హైబ్రిడ్ మక్క సేద్యం కరీంనగర్ జిల్లా రైతులకు సిరులు కురిపిస్తున్నది. సాధారణ మక్కతో పోల్చితే విత్తనోత్పత్తి సాగు అధిక లాభాలు తెచ్చిపెడుతున్నది. హుజూరాబాద్ డివిజన్లో అత్యధికంగా సాగవుతుండగా, ఇందులో వీణవంక మండలం ముందువరుసలో నిలుస్తున్నది. ఇక్కడి నుంచే పలు కంపెనీలకు చెందిన ఏజెంట్లు రైతులతో ఒప్పందాలు చేసుకొని ఉత్పత్తి చేయిస్తుండగా, ఇక్కడి సీడ్‌కు మార్కెట్లో భలే డిమాండ్ నెలకొన్నది. అనేక కంపెనీలు వివిధ రాష్ర్టాలకు మూల విత్తనంగా విక్రయిస్తుండగా, అటు వరి, ఇటు మక్క విత్తనోత్పత్తిలో జిల్లా రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో నిలువడం ప్రత్యేకతను సంతరించుకున్నది.
కరీంనగర్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): మక్క విత్తనోత్పత్తిలో కరీంనగర్ జిల్లా రైతులు ఆదర్శంగా నిలుస్తున్నారు. అనేక ప్రైవేట్ సీడ్ కంపెనీల ఏజెంట్లతో ఒప్పందాలు కుదుర్చుకుని జిల్లాలోని ఆరు మండలాల్లో పెద్ద మొత్తంలో విత్తనోత్పత్తి చేస్తున్నారు. సాధారణంగా హుజూరాబాద్ డివిజన్లో ప్రతి యాసంగిలో మక్క అత్యధికంగా సాగు చేస్తారు. ఇల్లందకుంట, వీణవంక, జమ్మికుంట, సైదాపూర్, హుజూరాబాద్ మండలాల్లో ఎక్కువగా సాగవుతుంది.
ఈ యాసంగిలో జిల్లా లో మొత్తం 19,861 ఎకరాల్లో సాగు చేయగా, ఈ ఐదు మండలాల్లోనే 70 శాతానికిపైగా అంటే 13,994.24 ఎకరాల్లో సాగు చేశారు. హైబ్రీడ్‌కు కేరాఫ్‌గా నిలిచిన వీణవంకలో 90 శాతం రైతులు హైబ్రీడ్ మక్కజొన్న విత్తనోత్పత్తి చేస్తున్నారు. ఈ మండలంలోని భేతిగల్, మామిడాలపల్లి, ఎల్బా క, గంగారం, రెడ్డిపల్లి, హిమ్మత్‌నగర్, కోర్కల్, దేశాయ్‌పల్లి, కిష్టంపేట తదితర గ్రామాల్లో రైతులు ఎక్కువగా ఈ హైబ్రీడ్ మక్కను సాగు చేస్తున్నారు. ఈ మండలంలో 2,946.26 ఎకరాల్లో మక్క సాగైతే ఇందులో కేవలం 10 శాతం మాత్రమే సాధారణ మక్కజొన్న ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఇటు ఇల్లందకుంట మండలంలో 5,371.15 ఎకరాల్లో మక్క సాగైంది. ఇక్కడ 50 శాతం రైతులు ముఖ్యంగా బూజునూరు, వంతడుపుల, పాతర్లపల్లి, రాచపల్లి గ్రామాల్లో హైబ్రీడ్ మక్క సాగు చేస్తున్నారు. జమ్మికుంట మండలంలో 50-60శాతం మంది రైతులు 2,957.21 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ముఖ్యంగా కోరపల్లి, విలాసాగర్, వావిలాల, నగురం, పాపక్కపల్లి గ్రామాల రైతులు ఎక్కువగా హైబ్రీడ్ మక్క సాగు చేస్తున్నారు. సైదాపూర్ మండలంలో దాదాపు 30 శాతం రైతులు ముఖ్యంగా రాంచంద్రాపూర్, ఎలబోతారం ఆ చుట్టుపక్కల గ్రామాల్లో హైబ్రీడ్ మక్కను 2,285.32 ఎకరాల్లో సాగు చేస్తున్నారు.
హుజూరాబాద్ మండలంలో ఈ సారి కేవలం 434.30 ఎకరాల్లో మక్క సాగైంది. ఇందులో 50 శాతం రైతులు హైబ్రీడ్ సాగు చేసినట్లు తెలుస్తోంది. జిల్లాలోని ఈ మండలాలే కాకుండా యాసంగిలో హైబ్రీడ్ మక్కసాగుకు అనువైన ప్రాంతాలుగా ఉన్న మానకొండూర్, శంకరపట్నం మండలాలను కూడా విత్తనోత్పత్తి కంపెనీలు ఎంపిక చేసుకుంటున్నాయి.
సీడ్ ఉత్పత్తిలో రాష్ట్రంలోనే ప్రథమం
జిల్లాలో వరితో పాటు మక్క విత్తనోత్పత్తిలో కరీంనగర్ జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంది. వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో విత్తనోత్పత్తి జరిగినా అవి కరీంనగర్ జిల్లా తర్వాతనే ఉన్నాయి. యాసంగిలో విత్తనోత్పత్తికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడం, విత్తన ప్రాసెసింగ్ యూనిట్లు అందుబాటులో ఉండడం, నీటి వసతి కలిగిన భూములు ఎక్కువగా ఉండడంతో అనేక విత్తన కంపెనీలకు కరీంనగర్ జిల్లా నిలయంగా మారింది. ముఖ్యంగా వీణవంక మండలంలోని పలు గ్రామాల్లో వివిధ కంపెనీలకు చెందిన ఆర్గనైజర్లు అత్యధికంగా ఉన్నారు.
