జగిత్యాల, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ) : సంక్షేమ పథకాలను క్రమంగా ఖతం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నాడని, అందులో భాగంగానే కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌పై దాఖలైన పిల్‌పై కౌంటర్ దాఖలు చేయలేదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి విమర్శించారు. పుష్కరకాలంగా అమలవుతున్న పథకంపై నమోదైన కేసులో కనీసం కౌంటర్ దాఖలు చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నదని మండిపడ్డారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
నిరుపేద వర్గాలకు సామాజిక భద్రత కల్పించాలన్న ఉద్దేశంతో రూ.200గా ఉన్న వృద్ధాప్య పెన్షన్‌ను, రాష్ట్రం ఏర్పాటు తర్వాత తొలి సీఎం కేసీఆర్ పదింతలు చేసి రూ.2వేలకు పెంచారని గుర్తు చేశారు. మేనిఫెస్టోలో పెట్టకున్నా, ఎవరు అడుగకున్నా బీడీ కార్మికులకు జీవనభృతి పేరిట పెన్షన్‌ను అందించారని చెప్పారు. కానీ, కాంగ్రెస్ 2023లో అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని రకాల పెన్షన్లను రెట్టింపు చేస్తామని, మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేసిందని విమర్శించారు. అధికారంలోకి వచ్చి 32 నెలలు గడుస్తున్నా పెన్షన్ రెట్టింపు చేయలేదని, కొత్త పెన్షన్ల అమలు చేయలేదని మండిపడ్డారు. అలాగే ఆడబిడ్డలకు నెలకు రూ.2,500 ఆర్థికసాయం ఊసే లేదన్నారు.
ఆగస్టు 15 నుంచి 7 విభాగాలకు చెందిన పెన్షన్లను కొత్తగా అర్హత పొందిన వారికి ఇస్తున్నామని ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ప్రాధాన్యతగా ఇవ్వాల్సిన వృద్ధాప్య, బీడీ కార్మికులను అందులో చేర్చకపోవడం సహించరాని నేరమని ఆగ్రహించారు. నిరుపేద వర్గాల కుటుంబాలకు అండగా నిలువాలన్న ఉద్దేశంతో దేశంలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని, కులమతాలకు అతీతంగా అమలు చేశారని గుర్తు చేశారు. మొదట్లో రూ.50వేలతో ఆరంభించిన అటుపైన కాలానుగుణంగా రూ.1,00,116కి పెంచారన్నారు. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద ఇచ్చే రూ. లక్షకు అదనంగా తులం బంగారం ఇస్తామని రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారన్నారు.
తులం బంగారం ఇవ్వడం పక్కనపెట్టి, లక్ష రూపాయలకు ఎసరు పెట్టేందుకు పన్నాగం పన్నుతున్నారని విమర్శించారు. వృద్ధుల సంక్షేమం విస్మరిస్తున్న ప్రభుత్వాధినేతగా సీఎం రేవంత్‌రెడ్డి సైతం శిక్షార్హుడే అన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం చట్టబద్ధతను ప్రశ్నిస్తూ పిల్ హైకోర్టులో దాఖలైందని, పిల్‌పై కౌంటర్ దాఖలు చేయాలని అడిగితే ప్రభుత్వం కనీసం స్పందించకపోవడంతో హైకోర్టు ఆ పథకాల వర్తింపును నిలిపివేయమంటూ ఉత్తర్వు ఇచ్చిందన్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్యంతో కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ కార్యక్రమం నిలిచిపోవడం సిగ్గుచేటన్నారు. కొత్త పథకాలు అమలు చేయడంలో రేవంత్ రెడ్డి ఎలాగు ఫెయిలయ్యాడని, కనీసం ఆన్‌గోయింగ్ పథకాలనైనా కాపాడలేకపోవడం ఆయన వైఫల్యానికి నిదర్శనమన్నారు. బీడీ పరిశ్రమపై ఆధారపడిన మహిళలకు పెన్షన్ ఇవ్వకుండా వారి ఉసురు ఎందుకు పోసుకుంటున్నావని నిలదీశారు. మహిళలు అంటే రేవంత్ రెడ్డి ఎంత వివక్ష ఉన్నదో ఈ రెండు సంఘటనలే స్పష్టం చేస్తున్నాయన్నారు. ముఖ్యమంత్రికి ఏ మాత్రం నైతికత ఉన్నా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
క్రమంగా సంక్షేమ పథకాలు తగ్గించే కుట్రలో భాగంగానే రేవంత్ ప్రభుత్వం ఇలా ప్రవర్తిస్తుందన్నారు. మహిళల ఉసురుపోసుకుంటున్న సీఎం రేవంత్‌రెడ్డికి జ్ఞానోదయం కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నామన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకంపై వెంటనే హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయాలని, అలాగే మహిళలపై నిర్లక్ష్యం వహించినందుకు సీఎం రేవంత్‌రెడ్డి చెంపలు వేసుకోవాలన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసినట్టు తెలిపారు.
అలాగే పంద్రాగస్టు నుంచి కొత్తగా ఇచ్చే పెన్షన్ల విభాగంలో వృద్ధాప్య పెన్షన్, బీడీ కార్మికుల పెన్షన్లను చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, శీలం ప్రవీణ్ కుమార్, వొల్లెం మల్లేశం, గాజుల రాజేందర్, మున్నా, కళ్లేపల్లె దుర్గయ్య, కోరుకంటి రాము, తోట హరీశ్, సతీశ్ కుమార్, పల్లె రవి, రాధా కిషన్, గంగా రెడ్డి, పొనగంటి మహేశ్, రమేశ్ బాబు, బరం మల్లేశం, నరేశ్ గౌడ్, కచ్చు హరీశ్, సాయి, మహేశ్, మధు, అనిల్, రాజేందర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.