కరీంనగర్ కార్పొరేషన్, జనవరి 11 : స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని బల్దియాలు మరోసారి మెరిశాయి. ముఖ్యంగా కరీంనగర్ మరోసారి సత్తా చాటింది. దేశంలో 446 నగరాలతో పోటీ పడి 6,241 మార్కులతో 81వ ర్యాంకు సాధించింది. రాష్ట్ర స్థాయిలో గ్రేటర్ హైదరాబాద్ మొదటి స్థానంలో ఉండగా, కరీంనగర్ రెండో స్థానంలో నిలిచింది. గతేడాది రాష్ట్ర స్థాయిలో మూడో స్థానంలో నిలువగా ఈసారి మరింత మెరుగుపర్చుకున్నది. ఇంటింటా చెత్త సేకరణ, హోం వర్మీ కంపోస్టు, పబ్లిక్ టాయిలెట్స్ క్లీనింగ్, మార్కెట్ క్లీనింగ్, తదితర అంశాల్లో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మున్సిపాలిటీలకు మార్కులు కేటాయించింది.
వీటిల్లో చెత్తను వేరు చేయడం, గృహవినియోగ ప్రాంతాలు, మార్కెట్స్ క్లీనింగ్, రిజర్వాయర్ల వద్ద పారిశుధ్యం, పబ్లిక్ టాయిలెట్స్ పరిశుభ్రంగా ఉంచడంలో కరీంనగర్‌కు వంద శాతం మార్కులు రాగా.. డంప్ యార్డు చెత్తను తగ్గించడంలో కేవలం 5 శాతం మార్కులు మాత్రమే వచ్చాయి. అలాగే, ఇంటింటా చెత్త సేకరణ విషయంలో 45 శాతం, చెత్త ర్లీైస్లెకింగ్ విషయంలో 75 శాతం మార్కులు సాధించింది. రామగుండం నగరపాలక సంస్థకు జాతీయ స్థాయిలో 175వ ర్యాంకు, రాష్ట్ర స్థాయిలో 10వ ర్యాంకు వచ్చింది.
స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీల్లో కరీంనగర్ నగరపాలక సంస్థకు మెరుగైన ర్యాంకులు, అవార్డులు రావడం గర్వకారణం. గతంతో పోలిస్తే చాలా మెరుగ్గా ఉన్నది. గతేడాది లక్షకుపైగా జనాభా ఉన్న నగరాల కేటగిరీలో తక్కువ నగరాలతో పోటీ పడి 61 ర్యాంకు సాధించగా, ఈ సారి మరిన్ని ఎక్కువ నగరాలతో పోటీ పడి 81వ ర్యాంకు సాధించడం సంతోషకరం. గతంతో పోలిస్తే ప్రస్తుతం వచ్చిన ర్యాంకు చాలా మెరుగైనది. పాలకవర్గంతో పాటు పారిశుధ్య కార్మికులు, సిబ్బంది, ప్రజల కృషి ఫలితమే ఈ ర్యాంకులు. కేసీఆర్ ప్రభుత్వంలో పరిశుభ్రమైన నగరంగా అభివృద్ధి చెందడంతోనే ఈ ఫలితాలు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎంపీ వినోద్‌కుమార్ సహకారం మరువలేనిది. ప్రజలు, పారిశుధ్య కార్మికులు, సిబ్బందికి అభినందనలు.
– వై సునీల్‌రావు, మేయర్