జగిత్యాల జిల్లాలో పలువురు అధికారుల తీరు విమర్శలకు తావిస్తున్నది. కొందరి వ్యవహారశైలి వివాదాస్పదంగా మారుతున్నది. ఇప్పటికే కొందరు కీలక ఆఫీసర్ల తీరు సరిగా లేకపోవడంతో వారిపై శాఖా పరమైన చర్యలు తీసుకోగా, మరికొందరిపైనా వేటు పడే అవకాశాలున్నాయని ఉద్యోగవర్గాలు చెబుతున్నాయి. అయితే జిల్లా, డివిజన్ స్థాయి ఆఫీసర్ల తీరు సరిగా లేకపోవడంతో, పలు అంశాల్లో ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ప్రధాన అధికారులు తీవ్ర మనస్తాపం చెందడమే కాదు, ఇలా ప్రవర్తిస్తే ఎలా పాలన చేయగలుగుతామని, సన్నిహిత ఉద్యోగుల వద్ద అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది.
కొద్ది నెలల క్రితం జగిత్యాల జిల్లాలో ఓ కీలక అధికారి పోస్టు ఖాళీ అయింది. ఆ బాధ్యతలను మరో కీలక పోస్టులో కొనసాగుతున్న ఉన్నతాధికారికి అదనంగా అప్పగించారు. అయితే అదనపు బాధ్యతలు రావడంతో ఆ ఆఫీసర్ కొన్నాళ్లు చక్రం తిప్పారు. ఉన్నతాధికారులు సైతం సదరు అధికారి సీనియర్ మోస్ట్ కావడంతో ప్రాధాన్యత సైతం ఇచ్చారు. జిల్లా పరిధిలో గుర్తింపు రావడం, డివిజన్, మండల స్థాయి అధికారులు సదరు అధికారి ప్రాపకం కోసం వేచి చూడడం ఆరంభమైంది. ప్రాధాన్యత పెరుగుతున్న క్రమంలో సదరు అధికారి వ్యవహరశైలి వివాదాస్పదం కావడం మొదలైంది. జిల్లా స్థాయిలో కొందరు అధికారులను కూడగట్టుకొని కోటరీని తయారు చేశాడన్న ఆరోపణలు రావడం ప్రారంభమైంది. అలాగే ఉన్నతాధికారులతో సత్సంబంధాలు ఉండడంతో సదరు అధికారి, తన వర్గానికి చెందిన ఉద్యోగులకు కీలక శాఖల ఇన్చార్జి బాధ్యతలను కట్టబెట్టారన్న విమర్శలు వచ్చాయి. అదే సమయంలో సదరు అధికారికి మండల, పట్టణ స్థాయిలో పనిచేసే అధికారులు గొడుగులు పట్టే స్థాయికి దిగజారారన్న మాటలు ఉద్యోగ వర్గాల్లో మొదలయ్యాయి. ఇతరత్రా ఆరోపణలు సైతం చుట్టుముట్టాయి. ఈ క్రమంలోనే ఆ అధికారి వ్యవహారశైలి ఉన్నతాధికారులకు సైతం ఆగ్రహం కలిగించినట్టు తెలుస్తున్నది. జిల్లా స్థాయి అధికారి పోస్టుకు ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న తనకు అధికారిక వాహనంతో పాటు, బంగళాను కేటాయించాలని కోరగా, నిబంధనల ప్రకారం ఇవ్వడానికి వీలు లేదని ఉన్నతాధికారులు తేల్చిచెప్పడంతో వారికి, ఆయనకు మధ్య దూరం పెరిగింది. ఈ క్రమంలో ఒక కీలక సమీక్షా సమావేశానికి సదరు ఇన్చార్జి అధికారి గైర్హాజరు కావడం, ఎందుకు రాలేదని ప్రశ్నిస్తే, తనకు వాహనం లేదని, అందుకే రాలేదని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే సదరు అధికారికి ఇచ్చిన ఇన్చార్జి హోదాలను తొలగించి, మరో జిల్లా స్థాయి అధికారికి అదనపు బాధ్యతలు అప్పగించారు.
ఆరోపణల నేపథ్యంలో మరో జిల్లా స్థాయి అధికారిని ఆయన మాతృశాఖకు సరెండర్ చేసినట్టు తెలుస్తున్నది. కొన్ని నెలల క్రితం ప్రాథమిక రంగానికి సంబంధించిన ఒక అనుబంధ శాఖ అధికారి జిల్లా అధికారిగా బదిలీపై వచ్చాడు. అయితే సదరు అధికారి వ్యవహారశైలి తీవ్ర విమర్శలకు తావిచ్చింది. సంబంధిత శాఖకు సంబంధించిన రైతులతో పాటు అగ్రిమెంట్ చేసుకున్న కంపెనీ వారు.. సదరు అధికారి తమను తీవ్రంగా ఇబ్బందిపెడుతున్నాడంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. సదరు అధికారి వ్యవహార ధోరణి సరిగా లేదని, రైతులకు రావాల్సిన సబ్సిడీని వర్తింపజేయడం లేదని, అగ్రిమెంట్ చేసుకున్న కంపెనీ నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని, సలహాలు, సూచనల కోసం వచ్చే రైతులపై పరుషమైన భాషతో విరుచుకుపడుతున్నాడని కంప్లయింట్ ఇచ్చారు. అలాగే ఉన్నతాధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే 50 ఎకరాలకు సాగుకు అనుమతులు ఇచ్చాడని, అలాగే పొరుగున ఉన్న జిల్లాలో ఉన్న సంబంధిత శాఖ అధికారుల విషయాల్లోనూ, అగ్రిమెంట్లలోనూ తలదూర్చుతూ ఇబ్బందులు పెడుతున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో జిల్లా ఉన్నతాధికారులు సదరు అధికారికి వివరణ ఇవ్వాలంటూ ఫిబ్రవరి మూడో వారంలో మెమోను జారీ చేశారు. కానీ, సదరు అధికారి నుంచి సరైన వివరణ రాకపోవడంతో, ఆయనను అతడి మాతృసంస్థకు సరెండర్ చేసి, అతడి బాధ్యతలను మరో శాఖ అధికారికి అప్పగించడం అధికారవర్గాల్లో సంచలనమైంది.
