Korutla | కోరుట్ల, జూన్ 2 : కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థిని లక్నం భానుజ్ఞకు పాఠశాల ఉపాధ్యాయులు ఆర్ధిక సాయమందించి బాసటగా నిలిచారు. ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతిలో 574లు సాధించిన భానుజ్ఞ మండల టాపర్ గా నిలిచింది. ఆత్యుత్తమ మార్కులతో బాసర త్రిబుల్ ఐటీలో సీటు సాధించిన పేదింటి బిడ్డ బానుజ్ఞ చదువుకు ఆటంకం కలుగకూడదనే ఉద్దేశ్యంలో ఉపాధ్యాయులు తలో చేయి వేసి రూ.40 వేలు సమకూర్చారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం బానుజ్ఞకు ఆర్థిక సాయాన్ని అందించి ఔదార్యాన్ని చాటుకున్నారు.
కాగా భానుజ్జ తల్లి బీడీలు చుడుతుండగా, దుబాయిలో ఉంటున్న తండ్రి వీరితో బంధాన్ని తెంచుకున్నాడు. త్రిబుల్ ఐటీలో సీటు సాధించిన బానుజ్ఞకు పేదరికం అడ్డుగోడగా నిలిచింది. ఉదారత కల్గిన విద్యాభిమానులు, దాతలు స్పందించి ఆ అమ్మాయికి తోడ్పాటు నందించాలని పాఠశాల యాజమాన్యం విన్నవించారు. తల్లి సంపాదన అంతంత మాత్రమే కావడంతో, ఏపూటకాపూట గడపడమే కష్టంగా మారిందని, చదువుల తల్లిని ఉన్నత చదువులకు దూరం చేయకుండా దాతలు స్పందించి ఆర్థిక సాయం అందించాలని ప్రధానోపాధ్యాయుడు గంగాధర్, ఉపాధ్యాయులు కృష్ణ మోహన్ రావు, నాగరాజు, లక్ష్మీనారాయణ విజ్ఞప్తి చేశారు.