United Forum of Voluntary Associations | కోల్ సిటీ, జూన్ 2: స్వరాష్ట్రం కోసం పరితపించి ప్రాణాలు అర్పించిన అమరవీరుల పట్ల రామగుండం కార్పొరేషన్ అధికారుల తీరు… బాధ్యతా రాహిత్యం చాలా బాధాకరం… అమరవీరుల స్తూపంను కూడా అలంకరించేందుకు చేతులు రాకపోవడం విడ్డూరమని, మాతో కాదని ముందే చెబితే.. తామే చందాలు వేసుకొని పూలతో అలంకరించేవారిమని అని స్వచ్ఛంద సంఘాల ఐక్య వేదిక ప్రతినిధులు వాపోయారు. గోదావరిఖని ప్రధానచౌరస్తా వద్ద గల అమరవీరుల స్మారక స్తూపం వద్ద ముందుగా నివాశులర్పించారు.
ఆ తర్వాత కార్పొరేషన్ అధికారుల తీరును ఎండగట్టారు. తెలంగాణ ఆవిర్భావం దినోత్సవం రోజున అమరవీరుల స్మారక స్తూపంను ముస్తాబు చేసేందుకు కూడా బల్దియా ఖజానాలో డబ్బులు లేకపోవడం దురదృష్టకరమనీ, అదే కాంగ్రెస్ పార్టీ పెద్దలు వస్తున్నారంటే రూ. లక్షలు ఖర్చు చేసి స్తూపాలను ముస్తాబు చేస్తారని పేర్కొన్నారు.
రాష్ట్ర ఉద్యమంలో 1200 మంది ప్రాణత్యాగం చేశారనీ, వారి గుర్తుగా అధికార పార్టీ నాయకులు గానీ, కార్పొరేషన్ అధికారులు గానీ అలంకరణ చేయకపోవడం అవమానించడమేనని పేర్కొన్నారు. అగౌరవపర్చిన అధికారులను సస్పెండ్ చేయాలని జిల్లా కలెక్టర్ ను కోరారు. ఇంతకంటే దౌర్భాగ్యం మరెక్కడ లేదని ఆవేదన చెందారు. కార్యక్రమంలో వేదిక నిర్వాహకులు గోలివాడ చంద్రకళ, కంది సుజాత, సరిత, రమ, శిరీష, శ్రీకాంత్, మల్లికార్జున్, రమాదేవి, స్వరూప, విజయ తదితరులు పాల్గొన్నారు.