వేటుపడ్డ అధికారుల వ్యవహారశైలి ఇలా ఉండగా, మరికొందరు అధికారుల తీరు సైతం సరిగా లేదనే మాటలు వినిపిస్తున్నాయి. జిల్లాలో కీలక బాధ్యతల్లో ఉన్న ఒక అధికారిపై సైతం తీవ్రమైన ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తుతున్నట్టు ఉద్యోగులు చెబుతున్నారు. సదరు అధికారి ఈ యేడాది ప్రారంభంలో రాష్ట్ర సరిహద్దులో ఉన్న మరో రాష్ట్రంలో ఉన్న రిసార్ట్లో కుటుంబంతో వేడుకలు జరుపుకొన్నారని, దానికి సంబంధించిన ఖర్చునంతటినీ తన పరిధిలోని ఒక శాఖకు సంబంధించిన అధికారులు చెల్లించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అలాగే ఇటీవల సదరు అధికారికి సంబంధించిన అధికారిక వాహనం మరమ్మతులకు రాగా, మరో వాహనాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. అయితే ఆ వాహనం చిన్నగా ఉందని, సౌకర్యంగా అనిపించడం లేదని సదరు అధికారి ఆగ్రహం వ్యక్తం చేయడంతో అధికారులు కంగుతిన్నట్టు తెలుస్తున్నది. అయితే సదరు జిల్లా స్థాయి అధికారి తన పర్యవేక్షణలో ఉన్న ఒక శాఖ కింద వ్యాపారం చేసే ఒక పెద్ద వ్యాపారికి ఫోన్ చేసి తాత్కాలికంగా వాహనం కావాలని కోరాడని, దీంతో సదరు వ్యాపారి, అధికారికి తన ఖరీదైన వాహనాన్ని ఏర్పాటు చేసినట్టు సమాచారం. అయితే ఆఫీస్ ప్రాంగణంలో సదరు వ్యాపారి వాహనం ఉండడాన్ని గుర్తించిన జిల్లా ఉన్నతాధికారి, ‘ఈ వాహనం ఇక్కడికి ఎందుకు వచ్చింది’ అని ఆరా తీయగా, అసలు విషయం తెలియడంతో కీలక అధికారిపై సైతం అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. ‘సీనియర్ అధికారులు సైతం ఇలా బిహేవ్ చేస్తారా’ అంటూ తన నిరసనను బాహాటంగానే వ్యక్తీకరించినట్టు తెలుస్తున్నది. వేటు పడ్డ అధికారులతోపాటు ఇంకా పలువురు అధికారుల వ్యవహారశైలి వివాదాస్పదంగా ఉందని, వారి వల్ల విమర్శలు వస్తున్నాయన్న ఆవేదన ఉన్నతాధికారుల్లో వ్యక్తమవుతున్నట్టు సమాచారం. ఇలా ప్రవర్తించి, విమర్శలకు తావిస్తే, ఎలా పాలన చేయాలని సదరు ఉన్నతాధికారి తన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు ఉద్యోగవర్గాలు చెబుతున్నాయి. జిల్లాలో పనిచేసే మరికొందరు అధికారులపై సైతం చర్యలు ఉండే అవకాశం ఉందన్న మాటలు వినిపిస్తున్నాయి.
జిల్లాలోని ఒక డివిజన్ స్థాయి అధికారిని సైతం కొన్నాళ్ల క్రితం సరెండర్ చేశారు. కానీ ఆ విషయాలు బయటకు రాలేదు. అయితే సదరు అధికారి వ్యవహరశైలి సైతం తీవ్ర విమర్శల పాలైనట్టు తెలుస్తున్నది. జిల్లాలోని ఒక డివిజన్ స్థాయి అధికారిగా పనిచేసిన అధికారి, అదే కార్యాలయంలో పనిచేస్తున్న మరో మహిళా అధికారితో సన్నిహితంగా ఉన్నట్టు సమాచారం. అయితే ఆ మహిళా అధికారికి సదరు అధికారి పెద్ద మొత్తంలో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిన వ్యవహారం అతడి ఇంట్లో తెలియడం, అతడి భార్య వచ్చి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఈ క్రమంలో అంతర్గతంగా విచారణ జరిపించి సదరు అధికారిపై చర్యలు తీసుకున్నట్టు తెలుస్తున్నది. ఇక ఆ మహిళా ఉద్యోగిని బదిలీ చేయడంతోపాటు డివిజన్ స్థాయి అధికారిని మాతృశాఖకు సరెండర్ చేసినట్టు సమాచారం. అయితే విచారణతోపాటు ఇతర వ్యవహారాలన్నీ అంతర్గతంగా సాగడంతో సదరు డివిజన్ స్థాయి అధికారి బదిలీ విషయం బయట ప్రచారం జరుగలేదని ఉద్యోగులు చెబుతున్నారు.