Godavarikhani | కోల్ సిటీ, డిసెంబర్ 7: ‘రోడ్లపై తిరిగే వీధి కుక్కలు, పశువులను షెల్టర్లకు తరలించండి. బస్టాండ్లు, దవాఖానలు, క్రీడా ప్రాంగణాలు, విద్యా సంస్థల వద్ద కంచె నిర్మించండి. కుక్కలను పట్టుకొని జంతు జనన నియంత్రణ (ఏబీసీ) నిబంధనల ప్రకారం వ్యాక్సినేట్, స్టెరిలైజ్ చేయండి. పట్టుకున్న చోట వదిలేయకుండా షెల్టర్లకు తరలించండి. అమలు బాధ్యత స్థానిక సంస్థలకు అప్పగించండి’ అంటూ గత నవంబర్ 8న ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఈ మార్గదర్శకాలు అమలుకాని పక్షంలో సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని తీర్పు వెల్లడించింది. కోర్టు ఆదేశించి సరిగ్గా నెల గడిచింది. ఐనప్పటికీ శాశ్వత నివారణ చర్యలపై అధికార యంత్రాంగం దృష్టి సారించలేకపోతోంది. గత కొంతకాలంగా గోదావరిఖని నగరంలో వీధి కుక్కలు, పశువుల సంచారంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న నేపథ్యంలో కోర్టు ఆదేశాలు కొంత ఊరట కలిగించింది. అయినప్పటికీ పశువులు, వీధి కుక్కలు రోడ్లపై యథేచ్ఛగా సంచరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.
నగరంలోని జవహర్ నగర్ గల క్రీడా మైదానంలో రోజూ వ్యాయామం కోసం వచ్చే యువతీ, యువకులు, వృద్ధులకు స్టేడియంలో కుక్కల బెడద తీవ్ర సమస్యగా మారింది.
గోదావరిఖని ప్రభుత్వ దవాఖానలో రోజుకు వెయ్యికి పైగా ఓపీ కేసులు నమోదవుతుంటే అందులో 30 శాతం కుక్క కాటు బాధితులే ఉండటం గమనార్హం. గడిచిన రెండు నెలల్లో సుమారు వెయ్యి మందికి కుక్క కాటు చికిత్స అందించినట్లు రికార్డులు చెబుతున్నాయి. కుక్కల బెడద తప్పించేందుకు రామగుండం నగర పాలక సంస్థ శ్రీనగర్ కాలనీ శివారులో కుక్కలకు కు.ని ఆపరేషన్ల కోసం నిర్మించిన భవనం నిరుపయోగంగా ఉంటోంది. గతంలో ఒకే దఫా కు.ని శస్త్ర చికిత్సలు చేసి వాటిని పట్టుకున్న చోటనే వదిలిపెట్టారు. ఇకపోతే రోడ్లపై తిరిగే పశువులను పట్టుకొని సంజయ్ గాంధీనగర్లో గల గోశాలకు తరలించడం, ఆపై యజమానులు జరిమానాలు చెల్లించి మళ్లీ బయటకు తీసుకరావడం, వాటిని యథేచ్ఛగా రోడ్లపై వదలడం నిత్యకృత్యంగా మారుతోంది. గత నెల 70కి పైగా పశువులను గోశాలకు తరలించగా వాటిలో 30 పశువులను యజమానులకు అప్పగించారు. కోర్టు ఆదేశానుసారం ఇప్పటికైనా వీటి నివారణకు శాశ్వత చర్యల్లో భాగంగా షెల్టర్లకు తరలించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.