Vyala Harish Reddy | కోల్ సిటీ, జూలై 24: ‘నాలో మరుగుతున్నది తెలంగాణ రక్తమే… స్వరాష్ట్ర సాధనకు కేసీఆర్ ఎంతో కష్టపడ్డరు.. రాష్ట్రం వచ్చాక పదేళ్లలో అద్భుతంగా తీర్చిదిద్దారు… ఆచరణలో సాధ్యం కాని అబద్ధపు హామీలతో ప్రజలను మభ్యపెట్టి మళ్లీ రాష్ర్టాన్ని గుంజుకున్నారు.. కేటీఆర్ ప్రేరణతోనే స్వదేశానికి వచ్చి ప్రజా సేవ నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాను.. వచ్చి రాగానే పోలీస్ కేసులతో భయపెట్టే కుట్రలు చేస్తున్నారు.. భారత న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉంది.. కేసులకు భయపడితే ఇక్కడిదాకా వచ్చేవాడిని కాదు..’ అని వీహెచ్ఎర్ ఫౌండేషన్ ఆధినేత, బీఆర్ఎస్ నాయకుడు వ్యాబ్ల హరీష్ రెడ్డి స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా వీహెచ్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో వివిధ కారణాలతో మృతి చెందిన 19 మంది ఆటో కార్మికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున రూ.1.90 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంకు కనువిప్పు కలిగి ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
పది మంది కడుపుకొట్టడం వల్ల ప్రభుత్వానికి ఒరిగేదేముందని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చాక ఆటో డ్రైవర్లకు జీవన భృతి కల్పిస్తామని ఎజెండాలో పొందుపర్చి మోసం చేస్తున్నారన్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లకు ఆత్మహత్యలే శరణ్యం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాను పూర్తి స్థాయిలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడంతో ఇక వారి పప్పులు ఉడకవని, కొంతమంది కక్ష గట్టి తనపై పదుల సంఖ్యలో అక్రమ కేసులు బనాయించారనీ, కేటీఆర్ ఇచ్చిన ధైర్యంతోనే ఈ ప్రాంతానికి వచ్చి కేసులను ఎదుర్కొంటున్నానని పేర్కొన్నారు. నియోజక వర్గ ప్రజలు న్యాయం వైపే ఉంటారన్న నమ్మకం ఉందన్నారు.
తాను అమెరికాలో ఉండి కూడా గిఫ్ట్ ఏ స్మైల్ ద్వారా ఎంతోమంది నిరుపేద విద్యార్థులకు సాయం అందించానని గుర్తు చేశారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఇకమీదట ప్రజాసేవలో మీ ముందే ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు రమణారెడ్డి, ఐత శివ, తస్నీమ్ భానుతోపాటు వీహెచ్ఆర్ వలంటీర్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.