సర్కారు బడుల్లో మరింత నాణ్యమైన విద్యను అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నది. కోట్లాది నిధులతో బలోపేతం చేస్తూనే.. ఉపాధ్యాయుల పనితీరును మెరుగు పరిచేందుకు చర్యలు చేపట్టింది. సమయపాలన పాటించని, డుమ్మా పంతుళ్లను గాడిలో పెట్టి, పాఠశాలలను సక్రమంగా నడిపించేందుకు బయోమెట్రిక్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ నెల ఒకటో తేదీ నుంచే ఆధార్ సహిత వేలిముద్ర విధానాన్ని (ఆధార్ బేస్డ్ అటెండెన్స్ సిస్టం -ఆబాస్)ను అమలు చేస్తున్నది. ఇక నుంచి విధులకు ఆలస్యంగా రావడం, సాయంత్రం ముందుగానే వెళ్లిపోయే అసంబద్ధ పద్ధతికి అడ్డుకట్ట పడనున్నది.
జగిత్యాల జిల్లా ఓ మారుమూల గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాల అది. అక్కడ కీలకమైన ఫిజికల్ సైన్స్ బోధించే ఓ ఉపాధ్యాయుడికి బోధన కంటే, చీటీల వ్యాపారంపైనే మక్కువ. ప్రతి నెలా ఇరవై చీటీ పాటలు పాడే ఆ సారు టీచింగ్ డ్యూటీ పక్కన పెట్టి, నెలవారీ ప్రీమియం వసూలు చేయడం, పాటపాడిన వారికి డబ్బులివ్వడం, లెక్కలు చూసుకోవడం నిత్యం చేసే పని. పాఠాలు చెప్పలేనంత బిజీగా మారిపోయిన ఆ సారు, తన ప్లేస్‌లో ఒక విద్యావలంటీర్‌ను ఏర్పాటు చేశాడు. నెలలో రెండు మూడు సార్లు బడికి వెళ్లి సంతకాలు చేయడమే తప్పా అక్కడ బోధించేది లేదు. ఇలాంటి సార్లే కాదు, పనివేళలను పక్కన పెట్టి సమయ పాలన పాటించని సార్లందరికీ ఇక చెక్ పడనున్నది.
జగిత్యాల, సెప్టెంబర్ 2(నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ పాఠశాల విద్యకు కాయకల్ప చికిత్స మొదలైంది. సర్కారు బడి చదువంటే వానకాలం చదువు అన్న విమర్శను మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సమయపాలన పాటించని ఉపాధ్యాయులను గాడిలో పెట్టి, పాఠశాలలను సక్రమంగా నడిపించడానికి రంగం సిద్ధమైంది. జిల్లాల పునర్విభజనకు ముందే పాఠశాలల్లో మొదటి దఫా బయోమెట్రిక్ హాజరు విధానం అమలు చేసేందుకు చర్యలు చేపట్టినా, కొన్ని అనివార్య కారణాల వల్ల నిలిచిపోయింది. కొత్త జిల్లాలు ఏర్పడడంతో పాటు, పాలన గాడిలో పడిన తదుపరి 2017 జనవరి 1 నుంచి కొన్ని జిల్లాల్లో బయోమెట్రిక్ విధానం అమలు చేసేందుకు విద్యాశాఖ అధికారులు ప్రయత్నించారు. అయితే, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ససేమిరా అనడం, టీచర్లు పెదవి విరవడంతో ఈ పద్ధతి మూలనపడింది. అయితే, ఈసారి పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించడంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో 20 రోజుల కిందట బయోమెట్రిక్ హాజరు విధానం అమలులోకి వచ్చింది.
