సిరిసిల్ల టౌన్, మార్చి 4 : సాగునీరు లేక పంట పొలాలు కండ్ల ముందే ఎండిపోతున్నాయని బీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ఆందోళన వ్యక్తం చేశారు. పంటలకు నీళ్లిచ్చి కాపాడాలని, రైతులకు పంట నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీ డిక్లరేషన్ సహా ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు. రాబోయే ఎన్నికలలో ప్రజా క్షేత్రంలో తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎల్లారెడ్డిపేట మండల పరిధిలోనే 475ఎకరాల వరకు పంట నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎండిన పంటలను పరిశీలించి రైతులను ఓదార్చారని, అదే సమయంలో నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోపాటు మిడ్ మానేరు ప్రాజెక్టు అధికారులు, ఇరిగేషన్ ఈఎన్సీతో ఫోన్లో మాట్లాడారని చెప్పారు. మిడ్‌మానేరు నుంచి మల్కపేట ద్వారా సింగసముద్రం వరకు, రంగనాయక సాగర్ నుంచి తంగళ్లపల్లి మండలం వరకు, మల్లన్నసాగర్, 12వ ప్యాకేజీ నుంచి ముస్తాబాద్ మండలం వరకు నీటిని చేయాలని అడిగారన్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పందించి సాగునీరు విడుదల చేయాలని ఆదేశించారని, అధికారులు సైతం నీటి విడుదలకు ఏర్పాట్లు చేసినట్టు తెలిసిందన్నారు. సాగు నీటి విడుదలకు కృషి చేసిన కేటీఆర్‌తోపాటు సహకరించిన అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కంటి తుడుపు చర్యలా కాకుండా 1.5 టీఎంసీ నీటిని మల్కపేట నుంచి సింగసముద్రంకు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో మిడ్‌మానేరు, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్‌ను పూర్తి చేసుకున్నామని, మల్లన్నసాగర్ ద్వారా మండుటెండల్లోనూ కూడెల్లి వాగు ద్వారా అప్పర్మానేరును నింపుకొన్నామని గుర్తు చేశారు. దేశంలోనే అత్యంత నీచమైన భాషను వినియోగించే వ్యక్తి రేవంత్‌రెడ్డి అని విమర్శించారు. సిరిసిల్ల నేతలు విప్ ఆది శ్రీనివాస్, కేకే మహేందర్‌రెడ్డి సైతం అదే తరహాలో నీచంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రజలతో తిరస్కరించబడిన మహేందర్‌రెడ్డి ప్రతి సారీ ప్రజానాయకుడు కేటీఆర్‌ను విమర్శించడం సిగ్గుచేటన్నారు. అవాకులు, చెవాకులు పేలితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. జిల్లెల్లలో రైతు రాజిరెడ్డిని అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేయడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దిడ్డి రాజు మాట్లాడుతూ.. కేకే మహేందర్‌రెడ్డి వారంలో మూడు రోజులు ప్రెస్మీట్లు పెట్టి కాలం వెల్లదీస్తున్నారని విమర్శించారు. ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, వారి ఉపాధిపై దృష్టి సారించాలని సూచించారు. మరోసారి కేటీఆర్‌పై విమర్శలు చేస్తే సహించేదిలేదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, బీఆర్ఎస్ తంగళ్లపల్లి మండలాధ్యక్షుడు గజభీంకార్ రాజన్న, నాయకులు దార్ల సందీప్, మాట్ల మధు, సత్యనారాయణరెడ్డి, వెంగళ శ్రీనివాస్, కుంబాల మల్లారెడ్డి, బత్తుల రమేశ్, పోచవేని ఎల్లయ్య, ఎదురుగట్ల చంద్రయ్యగౌడ్, ప్రేమ్‌కుమార్, బింగి ఇజ్జగిరి, కొండ శంకర్, తదితరులు పాల్గొన్నారు.