మహికో, నూజివీడు, బయోసీడ్, మహేంద్ర, అగ్రీ సీడ్స్ వంటి 40కిపైగా కంపెనీలు ఈ ప్రాంతంలో సీడ్ ఉత్పత్తి చేస్తున్నాయి. మూల విత్తనం సరఫరా చేస్తున్న ఈ కంపెనీలు వచ్చిన దిగుబడిని పూర్తిగా కొనుగోలు చేస్తున్నాయి. ప్రతి సీజన్‌కు ముందు ఆయా కంపెనీల ఆర్గనైజర్లు రైతులకు మధ్య జరిగే అగ్రిమెంట్ ప్రకారం సీడ్ ఉత్పత్తి జరుగుతోంది. హైదరాబాద్‌లో సీడ్ ప్రాసె స్ జరిగిన తర్వాత దేశంలోని మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, తమిళనాడు, కర్నాటకతోపాటు మెజార్టీ రాష్ర్టాలకు ఇక్కడి మూల విత్తనమే సరఫరా అవుతోంది.
మంచి లాభాలను ఆర్జిస్తున్న రైతులు
హైబ్రీడ్ సీడ్ మక్క సాగు చేస్తున్న రైతులు సాధారణ మక్కకంటే మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. సాగుకు ముందే ఆయా కంపెనీల ఆర్గనైజర్లు రైతులతో అగ్రిమెంట్లు చేయించుకుంటారు. వారి మూల విత్తనం అందిస్తారు. పంట మొలకెత్తినప్పటి నుంచి చేతికి వచ్చే దాకా ఆర్గనైజర్ల పర్యవేక్షణ ఉంటుంది. దిగుబడి వచ్చిన తర్వాత చివరి గింజ దాకా ఆయా కంపెనీలే రైతుల కల్లాల వద్దకు వచ్చి కొనుగోలు చేసుకుంటాయి. సాధారణ మక్కసాగు చేస్తే ఎకరాకు 25-30 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వస్తోంది. ఈ మక్కల ధర మార్కెట్లో ఏ విధంగా ఉంటుందో చెప్పలేని పరిస్థితి. అదే హైబ్రీడ్ మక్క సాగు చేస్తే రైతు యాజమాన్యం మినహా పంటలపై ఎలాంటి తెగుళ్లు, రోగాలు వచ్చినా ఆయా కంపెనీలే చూసుకుంటాయి. ఒక ఎకరానికి కనీసంగా 35 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. క్వింటాల్‌కు రూ.2,500 చొప్పున ఆయా కంపెనీలు ధర చెల్లిస్తున్నాయి. అంటే ఒక ఎకరంలో కనీసం రూ.87 వేల ఆదాయం వస్తోంది. సాగు, ఇతరాత్ర ఖర్చులు కింద రూ. 30 వేల వరకు తీసేస్తే ఎకరానికి రూ.55-60 వేల వరకు మిగులుతున్నాయని రైతులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లాలో ఏటేటా హైబ్రీడ్ మక్క సాగు పెరుగుతున్నది.
వీణవంకలోనే ఎక్కువ ఉత్పత్తి..
వీణవంక మండలంలో హైబ్రీడ్ మక్క జొన్న ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. రాష్ట్రంలోనే అత్యధికంగా హుజూరాబాద్ వ్యవసాయ డివిజన్లో వరితోపాటు మక్కజొన్న విత్తనోత్పత్తి జరుగుతుంది. పలు కంపెనీలకు చెందిన ఆర్గనైజర్లు కూడా వీణవంక మండలం నుంచే ఎక్కువ మంది ఉంటారు. అందుకే మండలంలో ఎక్కువ సాగవుతోంది. కొంచెం కష్టపడితే మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నందున రైతులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఇక్కడ ఉత్పత్తి అవుతున్న హైబ్రీడ్ మక్క మూల విత్తనం దేశంలోని వివిధ రాష్ర్టాల్లో ఆయా కంపెనీలు మార్కెటింగ్ చేస్తున్నాయి. మన ప్రాంత మక్కజొన్న విత్తనానికి దేశంలోని పలు రాష్ర్టాల్లో మంచి డిమాండ్ ఉంది.
– గణేశ్, మండల వ్యవసాయ అధికారి (వీణవంక)
కష్టముంటది.. లాభముంటది
హైబ్రీడ్ సీడ్ మక్కతోని కష్టముంటది. కష్టపడితే మంచి లాభముంటది. మా ఏరియలా చానా రోజుల నుంచి సీడ్ మక్క పెడ్తం. కంపెనీలోల్లే వచ్చి సీడ్ ఇస్తరు. మళ్ల పంట వండినంక వచ్చి మక్కలు తీస్కపోతరు. కంపెనీల ఆర్గనైజర్లే అన్ని తీర్ల చూసుకుంటరు. ఇప్పటి వరకైతే యాసంగిల ఏసిన సీడ్ మక్కతోని నష్టమైతే రాలే. మంచిగ లాభమే అనిపిస్తున్నది. క్వింటాల్‌కు 2,500 ఇస్తరు. వట్టి మక్కకు రేటెక్కడున్నది. ఇంత గనం ఇయ్యరు. అందుకే మేమెప్పుడు సీడ్ మక్కనే పెడ్తం.
– మారం తిరుపత్తి రెడ్డి, హిమ్మత్‌నగర్ (వీణవంక)