ఆబాస్తో అడ్డుకట్ట
ప్రభుత్వ పాఠశాలల్లో అసంబద్ధ అటెండెన్స్‌కు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ఆబాస్ (ఆధార్ బేస్డ్ అటెండెన్స్ సిస్టమ్)తో చర్యలు తీసుకున్నది. ఆబాస్ యంత్రాన్ని పాఠశాలకు ఒకటి చొప్పున పంపిణీ చేశారు. ఈ యంత్రాల్లో పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుడి పేరు, అధార్‌కార్డు నంబర్ నమోదు చేస్తారు. ఈ యంత్రం పాఠశాలలోనే పనిచేసేలా లొకేషన్‌ను గూగుల్ మ్యాప్‌లో నిక్షిప్తం చేశారు. ఉపాధ్యాయుడు ఏ సమయానికి వెళ్లింది, తిరిగి పాఠశాల నుంచి ఎప్పుడు ఇంటికి వెళ్లింది అన్నది తెలుసుకునేలా చర్యలు చేపట్టారు. ప్రధానోపాధ్యాయుడితోపాటు బోధన, బోధనేతర సిబ్బంది అందరూ ఉదయం పాఠశాల నిర్దేశిత సమాయానికి చేరుకొని అబాస్ యంత్రంలో వేలిముద్ర ద్వారా సంతకం చేయాలి. వేలిముద్ర వేయగానే సమయం నమోదు కావడంతోపాటు, ఆన్లైన్ విధానంలో వెంటనే విద్యాశాఖ ఉన్నతాధికారులకు సమాచారం తెలిసిపోతుంది. సాయంత్రం సైతం అలాగే వేలి ముద్రవేయాల్సి ఉంటుంది. విధులకు ఆలస్యంగా రావడం, సాయంత్రం ముందుగానే వెళ్లిపోయే అసంబద్ద పద్ధతికి ఈ విధానంతో అడ్డుకట్ట పడుతుంది.
ఆబాస్ అమలుతో మరి కొన్ని మార్పులు
ఈ విధానం అమలుతోపాటు మరికొన్ని మార్పులు విద్యాశాఖలో రానున్నాయి. ఇప్పటి వరకు ప్రాథమిక పాఠశాలల నుంచి మొదలుకొని ఉన్నత పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులందరూ వ్యక్తిగత సెలవులను సంబంధిత ప్రధానోపాధ్యాయుడికి తెలియజేస్తూ వచ్చారు. ఈ విధానంలో కొంత మార్పు రానుంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడంతోపాటు, సెలవు వ్యవహారాన్ని ఉన్నతాధికారులకు నివేదించే వ్యవస్థను సైతం ఆబాస్ సిస్టమ్‌లో సృష్టించారు. ఇక నుంచి సెలవు పెట్టినట్లయితే సంబంధిత హెచ్ఎంకు సెలవు పత్రం అందజేయడంతోపాటు సెల్‌ఫోన్ మెసేజ్ ఇవ్వాలి. ఉపాధ్యాయుడు ఇచ్చిన సెలవు మెసేజ్‌ను ఎంఈవోకు లేదా, డిప్యూటీ డీఈవో సెల్‌ఫోన్‌కు హెచ్ఎం మెసేజ్ చేయాలి. ఉన్నత పాఠశాల హెచ్ఎం సెలవు పెట్టే పక్షంలో విషయాన్ని నేరుగా డీఈవో సెల్‌కు మెసేజ్ వెళ్లేలా చూస్తున్నారు. అలాగే, ముందస్తుగా సెలవు అనుమతి పద్ధతిని సైతం ఆబాస్ సిస్టమ్‌లోనే పొందుపర్చారు. ఉపాధ్యాయుడు సెలవు తీసుకోవాలని అనుకుంటే ఒక రోజు ముందుగానే ఆబాస్ యంత్రంలో సెలవు పత్రాన్ని అప్లోడ్ చేసే వీలు కలిగించారు.
పాఠశాలల జాబితాలో మార్పులు
జగిత్యాల జిల్లాలో వివిధ యాజమాన్యాల కింద 876 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో అధికంగా స్థానిక సంస్థల యాజమన్యం కింద నడిచేవే అధికంగా ఉన్నాయి. ఇక 5 ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలలు, 11 మోడల్ స్కూల్స్, 14 కస్తూర్బా పాఠశాలలు, రెండు గురుకుల పాఠశాలలు ఉన్నాయి. వీటన్నింటిలోనూ బోధన, బోధనేతర సిబ్బంది అబాస్ పద్ధతిలో బయోమెట్రిక్ హాజరు నమోదు చేయనున్నారు. జిల్లాలో దాదాపు నాలుగువేల మంది ఉపాధ్యాయులు ఆబాస్ యంత్రం ద్వారా ప్రతి రోజూ తమ హాజరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.