వడ్లు కొనబోమని రైతన్నను వేధిస్తున్నది
రాష్ట్ర సర్కారు రైతన్నకు అన్నీ ఇస్తుంటే ఇంత గోస పెట్టుడు కరెక్టేనా..?
తెలంగాణ అంటేనే.. రైతు రాజ్యం
రామరాజ్యం అంటే.. బీజేపీ నేతలకు తెలుసా..?
ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఫైర్
తిమ్మాపూర్ రూరల్, డిసెంబర్18: ‘ప్రపంచం అంతా ఆశ్చర్యపోయేలా వ్యవసాయం అంటే తెలంగాణ, తెలంగాణ అంటే రైతు రాజ్యంగా వర్ధిల్లుతుంటే, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతన్నకు శాపంలా పట్టుకుంది. రైతన్నకు కావల్సినవన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నప్పటికీ.. అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని అన్నట్లుగా వడ్లు కొనబోమని రైతన్న పాలిట శనిలా మారిందని’ రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 20న రైతు వ్యతిరేక కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనానికి సీఎం కేసీఆర్ పిలుపునివ్వగా, శనివారం ఎల్ఎండీ కాలనీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకర్గ నేతలతో రసమయి సమావేశమయ్యారు. నీళ్లు లేని ఎవుసం, ఎండుతున్న చెరువులతో ఆగమైన తెలంగాణను సీఎం కేసీఆర్ అహోరాత్రులు శ్రమించి సస్యశ్యామలం చేశారని, ప్రాజెక్టులు నిర్మించి ప్రతి ఎకరా పంట పండేలా చేశారని కొనియాడారు. ఇప్పుడు రైతులకు చేతినిండా పని దొరికి కడుపు నిండా సుఖంగా ఉండే సమయానికి వడ్లు కొనబోమని మొండికేస్తున్న మోడీ ప్రభుత్వాన్ని వడ్లు కొంటం అనేదాక చావుడప్పులు కొట్టుకుంటూ దిష్టిబొమ్మ దహనం చేయాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి గ్రామంలో కార్యకర్తలు, రైతులు పాల్గొని నిరసన తెలుపాలని కోరారు.
కేంద్రానికి కొనమనే హక్కు లేదు..
దేశవ్యాప్తంగా ఆహార ఉత్పత్తులను కేంద్రమే కొనుగోలు చేయాలని, కానీ రాజ్యాంగానికి విరుద్ధంగా తెలంగాణ వడ్లనే కొనమని స్పష్టంగా చెప్పడాన్ని రైతులపై కేంద్రం కుట్రగానే అనుకోవాలని దుయ్యబట్టారు. తెలంగాణ రైతులు ఎదుగుతుంటే అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రామరాజ్యం అంటేనే వ్యవసాయ రాజ్యం అని.. అలాంటి తెలంగాణ పంటలు పండిస్తుంటే ఆ రామరాజ్యం బీజేపీ నేతలకు ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు.
ఎంపీకి వ్యవసాయం తెలుసా..?
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్కు అసలు వ్యవసాయం తెలుసా అని ప్రశ్నించారు. ఏనాడైనా నియోజకవర్గంలో రైతుల సమస్యలపై పట్టించుకున్నాడా అని దుయ్యబట్టారు. నియోజకవర్గంలో ఎన్ని ఎకరాల వరి సాగు అవుతుందో తెలుసా అని ప్రశ్నించారు. ఏమీ తెలియకుండా.. కేంద్ర ప్రభుత్వంతో వడ్లను కొనిపించే పనిచేయకుండా, వరి వేయండని రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. రైతులు సీడ్ కంపెనీలు, రైస్ మిల్లర్లతో మాట్లాడుకునే వరి పంటలు వేయాలని సూచించారు. సోమవారం ప్రతి గ్రామంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలతో చావుడప్పులు మోగించాలని పిలుపునిచ్చారు. ఇక్కడ సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, నియోజకవర్గ వ్యాప్తంగా ఎంపీపీలు, జడ్పీటీసీలు ఉన్నారు.
ఆ‘పాత’ మాధుర్యం
మంథనిటౌన్, డిసెంబర్ 19: పాతకాలం నాటి వస్తువులు చూశారా.. మీ తాతలు, ముత్తాతలు వారి కాలంలో ఎలాంటి వస్తువులు వాడేవారో మీకు తెలుసా.. అయితే పదండి మంథనిలోని మంత్రపురి దర్శన్. శ్రీ సీతారామ సేవా సదన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ మ్యూజియంలో ఇప్పటితరానికి తెలియని.. ఎనుకట మనవాళ్లు వాడిన పనిముట్లు, ఇసిరెలు మనకు ఎన్నో కనిపిస్తాయి. మనల్ని పాత ప్రపంచంలోకి తీసుకెళ్తాయి.
అనేక సేవా కార్యక్రమాలకు నిలయంగా మారిన మంథనిలోని శ్రీ సీతారామ సేవా సదన్ పాత వస్తువులను పరిరక్షించాలని నిర్ణయించుకున్నది. ప్రస్తుత సాంకేతిక ప్రపంచంలో కొత్త వస్తువులను కొనుగోలు చేస్తూ, పాతవాటిని తీసేస్తున్న నేపథ్యంలో వాటిని సేకరించి, భావి తరాలకు పరిచయం చేసేందుకు 2006లో మంథనిలో మంత్రపురి దర్శన్ ఏర్పాటు చేశారు. ఇందుకు చాలా కష్టపడి పురాతన పరిమళాన్ని చాటేలా చేద బావితో కూడిన మిద్దె ఇంటిని కొనుగోలు చేశారు. ఎక్కడెక్కడో తిరిగి పాతకాలం నాటి అనేక వస్తువులను సేకరించి, ఆ ఇంట్లో భద్రపరిచి, పురాతన వస్తు నిలయంగా మార్చారు. ఇక్కడి పురాతన వస్తువులు మనల్ని పాతరోజుల్లోకి తీసుకెళ్తాయి. ఆనాడు వ్యవసాయ, రవాణా పనులకు వినియోగించిన సవారి కచ్చురంతోపాటు ఎడ్ల బండి, వడ్ల గుమ్మి, గుంటుక మొద్దు, కందిలి, వడ్ల ఆము, సొలలు, పొయ్యిలు, పురాతన లాంతర్, టెలిఫోన్, రెడియోలు, కడాయిలు, భారీ సరాతం, కర్రు దువ్వలు, దీపాలు పెట్టుకునేందుకు కట్టేతో తయారు చేసిన స్టాండ్లు, పఠన స్టాండ్లు, పాల ఉట్టి, గంగోలం, సన్నాయి డోలు ఇలా ఒక్కటేమిటి అనేక వస్తువులు కనువిందు చేస్తుంటాయి. అప్పటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేస్తుంటాయి. ఇవే గాక బిందెలు, ఆడ వారు బొట్టు బిల్లులు, కాటిక దాచుకునే డబ్బా, బొంగరాళు, పిల్లలు ఆడుకున్న ఎడ్ల బండి బొమ్మలు, పచ్చళ్లు నిల్వ చేసుకునే మడుతమణులు లాంటి ఎన్నో వస్తువులు అక్కడ ఉన్నాయి.