం పాలు చేసిన ఘనత కూడా ఆ పార్టీదేనని విమర్శించారు. మంగళవారం మంథని మండలం అడవిసోమన్ పల్లి గ్రామంలోని మానేరుపై నిర్మించిన చెక్ డ్యాంను సందర్శించి, అందులో చేపలు పడుతున్న మత్స్యకారులను కలిసి ఉపాధి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్పగా ఆలోచన చేసి మానేరువాగుపై అడవిసోమన్‌పల్లి గ్రామం వద్ద చెక్ డ్యాం నిర్మాణం చేపట్టారని, అయితే, దీనిపై అప్పుడు మంథని ఎమ్మెల్యేగా ఉన్న శ్రీధర్‌బాబు రాద్దాంతం చేశారని గుర్తు చేశారు.
అయితే, ఈ చెక్‌డ్యాం వల్ల ప్రస్తుతం భూగర్బజలాలు పెరిగాయని, మత్స్యసంపదతో అనేక కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయని వివరించారు. అనేక ఏండ్లు ఈ ప్రాంతాన్ని పాలించిన ప్రస్తుత మంత్రి కుటుంబం ఏనాడూ ఇక్కడి ప్రజల గురించి ఆలోచన చేయలేదన్నారు. ప్రస్తుతం చెక్ డ్యాం వల్ల జరుగుతున్న ప్రయోజనాలపై మంత్రి ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడిన మంత్రి చెక్‌డ్యాంను చూసి తన తప్పు తెలుసుకొని ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంత ప్రజలపై చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టును వినియోగంలోకి తీసుకురావాలన్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఏగోళపు శంకర్ గౌడ్, నాయకులు గట్టు శివ శంకర్, గట్టు జనార్దన్, నగునూరి శివ శంకర్ గౌడ్, కడారి సంపత్, డాక్టర్ మొగిళి, సమ్మయ్య, ననుబోతుల బాపు, మల్లేశ్ ఉన్నారు.