Achieve complete literacy | కోరుట్ల, ఆగస్టు 23: సంపూర్ణ అక్షరాస్యత సాధించడమే ఉల్లాస్ లక్ష్యమని కోరుట్ల ఎంపీడీవో రామకృష్ణ అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో శనివారం ఉల్లాస్( నవ భారత అక్షరాస్యత కార్యక్రమం) పై మండలంలోని 15 గ్రామాలకు చెందిన ప్రధానోపాధ్యాయులు, గ్రామైక్య సంఘం సహయకులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అభివృద్ధి అధికారి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర విద్యశాఖలు సంయుక్తంగా ఉల్లాస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయన్నారు.
సమాజంలోని అందరికీ జీవితకాల అభ్యాసాన్ని అందించడం, 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యా నైపుణ్యాలను అందించడంపై దృష్టి పెడుతుందని చెప్పారు. ఆర్థిక అక్షరాస్యత, డిజిటల్ అక్షరాస్యత, ఆరోగ్య అవగాహన వంటి కీలకమైన జీవిత నైపుణ్యాలను అందిస్తుందని పేర్కొన్నారు. పాఠశాల విద్యను కోల్పోయిన లేదా నిరక్షరాస్యులైన పెద్దలను (15 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు గలవారు) 2027 సంవత్సరం నాటికి 100 శాతం అక్షరాస్యత లక్ష్యంగా పని చేస్తుందని తెలిపారు.
ఉల్లాస్ మొబైల్ యాప్ లో అభ్యాసకుల పురోగతిని అంచనా వేయడానికి ఎఫ్ఎల్ఎన్ఏటి (ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అసెస్మెంట్ టెస్ట్) వంటి మూల్యాంకనాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సెక్టోరియల్ ఆధికారి మహేష్, మండల విద్యాధికారి గంగుల నరేశం, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు గంగాధర్, రిసోర్స్ పర్సన్స్ అందే శివప్రసాద్, అంకం దామోదర్, అన్నం మహేష్, విఓఏలు, సీఆర్పీలు గంగాధర్, దేవేందర్, సత్యనారాయణ, జ్యోతి, మాన్విత, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.