హుస్నాబాద్/ చిగురుమామిడి, సెప్టెంబర్ 21: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని, విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ పిలుపునిచ్చారు. రిజర్వేషన్ ఏది వచ్చినా మెజార్టీ సర్పంచ్, ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకొని సత్తాచాటుదామని, బీఆర్ఎస్ కార్యకర్తల బలమేమిటో నిరూపించుకుందామన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారం(ఎస్) గ్రామ శివారులోని శుభం గార్డెన్స్‌లో బీఆర్ఎస్ హుస్నాబాద్ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఇక నుంచి గ్రామ స్థాయి సమావేశాలు నిర్వహించి పార్టీని బలోపేతం చేస్తామన్నారు. పార్టీని నమ్ముకొని ఇన్నేండ్లు ఉన్న కార్యకర్తలకు ప్రాధాన్యతనిస్తామని చెప్పారు.
త్వరలో జరుగబోయే పట్టభద్రుల ఎన్నికలను కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా నడుచుకునేందుకు సిద్ధంగా ఉన్నామని, ఐక్యంగా ఉండి పార్టీని ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను గ్రామస్థాయిలో ఎండగట్టాలని కార్యకర్తలకు సూచించారు. స్థానికంగా గెలిచిన ఎమ్మెల్యే మంత్రి అయినప్పటికీ నియోజకవర్గంలో ఒక్క అభివృద్ధి పని కూడా కావడం లేదని విమర్శించారు. మంత్రికి మాటలు తప్ప చేతలు చేతకావన్నారు. ఆయనకు హైదరాబాద్, కరీంనగర్‌పై ఉన్న ప్రేమ హుస్నాబాద్‌పై లేదన్నారు. నెలరోజుల్లో గౌరవెల్లి ద్వారా నీళ్లందిస్తామని పది నెలలు గడిచినా ఏం జరిగిందో ప్రజలకు వివరించాలన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో మన సత్తా ఏమిటో నిరూపించి బీఆర్ఎస్ పార్టీతో పాటు కార్యకర్తల ఐక్యత ఏమిటో చాటుదామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అంతకుముందు బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, హన్మకొండ జడ్పీ మాజీ చైర్మన్ డాక్టర్ సుధీర్‌కుమార్, సిద్దిపేట జడ్పీ వైస్‌చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి కర్ర శ్రీహరి, మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకట్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
ఈ సమావేశం లో మాజీ ఎంపీపీ కొత్తవినీతాశ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ చిగురుమామిడి మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య, సింగిల్ విండో చైర్మన్ జంగా వెంకటరమణారెడ్డి, నాయకులు సాంబారి కొమురయ్య, పెనుకుల తిరుపతి, బెజ్జంకి రాంబాబు, పెసరి రాజేశం, మంకు శ్రీనివాస్ రెడ్డి, అనుమాండ్ల సత్యనారాయణ, కృష్ణమాచారి, మాజీ సర్పంచ్‌లు సన్నీల్ల వెంకటేశం, బోయిని శ్రీనివాస్, గ్రామ శాఖ అధ్యక్షులు ఎసే సిరాజ్, రమేశ్, కొమురయ్య, తిరుపతి, సంపత్ రెడ్డి పాల్గొన్నారు.