బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీంపై కాంగ్రెస్ సర్కారు కత్తి గడుతున్నది. నిరుపేద ఎస్సీ, ఎస్టీ పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్యనందించే లక్ష్యంతో కొన్నేళ్లుగా సక్రమంగా నడిచిన ఈ స్కీంను నిర్వీర్యం చేస్తున్నది. మూడేళ్లుగా నిధులు ఇవ్వకుండా చిన్నచూపు చూస్తుండడంతో పట్టణాల్లో పేరొందిన ప్రైవేట్ స్కూళ్లు బీఏఎస్ స్కీం నుంచి తప్పుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో పల్లెలు, మండల కేంద్రాల్లో ఉన్న ద్వితీయ శ్రేణి ప్రైవేట్ పాఠశాలలను ఎంపిక చేస్తుండగా.. తల్లిదండ్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లా, పట్టణ కేంద్రాల్లో సకల సౌకర్యాలుండి మెరుగైన ఫలితాలు సాధించిన ప్రైవేట్ స్కూళ్లను కాదని, మారుమూల ప్రాంతాల్లో సరైన వసతులు లేని స్కూళ్లను ఎంపిక చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
జగిత్యాల, జూన్ 22 (నమస్తే తెలంగాణ): ఎస్సీ, ఎస్టీ పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించేందుకు ఆర్థిక సాయం అందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దాదాపు 20 ఏళ్ల క్రితమే సంకల్పించాయి. ప్రైవేట్ స్కూళ్లలో పిల్లలను చేర్పించి వారికి ప్రభుత్వమే ఫీజు చెల్లించే విధానాన్ని తీసుకొచ్చాయి. ‘బెస్ట్ అవైలబుల్ స్కూల్స్’ (బీఏఎస్) పథకాన్ని ప్రవేశ పెట్టాయి. ప్రతి జిల్లాలో బెస్ట్ ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలను ప్రభుత్వం గుర్తించి, ఆ విద్యార్థులకు అడ్మిషన్లను కల్పిస్తున్నాయి. అడ్మిషన్లు పొందిన పిల్లలకు బోధన, వసతికి సంబంధించిన డబ్బును చెల్లిస్తున్నాయి.
ఆ మేరకు షెడ్యూల్ కులాల విద్యార్థులకు ఒకటో తరగతి, 5వ తరగతిలో.. గిరిజన విద్యార్థులకు 1, 5, 8వ తరగతుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. జగిత్యాల జిల్లాలో షెడ్యూల్ కులాలకు సంబంధించి ప్రతి విద్యా సంవత్సరం ప్రాథమిక తరగతుల్లో 75 మంది విద్యార్థులకు, ప్రాథమికోన్నత తరగతుల్లో 76 మందికి అవకాశం కల్పిస్తున్నారు. గిరిజన విభాగంలో 30 మందిని చేరుస్తున్నారు.
బెస్ట్ అవైలబుల్ స్కూల్స్‌లో ప్రవేశం పొందే విద్యార్థులకు సామర్థ్య పరీక్షను నిర్వహించి విద్యార్థులను ఎంపిక చేస్తుండగా, ఎంపికైన ప్రాథమిక తరగతి విద్యార్థికి ఏడాదికి రూ.28వేలు, ప్రాథమికోన్నత తరగతుల విద్యార్థికి (వసతితో కలిపి) రూ.42వేలు చెల్లిస్తున్నారు. ప్రాథమికోన్నత విద్యను చదివే విద్యార్థి వసతి గృహంలో ఉండడానికి ఇష్టపడకపోతే అతడికి ఫీజుగా రూ.28 వేలు చెల్లిస్తున్నారు. గిరిజన విభాగంలోనూ ఇదే పద్ధతిని అవలంబిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో 800కు పైగా షెడ్యూల్ కులాల విద్యార్థులు, 150కి పైగా గిరిజన విభాగ విద్యార్థులు బీఏఎస్‌లో అభ్యసిస్తున్నారు.
దాదాపు మూడేళ్లుగా చెల్లింపులు సున్నా
కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాతి నుంచి బీఏఎస్ స్కీం చెల్లింపులు ఆగిపోయాయి. దాదాపు మూడేళ్లుగా డబ్బులు ఇవ్వడం లేదు. జగిత్యాల జిల్లాలో చూస్తే.. ఏటా షెడ్యుల్ కులాలకు సంబంధించిన ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యార్థులకు కలిపి రూ.53 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే గిరిజన విభాగానికి చెందిన విద్యార్థులకు రూ.10 లక్షలు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే దాదాపు మూడేండ్లుగా ప్రైవేట్ యాజమాన్యాలకు ప్రభుత్వం చెల్లింపులు జరపలేదు.
ప్రస్తుతం నాలుగు విద్యా సంవత్సరాలకు సంబంధించి ప్రభుత్వం బకాయిపడింది. పాఠశాలల నిర్వాహకులు కలెక్టరేట్లో ఉన్న ఎస్సీ వెల్ఫేర్ కార్యాలయం చుట్టూ తిరిగీ తిరిగీ వేసారి పోతున్నారు. నిధుల చెల్లింపు విషయం తమ పరిధిలో లేదని, తాము ఏమి చేయలేమని సంబంధిత శాఖ అధికారులు చెబుతుండడంతో తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. ప్రభుత్వం నుంచి నిధుల విడుదల లేకపోవడంతో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు బీఏఎస్ స్కీమ్ నుంచి బయటకు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాయి.
