పెద్దపల్లి, మార్చ్ 15(నమస్తే తెలంగాణ): సుల్తానాబాద్ పట్టణంలోని గాంధీనగర్ వాసుల గోస తీరింది. సర్వే నంబర్ 909లో క్రయ విక్రయాలకు అనుమతి వచ్చింది. 2007లో సుల్తానాబాద్‌లో పనిచేసిన ఓ తహసీల్దార్ చేసిన తప్పిదంతో ఇక్కడి ఇండ్లు జాగలన్నీ ప్రొహిబిషన్ లిస్టులోకి చేరిపోయాయి. అత్యవసర సమయాల్లో తమ ప్రాపర్టీ అమ్ముకోలేక, కొనుక్కోలేక దాదాపు 280కుటుంబాలు 17ఏండ్లుగా అరిగోస పడ్డాయి. ఈ క్రమంలో ప్రజల కష్టాలను గుర్తు చేస్తూ గతేడాది జూలై 4న ‘నమస్తే తెలంగాణ’లో ‘అమ్మరాదు.. కొనరాదు’ అంటూ ప్రత్యేక కథనాన్ని ప్రచురితం చేసింది. ప్రజలు సైతం ప్రజావాణిలో దరఖాస్తు చేస్తూ వస్తున్నారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రత్యేక చొరవ చూపి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు. జరిగిన తప్పిదాన్ని ఉన్నతాధికారులతో చర్చించి వారికి అనుకూలంగా భూములు, ఇండ్లు అమ్ముకునేలా, కొనుక్కునే విధంగా హక్కులను కల్పించగా, కాలనీ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
క్రయ విక్రయాలకు అనుమతి.. కలెక్టర్ కోయ శ్రీహర్ష
సుల్తానాబాద్ పట్టణంలోని గాంధీనగర్‌లోని 10వ వార్డు సర్వే నంబర్ 909లో భూములు, ఇండ్ల రిజిస్ట్రేషన్లకు అనుమతి లభించిందని కలెక్టర్ కోయ శ్రీహర్ష శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సర్వే నంబర్ 909లో మొత్తం 15.19ఎకరాల భూమి ఉందని, వీటిలో 1.13ఎకరాల భూమి మాత్రమే రోడ్ల కింద ఉందని, మిగిలింది పట్టా భూమి అని తెలిపారు. సర్వే నంబర్ 909/1, 909/2, 909/అ కింద ఉన్న భూమి పట్టా భూమి అని ధ్రువీకరించామని, దీనిపై ఐజీ, డీఐజీలను సంప్రదించామని, ఇక నుంచి రిజిస్ట్రేషన్లు చేయవచ్చునని తెలిపారు. అయితే మెయిన్ సర్వే నంబర్ 909లో రోడ్డు కింద ఉన్న 1.13ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయడానికి వీలు లేదని కలెక్టర్ పేరొన్నారు.