కరీంనగర్ బల్దియాలో 50 కోట్ల టెండర్ల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతున్నది. విలీన గ్రామాలకు కేటాయించిన నిధులను పక్కదారి పట్టించేందుకు చేస్తున్న ప్రయత్నాలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీటి నుంచి తప్పించుకొని, తాము చేసింది సబబే అనిపించుకోవడానికి కొంతమంది పాలకవర్గ సభ్యులు దాగుడు మూతలు ఆడుతున్నారు. అందులో భాగంగానే ఒకరికి తెలియకుండా మరొకరి వద్ద సంతకాల సేకరణ పేరిట నయా డ్రామాకు తెరలేపారు. తమకు అనుకూలమైన మీడియాను వినియోగించుకుంటూ 50 మంది కార్పొరేటర్లు సంతకాలు చేయించారని రాయించుకుంటున్నారు.
అదే నిజమైతే సంతకాలు ఏ అంశం మీద సేకరించారు? ఆ అవసరం ఎందుకొచ్చింది? అన్న వివరాలను అధికారికంగా వెల్లడించకుండా దాచిపెట్టాల్సిన అవసరం ఏమిటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నిజంగానే అన్ని డివిజన్లకు న్యాయం చేయాలని భావిస్తే అత్యవసర కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి, అందరి కార్పొరేటర్ల అభిప్రాయాలు తీసుకునే మార్గం ఉన్నది. అయినా వక్రమార్గల్లో పయనించాల్సిన అవసరం ఏమిటన్న ప్రశ్నలకు అధికార పార్టీయే సమాధాన చెప్పాలన్న డిమాండ్ వస్తున్నది.
కరీంనగర్, మార్చి 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ కార్పొరేషన్ : అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ (యూఐడీఎఫ్) కింద మంజూరైన 50 కోట్లతో విలీన గ్రామాల అభివృద్ధి కోసం పిలిచిన టెండర్లను బల్దియా రద్దు చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంలో కొంతమంది పాలకవర్గసభ్యులు ఆడుతున్న డ్రామాలు, దాగుడు మూతలపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. టెండర్ల రద్దుతో విలీన గ్రామాలు, ప్రాంతాలకు జరిగే అన్యాయం, ఎన్నికల సమయంలో మంత్రులు ఇచ్చిన హామీలు, ఇప్పుడు మాట మార్చిన తీరు, దీనికి వెనుక జరుగుతున్న రహస్య మంతనాలు, కుతంత్రాలపై ‘నమస్తే తెలంగాణ’ మూడు రోజులుగా వరుస కథనాలతో ఎండగట్టడం కలకలం రేపుతున్నది.
నిన్నామొన్నటి వరకు టెండర్లను రద్దు చేయాలంటూ.. సంతకాల సేకరణ జరగలేదంటూ చెప్పుకొంటూ వచ్చిన కొంతమంది నాయకులు, ఇప్పుడు పనులను రద్దు చేయడానికి 50 మంది కార్పొరేటర్లు సంతకాలు పెట్టారంటూ వారికి అనుకూలమైన పత్రికల్లో ఆదివారం వార్తలు రాయించుకున్నారు. ఈ విషయంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యూఐఎడీఎఫ్ కింద విలీన ప్రాంతాలకు కేటాయించిన 50 కోట్ల నిధులను రద్దు చేసి, వాటిని నగరంలోని అన్ని డివిజన్లకు పెట్టాలని నిర్ణయం తీసుకుంటే.. దీనిపై ఒకరికి తెలియకుండా మరొకరి వద్ద సంతకాలు సేకరించాల్సిన అవసరం ఏమిటీ? వాళ్లు చెప్పిన ప్రకారం చూసినా ఇంకా 16 మంది కార్పొరేటర్లు సంతకాలు చేయలేదు.