విరమించుకున్న ప్రైవేట్ పాఠశాలలు
దాదాపుగా మూడేళ్ల నుంచి నిధుల మంజూరు లేకపోవడంతో కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని ప్రముఖ ప్రైవేట్ స్కూళ్లు ‘బీఏఎస్’ నుంచి తప్పుకొన్నాయి. పదేళ్ల క్రితం అధికారులు జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ పాఠశాలలను ప్రత్యక్షంగా పరిశీలించారు. జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, ధర్మపురి, రాయికల్ లాంటి పట్టణాల్లో మొత్తం 15 ప్రైవేట్ పాఠశాలలను ఎంపిక చేసి విద్యార్థులను చేర్పించారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.
ప్రస్తుతం ఈ విద్యా సంవత్సరానికి పరిశీలిస్తే కేవలం నాలుగు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ మాత్రమే ఉన్నాయి. అవి కూడా మండల, గ్రామాలకు చెందినవే! రెండేళ్ల క్రితం స్కీమ్ పరిధిలో ఉన్న అన్ని ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వం బకాయిలు ఇవ్వకపోవడంతో వైదొలిగిపోయాయి. దీంతో విధిలేని పరిస్థితుల్లో అధికారులు మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రైవేట్ పాఠశాలలను బీఏఎస్ స్కూల్స్‌గా ఎంపిక చేయగా, ప్రస్తుతం కొడిమ్యాల, మల్యాల, బుగ్గారం మండల కేంద్రాల్లో మూడు ప్రైవేట్ పాఠశాలలు, నాచుపల్లిలో ఒక్క స్కూల్ బీఏఎస్ స్కీం పరిధిలో ఉన్నాయి. ఇంచుమించు ఇలాంటి పరిస్థితులే మిగతా జిల్లాల్లోనూ ఉన్నాయి.
తల్లిదండ్రుల్లో అసంతృప్తి
ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడం వల్ల బీఏఎస్‌లో పిల్లలను చదివించే తల్లిదండ్రులు బతుకుదెరువు కోసం పల్లెలకు పయ నం కావాల్సిన దుస్థితి దాపురించింది. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు విద్యాభ్యాసం చేసే పిల్లలకు బీఏఎస్ స్కీమ్‌లో వసతి సౌ కర్యం లేదు. బోధన మాత్రమే ఉంటుంది. విద్యార్థి కేవలం డే స్కా లర్గానే ఉంటాడు. ఇప్పుడు ఎంపిక చేసిన నాలుగు పాఠశాలల్లో ప్రాథమిక విద్య కోసం చేరిన పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లల చదువుల కోసం గ్రామీణ, మండల కేంద్రాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి ఉన్నది.
జగిత్యాలతోపాటు ఇతర పట్టణాల్లో ఉన్న ప్రైవేట్ పాఠశాలల్లో పిల్లలను చేర్పిస్తే, అదే పట్టణంలో తల్లిదండ్రులు నివాసం ఏర్పాటు చేసుకొని, ఏదో ఒక ఉపాధి పొందేందుకు అవకాశాలు ఉండేవి. అయితే ఇప్పుడు పిల్లల కోసం పల్లెలకు పోవాలంటే ఇబ్బందేనని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రాథమికోన్నత విద్యను ఆర్జించే విద్యార్థులకు పాఠశాలల్లోనే వసతి సౌకర్యం కల్పిస్తారు. అయితే ప్రస్తుతం ఎంపిక చేసిన నాలుగు ప్రైవేట్ పాఠశాలల్లో రెండు చోట్ల మాత్రమే వసతిగృహ సౌకర్యం ఉన్నది. మిగిలిన రెండు స్కూళ్లోల వసతిగృహ సౌకర్యం లేదు. దీంతో రెండు పాఠశాలల్లో ప్రవేశాలు పొందిన ప్రాథమికోన్నత విద్యార్థుల తల్లిదండ్రులు సైతం అదే ఊరిలో నివాసం ఏర్పాటు చేసుకొని పిల్లలను చదివించుకోవాల్సిన పరిస్థితి ఉన్నది.
ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లా, పట్టణ కేంద్రాల్లో సకల సౌకర్యాలుండి మెరుగైన ఫలితాలు సాధించిన ప్రైవేట్ స్కూళ్లను కాదని, మారుమూల ప్రాం తాల్లో సరైన వసతులు లేని స్కూళ్లను ఎంపిక చేయడం ఎంత వరకు సబబు అని ఆగ్రహిస్తున్నారు. కాగా, ఈ విషయమై గతంలో బెస్ట్ అవలెబుల్ స్కూ ల్స్ జాబితాలో ఉండి, ఇప్పుడు విరమించుకున్న ప్రైవేట్ యాజమాన్యాల నిర్వాహకులు మాట్లాడుతూ.. ‘ప్రభుత్వం ఏళ్ల నుంచి లక్షలాది రూపాయల బకాయిలను చెల్లించకుండా పెండింగ్‌లో పెడుతున్నది. ఎన్ని సార్లు అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా ప్రయోజనం లేదు. అందుకే అందులో నుంచి బీఏఎస్ స్కీం నుంచి విరమించుకున్నాం’ అని స్పష్టం చేస్తున్నారు. ‘అయినా ఇప్పటికీ మాకు ఇబ్బందులు తప్పడం లేదు. గతంలో మా పాఠశాలల్లో చేరిన విద్యార్థులను కంటిన్యూ చేస్తున్నాం. వారికి సంబంధించిన ఫీజులు, వసతి గృహ రుసుం ఇంత వరకు రావడం లేదు. వారిని సైతం తొలగించాలని అధికారులకు విన్నవిస్తున్నాం’ అని చెప్పారు.