Dharmapuri | ధర్మపురి, నవంబర్ 28 : ధర్మపురి మండలం తిమ్మాపూర్, ఆరెపెల్లి గ్రామాల్లో బీసీలకు కాంగ్రెస్ సర్కార్ మొండి చేయి చూపిందని బీసీ సంఘాల నాయకులు దుమ్మెత్తిపోస్తున్నారు. తిమ్మాపూర్ గ్రామంలో 2011 జనాభా లెక్కల ప్రకారం.. 2421 మంది జనాభా, 1938 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో బీసీలు సగానికంటే ఎక్కువ సంఖ్యలో దాదాపు 55 శాతం ఉన్నప్పటికీ రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో బీసీలకు ఒక్క వార్డు కూడా కేటాయించకపోవడం పై బీసీలనుండి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది.
తిమ్మాపూర్లో 10వార్డులుండగా 5 స్థానాలు ఎస్సీలకు, 5స్థానాలు జనరల్ కు కేటాయించారు. సర్పంచ్ స్థానం జనరల్ మహిళలకు కేటాయించారు. అలాగే ధర్మపురి మండలం అరెపెల్లి లో దాదాపు 1300 మంది జనాభా ఉండగా ఈ గ్రామంలో జనాభాలో దాదాపు సగం బీసీలు, 40శాతం ఎస్సీలు, 10శాతం ఇతరులున్నారు. ఈ గ్రామంలో 10 వార్డు స్థానాలుండగా.. ఇందులో 5 ఎస్సీ, 5 జనరల్ స్థానాలకు కేటాయించారు. సర్పంచ్ స్థానం జనరల్ కు కేటాయించారు.
ఈ రెండు గ్రామాల్లో పంచాయితీ ఎన్నికల రిజర్వేషన్ల కేటాయింపులో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని బీసీ సంఘాల నాయకులు మండిపడుతున్నారు. తిమ్మాపూర్ సర్పంచ్ స్థానం 5శాతం జనాభా కూడా లేని జనరల్ మహిళకు కేటాయించడం పట్ల గ్రామంలో చర్చనీయాంశమైంది. ఈ విషయమై ఇంచార్జ్ ఎంపీడీఓ సరేశ్ ను వివరణ కోరగా ఆక్ట్ ప్రకారం ఏర్పడిన డెడికేషన్ కమిషన్ అందించిన సమగ్ర డాటా ఆధారంగా కేటాయింపులు జరిగాయని వివరించారు.