రామడుగు, సెప్టెంబర్ 3 : రామడుగు మండలంలోని వెలిచాల గ్రామస్తులు ఇన్నేండ్లు అనుభవించిన కష్టాలు గట్టెక్కాయి. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, రామడుగు సింగిల్విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వరరావు చేసిన కృషితో అతి తక్కువ సమయంలో హైలెవల్ వంతెన నిర్మాణం పూర్తయింది. వెలిచాల గ్రామస్తులు నిత్యం అనేక పనులమీద కొత్తపల్లి మీదుగా కరీంనగర్ వెళ్తుంటారు. కాగా, వానకాలం పైనుంచి వచ్చే వరదనీరు వెలిచాల-కొత్తపల్లి మధ్యన ఉన్న రోడ్డాం(కల్వర్టు) ద్వారా కొత్తపల్లి చెరువులోకి చేరుకుంటుంది.
అయితే, కల్వర్టు తక్కువ ఎత్తులో ఉండడంతో వరద ఉధృతికి కొన్ని రోజుల తరబడి రాకపోకలు నిలిచిపోయేవి. అంతేకాకుండా, జగిత్యాల బైపాస్ సైతం ఇదే రోడ్డు కావడంతో భారీ వాహనాలు సైతం ఎక్కడివక్కడే నిలిచిపోయేవి. దీంతో వీర్ల వెంకటేశ్వరరావు గత ప్రభుత్వంలో బీసీ సంక్షేమ శాఖా మంత్రిగా పనిచేసిన ప్రస్తుత కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ను కలిసి ఇక్కడ హైలెవల్ వంతెన నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. స్పందించిన ఆయన అప్పుడు రూ.4.40 కోట్లు మంజూరు చేయించి, గతేడాది మే 13న భూమిపూజ చేశారు. గుత్తేదారు గతేడాది డిసెంబర్ 23న పనులు ప్రారంభించి కేవలం ఆరు నెలల్లోనే వంతెన నిర్మాణం పూర్తిచేసి అందుబాటులోకి తెచ్చారు.