వారి పరిస్థితి ఏమిటీ? వారిని ఒప్పించాల్సిన బాధ్యత ఎవరిది? నిజానికి అన్ని డివిజన్లకు నిధులు కేటాయించాలన్న చిత్తశుద్ధి ఉంటే.. ముందుగా అన్ని పార్టీల కార్పొరేటర్లతో అత్యవసర పాలకవర్గ సమావేశం పెట్టొచ్చు కదా! దాని ప్రకారం సింగిల్ ఏజెండా మీద టెండర్లను రద్దు చేసేందుకు కారణాలు వివరించి, అందరి ఆమోదం మేరకు నిర్ణయం తీసుకోవచ్చు కదా! ఎవరైనా వ్యతిరేకిస్తే వారిని ఒప్పించి మెప్పించుకోవాల్సిన బాధ్యత కూడా అధికార పాలకవర్గంపై ఉంటుంది కదా! కానీ, ఇక్కడ అలా చేయడం లేదు. అధికారికంగా ఈరోజు వరకు సమావేశం పెట్టేందుకు సమాచారం ఇవ్వలేదు? అలాగే టెండర్లు రద్దయినట్టు కాంట్రాక్టర్లకు మేసెజ్‌లు అధికారికంగా వెళ్లాయే తప్పా అన్నీ పార్టీల పాలకవర్గసభ్యులకు పూర్తి సమాచారమే లేదు? సమావేశం పెట్టి చర్చించి నిర్ణయం తీసుకునే రాచమార్గం ఉండగా.. దొంగచాటుగా సంతకాలు సేకరించాల్సిన అవసరం ఏమిటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ఒక వేళ టెండర్ రద్దు చేయాలంటూ ముందుగానే కార్పొరేటర్లు సంతకాలు చేస్తే.. ఆ పత్రాన్ని అధికారికంగా బహిర్గతం చేయవచ్చు? మెజార్టీ కార్పొరేటర్లు వినతిపత్రం ఇచ్చిన మేరకు నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు గానీ, మేయర్‌గానీ ప్రకటించడానికి అవకాశం ఉన్నది? ఏయే పార్టీ నుంచి ఏ కార్పొరేటర్ సంతకాలు చేశారో వెల్లడి చేయకుండా దాచిపెట్టడంలో ఆంత్యరం ఏమిటీ? నిజంగానే యాభై మంది కార్పొరేటర్లు సంతకాలు చేసి ఉంటే.. ఆ విషయాన్ని అధికారికంగా బహిర్గతం చేసి ఉంటే విషయం ఇంత రచ్చ రచ్చ కాకుండా ఉండే అవకాశాలుంటాయి కదా? ఎందుకీ ఈ దిశలో అధికారపాలకవర్గం అడుగులు వేయడం లేదన్న ప్రశ్నలు వస్తున్నాయి. అంతేకాదు, ప్రధాన పార్టీల్లో ఏ ఒక్క పార్టీ కూడా పూర్తి స్థాయిలో సంతకాలు చేయలేదు. అంటే అన్ని పార్టీల్లోనూ కొంత మంది కార్పొరేటర్లు రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారన్నది స్పష్టమవుతున్నది. వీరికి నచ్చ జెప్పి ముందుకు వెళ్లే దిశగా చర్యలు తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం ఎలా తీసుకుంటారన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి.

కొత్తగా నిధులు లేనట్టేనా..?
విలీన ప్రాంతాలకు కేటాయించిన 50 కోట్ల టెండర్ల రద్దు చేయడానికి బీజేపీ, కాంగ్రెస్ పార్టీకు చెందిన కొంతమంది మరో కారణం చెబుతున్నారు. కార్పొరేషన్ ఎన్నికలకు ముందు ఈ నిధులు వచ్చాయని, అప్పుడు పాలకవర్గం లేకపోవడంతో అధికారులు తమ ఇష్టానుసారం పెట్టారని, అందుకే ఇప్పుడు వాటిని రద్దు చేస్తున్నామంటున్నారు. అలాగే ఇప్పట్లో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి నిధులు వచ్చే అవకాశాలు లేవని, అందుకే రెడీగా ఉన్న నిధులను అన్ని డివిజన్లకు కేటాయించాలని చూస్తున్నామంటూ అధికార పాలకవర్గం తోటి కార్పొరేటర్లకు చెబుతున్నది. దీనిని లోతుగా చూస్తే.. వచ్చిన 50 కోట్లపైనే అందరి చూపు కనిపిస్తున్నది.
