జమ్మికుంట/ ఇల్లందకుంట, జూలై 22 : సాగుకు మూడు గంటల కరెంట్ చాలన్న రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై రైతాంగం భగ్గుమంటున్నది. ఆరో రోజూ శనివారం ఉమ్మడి జిల్లాలోని రైతువేదికల సాక్షిగా హస్తంపార్టీ వైఖరిని ఎండగట్టింది. కాంగ్రెస్‌కు అధికారమిస్తే రైతుల బతుకు కటిక చీకటేనని తూర్పారబట్టింది. ‘కాంగ్రెస్ అంటే కటిక చీకటే. మూడు గంటల ఆ పార్టీ మాకొద్దు. 24గంటల కరెంట్ ఇస్తున్న బీఆర్ఎస్సే ముద్దు’ అంటూ మూకుమ్మడిగా తీర్మానాలు చేసింది. ఓట్ల కోసం ఊర్లకు వచ్చే హస్తం పార్టీ నాయకులను ఊరి పొలిమేర్లదాకా తరిమికొడతామని నినదించింది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం బిజిగిరిషరీఫ్, ఇల్లందకుంట మండలం సిరిసేడులో ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి పాల్గొని, కాంగ్రెస్‌ది 3 గంటల విధానమని మండిపడ్డారు. అలాగే పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల, సుల్తానాబాద్ మండల కాట్నపల్లి, కాల్వశ్రీరాంపూర్ వేదికల్లో ఎమ్మెల్యే దాసరి మనోహార్‌రెడ్డి పాల్గొని, రైతు వ్యతిరేకి కాంగ్రెస్‌ను నమ్మవద్దని రైతులకు సూచించారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నల్లగొండలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌తో పాల్గొని, రైతులతో కలిసి నిరసన తెలిపారు. ‘కరెంట్ వద్దన్న కాంగ్రెస్ మాకొద్దు.. రైతు వ్యతిరేకి రేవంత్‌రెడ్డి’ అంటూ నినదించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఫ్రీ కరెంట్‌పై రేవంత్‌రెడ్డి మాట్లాడిన మాటలను అన్నదాతలకు వినిపించారు.
కాంగ్రెస్‌ను కచరల పారయ్యాలె..బీజేపీని గంగలెయ్యాలె
అప్పుడు పోయిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇత్తది ఇత్తది అంటే పొద్దునో గంట.. రాత్రో గంట కరెంట్ ఇచ్చేది. రాత్రి అన్నం తినేటైంల పొలం కాడికి పోయి మంచె మీద ఓ కునుకు తీసే లోపే అచ్చి పోయేది పది నిమిషాల కరెంట్. మళ్లీ పొద్దుగాల ఇంటికి అచ్చినంక ‘కరెంట్ పెట్టినవా’ కొడుకా అంటే.. డాడీ ఎప్పుడో కరెంట్ అచ్చిపోయింది అంటే బాగా తిని పడుకున్నవ్ అని తండ్రి తిడితే కండ్లపొంట దుఃఖమొచ్చిది. అసొంటి పరిస్థితిని తొలగించి, తొమ్మిదేండ్ల కింద టీఆర్ఎస్ ప్రభుత్వం అచ్చిన తర్వాత 24 గంటల కరెంట్ ఇచ్చిన ఘనుడు ఎవరు? ఏ టైగర్ అంటే ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు అని గర్వంగా చెప్పుకొనే సందర్భం. ఇది ఒకటే గాకుండా రైతు చనిపోతే 5లక్షల బీమా ఇచ్చిన ఘనుడు ఎవరంటే ప్రపంచం మీద కేసీఆర్ ఒక్కడే. రైతుబంధును ఎకరానికి 4 వేల నుంచి 5 వేలు చేసిన ఘనత కేసీఆర్‌ది. ఇవ్వాల్ల ఆడపిల్ల పెండ్లికి 29 రాష్ర్టాల్లో లక్ష ఇచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే. గర్భిణులు దవాఖానకు వెళ్తే రూపాయి ఖర్చుపెట్టకుంట ఫ్రీ ట్రీట్మెంట్ చేస్తున్నరు. ఆడపిల్ల పుడితే 13 వేలు, మగబిడ్డ అయితే 12 వేలు ఇత్తున్న ఘనత ఈ ప్రభుత్వానిదే. నేను 25 ఏండ్లు గల్ఫ్ దేశాలకు పోయిన.
