కార్పొరేషన్, మే 31: కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా నిర్వహించే స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో కరీంనగర్ నగరపాలక సంస్థ ర్యాంకు మెరుగుపడేనా అంటే ఆ అవకాశాలు తక్కువేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నగరాల పరిశుభ్రత, పారిశుధ్య స్థాయిలను అంచనా వేసే ఈ సర్వేలో బీఆర్ఎస్ హయాంలో జాతీయ స్థాయిలో వందలోపు ర్యాంకు సాధించగా.. రాష్ట్ర స్థాయిలో రెండు, మూడు స్థానాల్లో నిలిచింది. గత రెండేళ్లుగా మాత్రం ర్యాంకింగ్‌లో వెనుకబడుతున్నది.
స్వచ్ఛ సర్వేక్షణ్‌లో నగర ప్రజల ఫీడ్ బ్యాక్‌తో పాటు నగరంలో పారిశుధ్య పనులు, రీ సైక్లింగ్ తీరు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, ట్రీట్మెంట్ ప్లాంట్ పనితీరు, ప్రజా మరుగుదొడ్లు, పబ్లిక్ టాయిలెట్స్ పనులన్నింటినీ పరిగణనలోకి తీసుకొని మార్కులు వేస్తారు. కానీ, ఈసారి వీటిల్లో ఏది కూడా పూర్తిస్థాయిలో చేరుకోలేకపోయారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా స్వచ్ఛ సర్వేక్షణ్‌లో నగరపాలక సంస్థ అధికారులు ఈసారి మొదటి నుంచి కూడా నిర్లక్ష్యంగానే వ్యవహరించారన్న అభిప్రాయాలు వస్తున్నాయి. పారిశుధ్య పనుల విషయంలో నిర్లక్ష్యం చూపించారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
గతేడాది 166వ ర్యాంకు
కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీని ప్రారంభించినప్పటి నుంచి కూడా మెరుగైన స్థానాన్ని కాపాడుకున్న కరీంనగర్ నగరపాలక సంస్థ గతేడాది మాత్రం చాలా వెనుకబడి 166వ ర్యాంకుకు పరిమితమైంది. ఈ సారి కూడా పారిశుధ్య పనులు నగరవ్యాప్తంగా అధ్వానంగా ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి. రోడ్లపై లిప్టర్ బిన్స్ ఎక్కడ ఏర్పాటు అనేది లేకుండాపోయింది. పబ్లిక్ టాయిలెట్స్ పరిశుభ్రతను అధికారులు పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఇక నగరవాసుల పీడ్ బ్యాక్ విషయంలోనూ నిర్లక్ష్యమే చూపించారన్న విమర్శలు ఉన్నాయి.
సమయం దగ్గర పడినా తర్వాత ఈ విభాగం అధికారులు హడాహుడిగా పారిశుధ్య జవాన్లు, మహిళా సంఘాల సభ్యులతో పీడ్‌బ్యాక్ పనులు చేపట్టినా అవి కూడా పూర్తిస్థాయిలో జరుగలేదని తెలుస్తోంది. ఇక ఎస్టీపీ (స్లడ్ ట్రీట్మెంట్ ప్లాంట్) పనితీరు అస్తవ్యస్థంగా మారడంతో ఈ విషయంలో మార్కులు తగ్గే పరిస్థితి కనిపిస్తున్నది. నగరంలో తడి చెత్తతో వర్మి కంపోస్టు చేయించే విషయంలో అధికారులు ఎప్పుడో పక్కకు తప్పారన్న విమర్శలు ఉన్నాయి. వీటిల్లోనూ మార్కులు తగ్గే పరిస్థితి వచ్చిందన్న అభిప్రాయాలు వస్తున్నాయి. కాగా, ఇటీవల నగరపాలక సంస్థ పరిధిలో స్వచ్ఛ సర్వేక్షన్‌కు చెందిన కేంద్ర బృందం పర్యటించి నగరంలోని పలు కాలనీల పరిస్థితి, డంప్‌యార్డు, పబ్లిక్ టాయిలెట్స్‌ను పరిశీలించింది.
ఏటా పడిపోతున్న ర్యాంకు
స్వచ్ఛ సర్వేక్షణ్‌లో కరీంనగర్ నగరపాలక సంస్థకు గతేడాది 166వ ర్యాంకుకు పడిపోయింది. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని మిగిలిన మున్సిపాలిటీలు ప్రతి ఏటా తమ ర్యాంకును అంతో ఇంతో మెరుగుపర్చుకుంటుంటే కరీంనగర్ మాత్రం డీలాపడుతున్నది. అంతకు ముందు ఏడాది స్వచ్చ సర్వేక్షణ్‌లో 81ర్యాంకు సాధించగా.. గతేడాది 166కు చేరింది. ఈ సారి మరింతగా దిగజారే అవకాశాలే కనిపిస్తున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా నగరపాలక అధికారులు స్వచ్ఛ సర్వేక్షణ్ విషయంలో దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వస్తున్నాయి.