జగిత్యాల, సెప్టెంబర్ 23: రాష్ట్రంలోని దవాఖానల పరిస్థితిపై అధ్యయనం చేసేందుకు సిద్ధమైన బీఆర్ఎస్ నిజనిర్ధారణ కమిటీ సభ్యులను కాంగ్రెస్ ప్రభుత్వం హౌస్ అరెస్ట్ చేయడం దురదృష్టకరమని జగిత్యాల జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత పేర్కొన్నారు. రాష్ట్రంలో వైద్యారోగ్య వ్యవస్థ దిగజారిందని విమర్శించారు. ఈ మేరకు సోమవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు.
దవాఖానల పరిస్థితిపై అధ్యయనానికి మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్ రాజయ్య, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, మా జీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్‌తో బీఆర్ఎస్ అధిష్టానం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. నిజానిర్ధారణకు వెళ్లేందుకు సిద్ధమైన కమిటీ సభ్యులను హౌస్ అరెస్ట్ చేయడమంటే వాస్తవాలు దాచడమేనన్నారు. కమిటీ పర్యటిస్తే ప్రభుత్వానికి ఎందుకంత భయమని ప్రశ్నించారు. ఎలాంటి దాపరికం లేకపోతే త్రిసభ్య కమిటీ దర్యాప్తునకు సహకరించాలని డిమాండ్ చేశారు.
నిపుణులైన డాక్టర్ల బృందం, గాంధీ దవాఖానకు వెళ్తుంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతుందో అర్థం కావడంలేదన్నారు. గాంధీ దవాఖానలో తమ పార్టీ ప్రస్తావించిన మాతా శిశు మరణాల విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దాచిపెడుతుందా..? లేదా వారి పరిపాలన వైఫల్యం బయటకు వస్తుందోనని భయపడుతున్నదా..? అని ప్రశ్నించారు. కమిటీ నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికే నివేదిస్తుందని, తద్వారా సమస్యలు పరిష్కారం చేయవచ్చనే సోయి ప్రభుత్వానికి లేకపోవడం విచారకరమన్నారు.