పాలకుర్తి, జూన్10 : రోడ్డు ప్రమాదంలో అమ్మానాన్నను కోల్పోయి, తీవ్రంగా గాయపడిన నాలుగేళ్ల చిన్నారి సహస్రకు ఉచిత వైద్యం అందింది. ‘నమస్తే’ కథనానికి ప్రభుత్వం స్పందించి, పూర్తి ఉచితంగా ఆపరేషన్ చేయించింది. పాలకుర్తి మండలం బసంత్‌నగర్‌కు చెందిన గుంటిపెల్లి రాము, అనుష దంపతులు ఈ నెల 5న సుల్తానాబాద్ వద్ద రోడ్డుప్రమాదంలో మృతిచెందగా, నాలుగేళ్ల కూతురు సహస్ర తీవ్రగాయాలతో బయటపడింది. కానీ, గ్రేడేడ్ స్పైనల్ కార్డు దెబ్బతిని ఐసీయూకే పరిమితమైంది. సర్జరీకి సుమారు 10 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో పేద కుటుంబానికి చెందిన నానమ్మ తల్లడిల్లిపోయింది. సాయం కోసం మానవతావాదులను అర్థించింది.
ఈ విషయం తెలుసుకున్న ‘నమస్తేతెలంగాణ’ చిన్నారి పరిస్థితిపై ‘సహస్రను ఆదుకోండి’ శీర్షికన మంగళవారం మానవీయ కథనం ప్రచురించింది. ఈ కథనం చూసిన రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదరరాజనర్సింహ స్పందించారు. వెంటనే ఉచిత వైద్యం కోసం ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు వైద్యాధికారులు కరీంనగర్లో చికిత్స పొందుతున్న సహస్రను ఉదయమే హైదరాబాద్‌లోని రెయిన్బో హాస్పటల్‌కు తరలించారు.
మధ్యాహ్న సమయంలో పూర్తి ఉచితంగా ఆపరేషన్ చేశారు. సర్జరీ విజయవంతమైందని వైద్యులు తెలిపారు. దీంతో నానమ్మతోపాటు బంధువులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రభుత్వంతోపాటు ‘నమస్తే తెలంగాణ’కు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ‘నమస్తే తెలంగాణ’ పత్రికలో వచ్చిన కథనానికి స్పందిస్తున్నట్టు జే వెంకటి, ఎంబీబీఎస్ డీజీవో జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి హైదరాబాద్ నుంచి లేఖను విడుదల చేశారు.