రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ యువతిని కిడ్నాప్ చేశారంటూ సోషల్ మీడియాలో చెలరేగిన వదంతులకు తెరపడింది. ప్రేమించిన యువకుడే మాస్క్ పెట్టుకొని వచ్చి అమ్మాయిని బలవంతంగా తీసుకెళ్లడం, చివరికి తాను కిడ్నాప్ కాలేదంటూ యువతి సోషల్మీడియాలో పెట్టిన పోస్టుతో కథ సుఖాంతమైంది. వివరాల్లోకి వెళితే.. చందుర్తి మూడపల్లికి చెందిన శాలిని (19) తన తండ్రితో కలిసి మంగళవారం ఉదయం 5 గంటలకు గ్రామంలోని హనుమాన్ ఆలయానికి వెళ్లి, దర్శించుకున్నారు. పూజలు ముగించుకొని బయటకు వస్తుండగా, అప్పటికే అక్కడ కారులో మాటు వేసి ఉన్న నలుగురు యువకులు ఒక్కసారిగా దూసుకొచ్చారు. వెంటనే కారుదిగి అమ్మాయిని తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అడ్డుకుంటున్న యువతి తండ్రి చంద్రయ్యను నెట్టివేసి కారులో లాక్కెళ్లారు. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డు కావడం, ఆ ఫుటేజీ బయటికి రావడంతో జిల్లాలో కలకలం రేపింది.
కథ సుఖాంతం..
యువతి తండ్రి చంద్రయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. మరోవైపు మంగళవారం జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి కేటీఆర్ ఈ ఘటనపై ప్రత్యేకంగా ఎస్పీ రాహుల్ హెగ్డే, కలెక్టర్ జయంతితో మాట్లాడారు. జిల్లాలో శాంతిభద్రతలపై ఆరా తీశారు. నిందితులను సాయంత్రంలోగా పట్టుకోవాలని ఆదేశించారు. దీంతో అప్పటికే రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు ము మ్మరం చేశారు. మధ్యాహ్న సమయంలో యువ తి ఫేస్బుక్లో పోస్టుపెట్టి కొత్త ట్విస్ట్ ఇచ్చింది. తాను కిడ్నాప్ కాలేదని, ప్రేమించిన యువకుడే ముఖానికి ముసుగు వేసుకొని వచ్చి తనను కారులో తీసుకెళ్లాడని, ఇద్దరం ప్రేమ వివాహం చేసుకున్నామని పేర్కొంటూ వీడియోలు, ఫొటోలు సోషల్మీడియాలో షేర్ చేయడం అందరినీ షాక్కు గురిచేసింది. ఉదయం నుంచీ జరుగుతున్న కిడ్నాప్ హైడ్రామాకు తెరపడింది.
అది చందుర్తి మండలం మూడపల్లి.. సమయం మంగళవారం తెల్లవారుజామున 5గంటలు.. ఓ ఇద్దరు తండ్రీకూతుళ్లు సమీపంలోని హనుమాన్ ఆలయానికి వెళ్లారు. పూజలు చేసి తిరుగు పయనమయ్యారు. ఇంకో క్షణమైతే ఇంట్లోకి వెళ్తామనే టైంలోనే ఓ కారు రయ్మని దూసుకొచ్చి వీరి ముందు ఆగింది. వెంటనే అందులో నుంచి ఇద్దరు యువకులు ముఖాలను మాస్క్ పెట్టుకొని కిందికి దిగారు. అమ్మాయిని లాక్కెళ్లారు. అడ్డొచ్చిన తండ్రిని నెట్టేసి, యువతిని బలవంతంగా కారులో ఎక్కించుకొని పరారయ్యారు. సీసీ కెమెరాలో రికార్డయిన ఈ కిడ్నాప్ దృశ్యం సంచలనం సృష్టించింది. రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయింది. ఏకంగా మంత్రి కేటీఆర్ సీరియస్ కావడంతో వెనువెంటే పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టగా, మధ్యాహ్నంకల్లా ఆ అమ్మాయి సోషల్మీడియాలో పోస్టు పెట్టి కొత్త ట్విస్ట్ ఇచ్చింది. ‘నేను కిడ్నాప్ కాలేదు. ప్రేమించిన యువకుడే నన్ను తీసుకెళ్లిండు. మేము పెండ్లి చేసుకున్నం’ అంటూ వీడియో రిలీజ్ చేయడంతో ఆందోళనకు తెరపడింది.
– చందుర్తి, డిసెంబర్ 20
నాలుగేండ్లుగా ప్రేమించుకుంటున్నాం
మా గ్రామానికి చెందిన జాని, నేను నాలుగేండ్లుగా ప్రేమించుకుంటున్నం. నేను ప్రేమించిన వ్యక్తి దళితుడు కావడంతో ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు. ఏడాది క్రితమే వివాహం చేసుకున్నం. కానీ నేను మైనర్ కావడంతో ఇంటి వద్దే ఉంటున్న. ఉదయం అతడు ముఖానికి మాస్క్ పెట్టుకొని వచ్చి తీసుకెళ్లడంతో గుర్తుపట్టలేకపోయిన. తర్వాత గుర్తుపట్టి అతనితో వెళ్లిపోయిన.
– శాలిని