local body elections | పాలకుర్తి : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ నాయకులు గెలిచేలా ప్రతీ కార్యకర్త కృషి చేయాలని, ఐకమత్యంగా ముందుకెళ్లాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ సూచించారు. పాలకుర్తి మండలంలోని జీడినగర్ జీఎం ఫంక్షన్ హాల్లో ఆదివారం పాలకుర్తి మండల ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశం జరిగింది.
కాంగ్రెస్ ప్రభుత్వం గత 18 నెలలుగా చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి బీఆర్ఎస్ జండా ఎగిరేసేలా కృషి చేయాలని, నాయకులకు వెన్నుదన్నుగా జిల్లా నాయకత్వం పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకులు ఐకమత్యంతో కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొని జడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచుల స్థానాలు పూర్తిస్థాయిలో మెజార్టీ సాధించేలా కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు. గ్రామాల్లో ఇందిరమ్మ ఇండల్లో జరిగినటువంటి కుంభకోణాలని ప్రజలకు తెలియజేయాలన్నారు.
నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు దక్కకుండా కేవలం కాంగ్రెస్ నాయకులు వాళ్ల అనుబంధ నాయకులకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు కేటాయించుకున్నారని, రైతు భరోసా, రైతు రుణమాఫీ అమలు చేయకపోవడం మూలంగా రైతాంగం పూర్తిగానిరాశ్రే్యులయ్యారని, ఆయన పేర్కొన్నారు.
పాలకుర్తి మండలం బీ ఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా ఉందని, ప్రతీ నాయకుడు కార్యకర్త కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కౌశిక హరి, ముల్కల కొమురయ్య, ముత్యం సంతోష్, మధుసూదన్ రావు, బండారి కిరణ్, మాదాసు శ్రీనివాస్, అల్లం రాజయ్య, మండల నాయకులు పాల్గొన్నారు.