Choppadandi | గంగాధర, సెప్టెంబర్ 8 : గౌరవంగా ఉండే శాసనసభను రేవంత్ రెడ్డి ప్రభుత్వం కౌరవ సభగా మార్చిందని, బిఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై దాడులు చేయడం దుశ్శాసన పర్వాన్ని తలపించిందని, బిఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై దాడులు చేయించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలియుగ దుశ్శాసనుడిలా నిలిచాడని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఆవరణలో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై చేసిన దాడులకు నిరసనగా మంగళవారం గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో కరీంనగర్ జగిత్యాల జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం భారత రాజ్యాంగ స్ఫూర్తిగా చట్టసభలను నడిపించాలని చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీల గురించి నిలదీసేందుకు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, నల్లరంగు చొక్కాలు వేసుకున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పోలీసులు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను,ఎమ్మెల్సీలను అసెంబ్లీ గేటు బయట అడ్డుకున్నారని, బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను తోసి వేయడంతో గాయాలైనాయని, మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై మగ పోలీసులు దాడి చేయడం హేయమైన చర్య అని దుయపడ్డారు. అలాగే మహిళా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి చీర లాగితే ఆమె కన్నీళ్లు పెట్టుకునే దృశ్యం రేవంత్ రెడ్డి దుశ్శాసనపర్వానికి నిదర్శనమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరుతో గౌరవ సభ కాస్త కౌరవ సభగా మారిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంచి బుద్ధిని ప్రసాదించి, 6 గ్యారెంటీలు, 420 హామీలను నెరవేర్చేలా చూడాలని అంబేద్కర్ కు వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు. ఇక్కడ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సాగి మహిపాల్ రావు, రామడుగు బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గంట్ల జితేందర్ రెడ్డి, మల్యాల మాజీ ఎంపీపీ తైదల శ్రీలత, బిఆర్ఎస్వి జిల్లా అధ్యక్షుడు ద్యావ మధుసూదన్ రెడ్డి, నాయకులు కంకణాల విజెందర్ రెడ్డి, వేముల దామోదర్, మడ్లపెల్లి రమేష్, పుట్కం రవీంద్రనాథ్ ఠాగూర్, ముక్కెర మల్లేశం, తోట మహిపాల్, నిమ్మనవేని ప్రభాకర్, తడిగొప్పుల రమేష్, పొన్నం పర్శరాములు, లింగాల దుర్గయ్య, దోమకొండ మల్లయ్య, మామిడిపల్లి అఖిల్, జలంధర్ రెడ్డి, గుంటకు జితేందర్, గంగాధర మోహన్ తదితరులు పాల్గొన్నారు.