కొడిమ్యాల,సెప్టెంబర్ 20: బీఆర్ఎస్ సర్కారు పథకాలను కాపీకొట్టే కాంగ్రెస్‌ను పల్లెల పొలిమేర్ల నుంచి తరిమికొట్టాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ పిలుపునిచ్చారు. ప్రజల కోసం నిరంతరం పరితపిస్తున్న బీఆర్ఎస్ను ఆదరించాలని కోరారు. గ్యారంటీల పేరిట ప్రజలను దగా చేస్తున్న కాంగ్రెస్ నాయకులు.. దమ్ముంటే వారి పాలిత రాష్ర్టాల్లో అమలు చేయాలని డిమాండ్ చేశారు.
జగిత్యాల జిల్లా కొడిమ్యాల సర్పంచ్ ఏలేటి మమత-నర్సింహారెడ్డి, కొడిమ్యాల, చెప్యాల, పూడూర్ ఉప సర్పంచ్‌లు కాముని శ్రీనివాస్, బండ లింగారెడ్డి, గుంటి ఎల్లయ్య, రామకిష్టాపూర్కు చెందిన బోనగాని మల్లేశం, వైఎస్సార్టీపీ జిల్లా అధక్షురాలు గాదె స్రవంతి, కోనాపూర్, డబ్బుతిమ్మాయపల్లి, అప్పారావుపేటకు చెందిన వెయ్యి మంది కాంగ్రెస్, బీజేపీ నాయకులు బీఆర్ఎస్లో చేరారు. వీరికి వినోద్.. ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌తో కలిసి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. వచ్చే ఐదేండ్లలో వెనుకబడ్డ ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసానిచ్చేలా సీఎం కేసీఆర్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని చెప్పారు.
నవంబర్‌లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని, డిసెంబర్లో ఎన్నికలు ఉంటాయన్నారు. ఇందుకు పార్టీ శ్రేణులు సర్వసన్నద్ధంగా ఉండాలని ఉద్బోధించారు. సుంకెను రెండోసారి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కేసీఆర్‌ను మూడోసారి ముఖ్యమంత్రిగా చూడాలన్నారు. గతంలో వైద్య విద్యకోసం మన విద్యార్థులు విదేశాలకు వెళ్లాల్సివచ్చేదని, కానీ తెలంగాణలో జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడంతో ఇక్కడే డాక్టర్లుగా తయారయ్యే అవకాశం వచ్చిందని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే సుంకె మాట్లాడుతూ కాంగ్రెస్‌కు ఓటేస్తే రాష్ట్రం అంధకారమవుతుందని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సీఎం కేసీఆర్ సహకారంతో చొప్పదండి నియోజకవర్గాన్ని రూ. 1700 కోట్లతో అభివృద్ధి చేశామని తెలిపారు. కొండగట్టు దేవాలయ అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామన్నారు. గతంలో కొడిమ్యాల మండలానికి ప్రాతినిథ్యం వహించిన కాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డి ప్రజల బాధలను పట్టించుకోలేదని విమర్శించారు. రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ‘కాంగ్రెసోళ్లను ఖతం చేయాలి.. బీజేపీ వాళ్లను బొందపెట్టాలి’ అని ప్రజలకు పిలుపునిచ్చారు. జగిత్యాల జడ్పీ చైర్పర్సన్ దావ వసంత మాట్లాడుతూ తెలంగాణలో ‘కారుకు ఎదురులేదని.. కేసీఆర్‌కు తిరుగు లేదు’ అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.