కానీ, తాజా ఎన్నికల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక నిధులు తెచ్చి, అభివృద్ధి చేస్తామని నగరవాసులకు హామీ ఇచ్చారు. ఇప్పుడు అధికార పాలకవర్గం అనుసరిస్తున్న తీరు చూస్తే ఇప్పట్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు వచ్చే అవకాశాలు లేవన్నట్టు కనిపిస్తున్నది. అందుకే ఉన్న ఈ నిధులను విలీన గ్రామాలకు కట్ చేసి, తలా ఇంత కేటాయిస్తామని ప్రపోజల్ చేస్తున్నారా..? అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకవేళ నిధులు తెచ్చే అవకాశముంటే 50 కోట్ల టెండర్లను అలాగే ఉంచి, కొత్తగా తెచ్చే నిధుల ద్వారా ఇతర డివిజన్లకు పెట్టొచ్చు కదా..? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వీటికి అధికార పాలకవర్గమే సృష్టత ఇవ్వాలి. అలాగే పాలకవర్గం లేనప్పుడు అధికారులు ప్రతిపాదనలు పంపారని, అవి సముచితంగా లేవంటూ మరో వాదనను తెరపైకి తెస్తున్నారు. అదే నిజమైతే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవచ్చు కదా..? అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.
విలీన గ్రామాల అభివృద్ధిపై కక్ష ఎందుకు?
నగరంలో విలీన గ్రామాల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తామని కేంద్ర మంత్రి బండిసంజయ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఎన్నికల సమయంలో అనేక సమావేశాల్లో చెప్పారు. అంతే కాదు, యూఐడీఎఫ్ నుంచి 50 కోట్ల నిధులు తెచ్చామని, వాటిని కేవలం విలీన గ్రామాల అభివృద్ధి కోసం మాత్రమే కేటాయించామని ఇద్దరు పదే పదే చెప్పుకుంటూ ఓట్లు అడిగారు. ఎన్నికలు ముగిసిన వెంటనే ఎంపిక చేసిన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తామని చెప్పారు.
ఆ మాటలు వాస్తవమా.. కాదా? ఇప్పుడు మంత్రులు చెప్పాలి. ఆ టెండర్లను రద్దు చేసినా ఇద్దరు మంత్రులు మాట్లాడకుండా ఉండడంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు విలీన గ్రామాలపై ఇంత కక్ష ఎందుకో చెప్పాలి. నగర అభివృద్ధిని మేము కాంక్షిస్తున్నాం. ఎన్నికల సమయంలో ప్రత్యేక నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తామని చెప్పారు కదా? ఇప్పుడు ఆ నిధులు తెచ్చి మిగిలిన డివిజన్లకు కేటాయించవచ్చు కదా? వాటితో అన్ని డివిజన్లకు న్యాయం చేయచ్చు కదా? కానీ, దొంగచాటున సంతకాలు సేకరించడం ఏంటి? విలీన గ్రామాలకు కేటాయించిన నిధులను పక్కదారి పట్టించే దిశగా చర్యలు తీసుకోవడం ఎంత వరకు కరెక్టు? వీటికి సమాధానం చెప్పి తీరాలి. దీనిని ఊరికే వదిలిపెట్టే ప్రసక్తే లేదు.
– చల్ల హరిశంకర్, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు
సంతకాల విషయం నాకు తెలియదు
టెండర్ల రద్దుపై ఇంత స్థాయిలో ప్రచారం సాగుతుంటే నగరపాలక సంస్థలోని అధికారపక్షం ఎందుకు సృష్టత ఇవ్వడం లేదో చెప్పాలి. అసలు ఇప్పటి వరకు టెండర్లు రద్దయ్యోయో లేదో మాకు అధికారికంగా ఎందుకు చెప్పడం లేదు. ఎన్నికల్లో కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తామని చెప్పిన కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ రాద్దాంతంపై ఎందుకు స్పందించడం లేదు. కార్పొరేటర్ల సంతకాల సేకరణ ఎందుకు చేస్తున్నారో.. ఎవరు చేస్తున్నారో నాకు తెలియదు.
నగరంలోని అన్ని డివిజన్లల్లో అభివృద్ధి జరగాలని మేం కోరుకుంటున్నాం. అందుకు మేం పూర్తిస్థాయిలో మద్దతు ఇస్తాం. విలీన గ్రామాల్లో కూడా అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. నగరంలో ఈ వ్యవహారంపై రచ్చ సాగుతుంటే బీజేపీ ఎందుకు మాట్లాడడం లేదు. ప్రజలకు సృష్టత ఇవ్వకపోవడంలో మతలబు ఏంటో చెప్పాలి. అన్ని డివిజన్లకు నిధులు కేటాయించాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికైనా అధికారికంగా ఈ విషయంపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం బీజేపీపై ఉన్నది.
– అంజన్‌కుమార్, కార్పొరేటర్, డీసీసీ అర్బన్ అధ్యక్షుడు