విద్యానగర్, జనవరి 31: తెలంగాణ రాష్ట్ర ఆర్థోపెడిక్ వైద్యుల 9వ రాష్ట్ర సదస్సును మొట్ట మొదటిసారిగా కరీంనగర్లో నిర్వహిస్తున్నట్లు కోసా (కరీంనగర్ ఆర్థోపెడిక్ సర్జన్స్ అసోసియేషన్) అధ్యక్షుడు, ప్రొఫెసర్ బంగారి స్వామి తెలిపారు. జిల్లాకేంద్రంలోని రెనీ హస్పిటల్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గురువారం నుంచి నాలుగురోజులపాటు వీ కన్వెన్షన్‌లో సదస్సు నిర్వహిస్తున్నామని, సుమారు వెయ్యి మంది వైద్యులు పాల్గొంటారని, దేశ విదేశాల నుంచి సీనియర్ వైద్యులు కూడా హాజరవుతారని చెప్పారు.
సదస్సులో ఆర్థోపెడిక్ వైద్య విధానంలో ఆధునిక పద్ధతుల ఆవిష్కరణలు, నూతన వైద్య విధానాలను వివరిస్తారని, ప్రతిమ, చల్మెడ, రెనీ హాస్పిటళ్లలో రోబోటిక్ లైవ్ సర్జరీలు ఉంటాయని చెప్పారు. ఈ సదస్సు ఆర్థోపెడిక్ విద్యార్థులు, వైద్యులకు ఎంతో ఉపయోగపడుతుందని సూచించారు. కార్యక్రమంలో ఆర్గనైజింగ్ చైర్మన్ ప్రొఫెసర్ మోతీలాల్, కో చైర్మన్ డాక్టర్ నర్సింహులు, కో ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ వంశీధర్‌రెడ్డి, కోశాధికారి డాక్టర్ వేముల చంద్రశేఖర్, సైంటిఫిక్ కమిటీ చైర్మన్ డాక్టర్ వెంకట్‌రెడ్డి, సీనియర్ వైద్యులు వీ రాంరెడ్డి, చిట్ల వంశీ, రాము, అభిలాశ్, కీర్తన, తదితరులు పాల్గొన్నారు.