బాకుర్పల్లి బోరుమంటున్నది. గతంలో ఎన్నడూ లేనివిధంగా జలగోసతో తల్లడిల్లుతున్నది. గతంలో పుష్కలమైన జలాలతో పసిడి పంటలతో తులతూగిన గ్రామం.. ప్రస్తుతం సాగుకు నీళ్లు లేక, ప్రభుత్వ నిర్లక్ష్యంతో మిషన్ భగీరథ నీరు సరఫరా లేక నరకం చూస్తున్నది. ఓ వైపు చేతికందిన పంటలు ఎండిపోతుండగా, మరోవైపు మంచినీళ్లు లేక తడారిపోతున్న గొంతుతో ఆదుకోవాలని వేడుకుంటున్నది.
ఎల్లారెడ్డిపేట, మార్చి 1 : గిరిజన తండాల్లో సాగు, తాగు నీటి కష్టాలు మొదలయ్యాయి. రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. ఇందుకు బాకుర్పల్లి తండానే నిదర్శనంగా నిలుస్తున్నది. వేసవి ముదరక ముందే నీటి ఎద్దడితో అల్లాడిపోతున్నది. ఈ తండాను ఆనుకొని ఉన్న తిమ్మాపూర్ గ్రామంలోని మైసమ్మ చెరువులో నీరు ఉంటేనే ఇక్కడ బోర్లు, బావుల్లో భూగర్భ జలాలు పుష్కలంగా పెరిగేవి. కానీ, చెరువు అడుగంటిపోగా, భూగర్భజలాలు తగ్గిపోయాయి. ఈ తండా మీదుగా మల్కపేట రిజర్వాయర్ కెనాల్ వెళ్తున్నా ప్రభుత్వం చుక్కనీటిని వదలకపోవడం సమస్యగా మారింది. ఫలితంగా పంటలు ఎండిపోతుండడంతో పశువులను మేపుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. ఈ తండానే కాదు.. దీంతోపాటు రాజన్నపేట, కిష్టూనాయక్ తండా, దేవునిగుట్టతండాల్లోనూ ఇదే దుస్థితి ఉన్నది. ఇక్కడి ప్రజల కష్టాలు తెలుసుకుని మాజీ మంత్రి కేటీఆర్ స్పందించి మల్కపేట రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేయాలని నీటి పారుదల శాఖ మంత్రికి లేఖ రాశారు. అయినా, ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితి కనిపిస్తున్నది. ఇటు సాగు నీటికే కాదు.. తాగునీటికీ తండా వాసులు నరకం చూస్తున్నారు. గతంలో ఇంటింటికీ మిషన్ భగీరథ నీరు సరఫరా అయ్యేది. అయితే, కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత ఈ పథకాన్ని పట్టించుకోకపోవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు.
నాకు మూడెకరాల పొలం ఉన్నది. ఇంకో మూడెకరాలు కౌలుకు తీసుకుని చేస్తున్న. అండ్ల రెండెకరాలు ఇదివరకే ఎండిపోయింది. బావి ఉన్నా నీళ్లు లేవు. సైడ్ బోరు ఏసిన. నీళ్లు చాలుతలేవు. ఇదే బాధనుకుంటే కరెంటు సక్కగిడుస్తలేరు. అర్ధరాత్రి ఒంటి గంటకు వత్తున్నది. తెల్లందాక లేసి పోవుడైతుందని పొలంకాడనే గుడిసేసుకుని ఉంటున్న. ఇవారకే మస్కట్పోయి బాగ నష్టపోయిన. ఊళ్లె పంటలు మంచిగనే పండుతున్నయంటే వచ్చి ఎవుసం జేసుకుంటే ఇండ్ల గూడా నష్టం రావట్టె. సెరువులల్ల నీళ్లు నింపుతమని మొన్నటిదాక సెప్పిరి. ఇప్పుడు ఎవ్వలు పట్టించుకుంటలేరు. పొలం ఎండిపోతే ఏమస్తదని పశువులను మేపుతున్నం.
నాకు ఊళ్లే మూడెకరాలు భూమి ఉన్నది. అందులో వరి వేసిన. సాగు నీళ్లు లేవు. పంట ఎండుతంది. కాల్వల నీళ్లిడుస్తమని సెప్పి ఇప్పుడు సప్పుడుజేస్తలేరు. బోరు ఉన్నా నీళ్లు ఎల్లుతలేవు. ఉన్న కొద్దిపాటి నీళ్లను పెట్టుకుందామంటే పొద్దందాక కరెంట్ ఉంటలేదు. ఎప్పుడస్తదో తెలుస్తలేదు. రాత్రి ఒకటిటికి కరెంటు ఇస్తున్రు. నా భర్త లేడు. మా యారాలును పట్టుకుని ఆడోళ్లం తెల్లందాక కరెంటుకాడికి పోతున్నం. ఏం జేసుడో అర్థమైతలేదు.
ఊళ్లె ఎప్పుడూలేనిది ఇప్పుడు తాగే నీళ్లకు కూడా బాగా తిప్పలైతుంది. మిషన్ భగీరథ నీళ్లు వస్తలేవు. బోర్కాడ ఎత్తుకచ్చుకుందామంటే టైంకు కరెంటుంటలేదు. చేతి పంపు గూడా కొట్టంగ కొట్టంగ బిందెడు నీళ్లు వచ్చుడే ఇబ్బంది ఉంది. పదేండ్ల నుంచి ఏ సమస్య లేదు. ఇప్పుడే సెప్పరాని ఇబ్బందైతంది. తాగేతానికి నీళ్లు లేవు. పొలాలకాడ నీళ్లుంటలెవ్వు. ఎవ్వలకు సెప్పినా పట్టించుకుంట లేరు.