కరీంనగర్, జూన్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : గతేడాది సెప్టెంబర్‌లోనే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు పచ్చ జెండా ఊపింది. ఆ మేరకు ప్రక్రియను ప్రారంభించింది. స్కూల్ అసిస్టెంట్లకు ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు కల్పించింది. అలాగే, స్కూల్ అసిస్టెంట్ల బదిలీల ప్రక్రియను నిర్వహించింది. అందులో కొంత మంది స్కూల్ అసిస్టెంట్లు రిలీవ్ అయి.. విధుల్లో చేరగా, మరికొంత మంది సబ్‌స్ట్యూట్ లేక అదే స్థానంలో కొనసాగారు. ఇదే సమయంలో కొంత మంది కోర్టుకు వెళ్లడంతో ఆనాడు బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ మధ్యలోనే నిలిచిపోయింది. నిజానికి బీఆర్ఎస్ ప్రభుత్వం 2023 జనవరిలోనే ఈ ప్రక్రియకు పచ్చ జెండా ఊపినా కొన్ని అంశాలను విభేదిస్తూ పలువురు ఉపాధ్యాయులు ఆనాడు సైతం కోర్టుకు వెళ్లడంతో అప్పుడు ఆలస్యం జరిగింది. ఆ తర్వాత కోర్టు ఇచ్చిన ఆదేశాలను పరిగణలోకి తీసుకొని గతేడాది సెప్టెంబర్‌లో ప్రక్రియ మొదలు పెట్టినా.. మళ్లీ కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో వాయిదా పడింది. మళ్లీ ఇప్పుడు కోర్టు క్లియరెన్స్ రావడంతో ప్రభుత్వం బదిలీలు, పదోన్నతుల ప్రక్రియకు ఆదేశాలు జారీ చేసింది.
ఉపాధ్యాయ బదిలీలు, ఉద్యోగోన్నతులుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపిన నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో నేటి నుంచే ప్రక్రియ ప్రారంభం కానున్నది. దీంతో జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లోని వందలాది మంది ఉపాధ్యాయులకు వివిధ గ్రేడ్స్‌లో పదోన్నతులు వరించనున్నాయి. అధికారుల అంచనా ప్రకారం సుమారు రెండు వేలకుపైగా ఉపాధ్యాయులకు వివిధ గ్రేడ్స్‌లో ప్రమోషన్లు రానున్నా యి. ఇదే సమయంలో ఉమ్మడి జిల్లా మొత్తం మీద 5 వేల నుంచి 6 వేల మంది టీచర్లకు బదిలీలు జరిగే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకా రం ఉమ్మడి జిల్లాలో భారీగా బదిలీలు జరిగే అవకాశమే కనిపిస్తున్నది. ఉపాధ్యాయుల బదిలీలు గతంలో 2018లో జరిగాయి. ఆనాటి నుంచి ఉపాధ్యాయుల కోరిక మేరకు ప్రభుత్వం బదిలీల ప్రక్రియ చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నా.. ఏదో ఒక న్యాయపరమైన చిక్కుతో అమలు కాలేదు. చివరకు 2023 జనవరిలోనూ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియకు నాటి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీంతో రెండు అంశాలపై పలువురు ఉపాధ్యాయుల కోర్టుకు వెళ్లారు. ఫలితంగా దాదాపు ఎనిమిది నెలలుగా ఈ ప్రక్రియ పెడింగ్‌లో పడిపోయింది. తిరిగి గతేడాది సెప్టెంబర్‌లో కోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతోనే ఏమాత్రం అలస్యం చేయకుండా ఆనాటి ప్రభుత్వం ప్రక్రియ చేపట్టింది. ఈ ప్రక్రియ సజావుగా సాగుతున్న క్రమంలోనే పలు అం శాలపై మళ్లీ కొంత మంది కోర్టుకు వెళ్లడంతో మధ్యలోనే నిలిచిపోయింది. ఈ పరిణామ క్రమంలో ఈసా రి పక్షం రోజులపాటు ఈ ప్రక్రియ కొనసాగుతుందా? లేదా? అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ఎటువంటి అడ్డంకులూ లేకుం డా పూర్తయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయ పోస్టుల ఖాళీల వివరాలు స్పష్టంగా తెలిసే అవకాశముంటుంది. దీంతో ఈ విద్యా సంవత్సరం నడిపేందుకు ప్రభుత్వం వలంటీర్లను నియమించండం లేదా..? ఇతర కార్యక్రమాలు చేపట్టే అంశంపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఏర్పడుతుంది. అలాగే, ఒకవేళ ప్రభుత్వం డీఎస్సీ నిర్వహణకు పూనుకుంటే ఖాళీలు పెరిగే అవకాశం ఉంటుంది. తద్వారా అర్హులైన నిరుద్యోగ అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు పెరగడానికి ఆస్కారం ఏర్పడుతుంది.
ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానున్నది. వివిధ కారణాలతో గతేడాది సెప్టెంబర్‌లో ఆగిపోయిన స్థానం నుంచే మళ్లీ ఈ ప్రక్రియ కొనసాగనున్నది. తాజాగా, రాష్ట్ర విద్యాశాఖ ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ నెల 8 నుంచి 22 వరకు అంటే పక్షం రోజులపాటు ఈ జాతర జరగనున్నది. అధికారుల అంచనా ప్రకారం చూస్తే.. సుమారు 5 వేల నుంచి 6 వేల మంది టీచర్లకు ట్రాన్స్ఫర్లు జరిగే అవకాశం ఉండగా, రెండు వేలకు పైగా టీచర్లకు పదోన్నతులు లభించనున్నాయి. ఈసారి కూడా గత కేసీఆర్ ప్రభుత్వం మాదిరిగానే వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ ద్వారానే బదిలీల ప్రక్రియ నిర్వహించడానికి ఆదేశాలు ఇవ్వగా.. 2023 సెప్టెంబర్‌లో బదిలీ అయి రిలీవ్ కాకుండా పాత స్థానంలో కొనసాగుతున్న స్కూల్ అసిస్టెంట్లను వెంటనే రిలీవ్చేయడానికి ఆదేశాలు ఇచ్చింది. దీంతోపాటు పదవీ విరమణకు మూడేళ్లలోపు ఉన్న వారికి తప్పనిసరి బదిలీల నుంచి మినహాయింపునిచ్చింది.