Karimnagar | కమాన్ చౌరస్తా, ఏప్రిల్ 5 : దేవాలయాలు మానవతా వికాస కేంద్రాలుగా విలసిల్లుతున్నాయని, ప్రజలకు జీవకోటికి సేవలందించే విధంగా మన పూర్వీకులు ఆలయాలను రూపొందించారని జాతీయ సాహిత్య పరిషత్ పూర్వ జాతీయ అధ్యక్షుడు ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. జాతీయ సాహిత్య పరిషత్ కరీంనగర్ జిల్లా శాఖ శనివారం కొత్తపల్లిలోని చిన్న గుట్టపై వెలసిన స్వయంభూ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో వసంతోత్సవం పేరుతో శ్రీ వేంకటేశ్వర వైభవం నేపథ్యంలో నిర్వహించిన కవి సమ్మేళం నిర్వహించారు.
ఈసందర్భంగా ఆయన కొత్తపెల్లిలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వందల సంవత్సరాల చరిత్ర ఉండడమే కాకుండా, అనేక మంది యోగులు, రుషులు ఇక్కడ ఉన్న గుహలో తపస్సును ఆచరించారని, అటువంటి మహిమాన్విత స్థలంలో ఈరోజు వసంతోత్సవం నిర్వహించడాన్ని గొప్ప దైవకార్యంగా అభివర్ణించారు. దీనిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ దేశం కోసం, ధర్మం కోసం పాటుపడవలసిన అవసరం ఉందని సూచించారు.
జాతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షులు గాజుల రవీందర్ సభాధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ గండ్ర లక్ష్మణరావు, ప్రజ్ఞ భారతి చైర్మన్ డాక్టర్ లెక్కల రాజభాస్కర్ రెడ్డి, జాతీయ సాహిత్య పరిషత్ తెలంగాణ అధ్యక్షుడు వడ్లూరి ఆంజనేయరాజు, నరహరి నారాయణరెడ్డి, బండ గోపాల్ రెడ్డి, కొత్తపల్లి పూర్వ సర్పంచ్ వాసాల రమేశ్, నరహరి జగ్గారెడ్డి మాట్లాడారు.
సంస్థ ప్రధాన కార్యదర్శి నంది శ్రీనివాస్ సమన్వయం చేసిన ఈ కవిసమ్మేళనంలో ఎస్ ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ కలువకుంట రామకృష్ణ,కొత్త అనిల్, స్తంభంకాడి గంగాధర్, ముత్తినేని శ్రీనివాస్, శ్రీనివాస జియ్యంగార్, నీలగిరి అనిత, ఎర్రోజుల రాజమౌళి, కటుకోజ్వల మనోహరాచారి, అనాసి జ్యోతి, సామలకిరణ్, మందల నగేష్ రెడ్డి, ఎలగందుల సత్యనారాయణ, సముద్రాల నాగేశ్వరరావు, జనార్దన్ రెడ్డి, కె.ఎస్.అనంతాచార్య, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ కవిత్వగానం చేసిన 122 మంది కవులను శ్రీ వేంకటేశ్వర స్వామి చెంత పూజ చేసిన శాలువా, ప్రశంసా పత్రం, పూలు పండ్లతో సత్కరించారు.