అప్పుడు వ్యవసాయానికి నీళ్లు లేవు. అందుకే బయట దేశాలకు పోయిన. ఇప్పుడు తెలుసుకుంటే 24గంటల కరెంట్ అస్తున్నది. రైతుబంధు అస్తున్నది. అందుకే బయటికి పోవుడు బంద్‌జేసి ఇక్కడే ఏవుసం జేసుకుంటున్న. అరవై ఏండ్లు పాలించిన కాంగ్రెస్ రైతుబంధు ఇయ్యలేదు. మూడు గంటల కరెంట్ ముప్పైసార్లు ఇచ్చేది. 3 గంటల కరెంట్‌తో 30 గుంటల మడి కూడా పారదు. అందుకే కాంగ్రెస్‌ను కచరల పారయ్యాలె. బీజేపీని గంగల పారయ్యాలె. గర్వంగా చెప్పండి 24 గంటల కరెంట్ ఇస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని గెలిపిత్తమని. బ్రహ్మండంగా మెజార్టీతో గెలిపిత్తమని అక్కాచెల్లెళ్లందరికి చెప్పున్రి.
– కొడిమ్యాల మండలం నల్లగొండలో నిర్వహించిన రైతు సమావేశంలో రైతు పిల్లి చంద్రయ్య
రేవంత్‌కు బుద్ధిచెబుతాం
కాంగ్రెస్ పాలనలో మస్తు గోసెళ్లదీసినం. కరెంట్ రాక పంటలు ఎడిపోతే పట్టించుకునే దిక్కుండేది కాదు. కాలిన ట్రాన్స్ఫార్మర్ల రిపేరుకు చెప్పులు అరిగేలా తిరిగేది. ఎరువుల కోసం అష్టకష్టాలు పడ్డం. ఆ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఎన్నికల ముందట మనసులోని మాట చెప్పి కుట్రబుద్ధిని బయటపెట్టిండు. ఆయన పార్టీకి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెబుతం. కరెంట్, ఎరువులు, విత్తనాలు అందిస్తున్న సీఎం కేసీఆర్ సారుకు అండగా నిలుస్తం.
– మడ్డి శ్రీనివాస్‌గౌడ్, రైతు, గుంపుల (ఓదెల)
తెలంగాణ అచ్చినంకే ఏవుసం పండుగైంది
తెలంగాణ వచ్చినంకనే రాష్ట్రంలో రైతుల గోసలన్ని పోయి ఏవుసం పండగలా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నీళ్లు లేక, కరంట్ లేక అరిగోస పడ్డం. చాలా మంది రైతులు ఏవుసం బందు పెట్టి కూలీ పనులకు పోయేది. గిప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. పడావు పడ్డ భూములన్నీ సాగులోకి అచ్చినయ్. రైతులకు కావాల్సిన కరంట్, విత్తనాలు, ఎరువులు, లాగోడికి పైసలు, రైతు చినపోతే బీమా పైసలు అత్తన్నయ్. గవేమి కాంగ్రెస్ హయాంలో లేవు. అలాంటోళ్లకు ఓటేందుకు వేస్తాం. మళ్లా కేసీఆర్ సారే సీఎం కావాలె.
– గట్టు మహేశ్‌గౌడ్, రైతు, గుంపుల (ఓదెల)
ఎరువుల కొరత లేదు..
కాంగ్రెస్, టీడీపీలు పాలించినప్పుడు ఎరువుల కోసం చెప్పులు లైన్లో పెట్టేవాళ్లం. పొద్దున పోయి పడిగాపులు కాసేవాళ్లం. అప్పుడు కరెంట్ గురించి చెబితే దుఃఖమచ్చేది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. కేసీఆర్ సార్ రైతుల కోసం అన్ని మంచిగ జేత్తున్నడు. పంటలకు సరిపడా నీళ్లు, కరెంట్ ఇస్తున్నడు. పెట్టుబడికి సాయం జేత్తున్నడు. అందుకే ఆ సారునే నమ్ముకుంటం.
– గంగాధర ఎల్లయ్య, రైతు చెప్యాల (కొడిమ్యాల)
కేసీఆర్ సారుకే అండగా ఉంటం
రైతుల మనస్సు తెలిసిన తెలంగాణ సీఎం కేసీఆర్. అందుకే తెలంగాణ రాకముందు అష్టకష్టాలు పడ్డ రైతులకు మేలు జేస్తుండు. రైతుబంధు, రైతుబీమా ఇస్తున్నరు. ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచుతున్నరు. కానీ కాంగ్రెస్ పాలనలో అన్ని కష్టాలే పడ్డం. రాత్రిపూట కరెంట్ మోటర్లు పెట్టేందుకు వెళ్లి అనేక మంది రైతుల ప్రాణాలు పోయినయ్. గట్లాంటి కాంగ్రెస్‌కు మేమేందుకు ఓటేస్తం. మా కన్నీళ్లు తుడిచిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కే అండగ ఉంటం.
– జూపల్లి సందీప్‌రావు, విండో చైర్మన్ (గర్రెపల్లి)