Medical research | కోల్ సిటీ, జూన్ 16: ఇదే మా ఆఖరి కోరిక… మరణానంతరం మా దేహాలు వృథా కావడం మాకిష్టం ఉండదు.. వైద్య విద్యార్థుల పరిశోధనలకు ఉపయోగపడాలని గోదావరిఖని శారదానగర్ కు చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి లైశెట్టి రాజయ్య- మధురమ్మ అనే వృద్ధ దంపతులు కోరారు. ఈమేరకు ఆ వృద్ధ దంపతుల పుట్టిన రోజును వినూత్నంగా జరుపుకున్నారు. పారిశ్రామిక ప్రాంతంకు సుపరిచితులైన ఎల్.రాజయ్య (88) ఆయన సతీమణిలు మరణానంతరం దేహాలను మెడికల్ కళాశాలకు ఇవ్వడానికి అంగీకరించారు.
ఈ సందర్భంగా ఆర్టీసీ మాజీ చైర్మన్ సత్యనారాయణతో పాటు సదాశయ ఫౌండేషన్ ప్రతినిధులు హాజరై ఆ దంపతుల నిర్ణయంను స్వాగతించి అభినందించారు. ఉపాధ్యాయుడిగా, కవిగా, పర్యావరణ వేత్తగా ఆదర్శవంతమైన జీవితం గడిపిన ఎల్.రాజయ్య దంపతులు చనిపోయాక కూడా నలుగురికి ఆదర్శంగా నిలవడానికి ఇలాంటి గొప్ప నిర్ణయం తీసుకోవడం స్పూర్తిదాయకమని కొనియాడారు. అనంతరం వృద్ధ దంపతులతో కేక్ కట్ చేసి స్వీట్లు తినిపించి శాలువాలతో ఘనంగా సత్కరించారు. సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దేహదాన అభినందన పత్రంను అందజేశారు.
కార్యక్రమంలో ఫౌండేషన్ పెద్దపల్లి జిల్లా మహిళా అధ్యక్షురాలు వెల్ది కవిత అనంత రాములు, జాతీయ ప్రచార కార్యదర్శి కేఎస్ వాసు, మాజీ పోలీస్ కానిస్టేబుల్ దేవి లక్ష్మీనర్సయ్య, మగువ లయన్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి శశికళ, రాములు, రాజమహేందర్, రాంరెడ్డి, మధు, వీహెచ్పీ ప్రతినిధి వెంకన్న, రాజిరెడ్డి, సాగర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.