జమ్మికుంట, మే 3: కేంద్ర ప్రభుత్వం వెంటనే కాల్పుల విరమణ ప్రకటించి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని శాంతి చర్చల కమిటీ చైర్మన్ జస్టిస్ చంద్రకుమార్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం-మావోయిస్టుల మధ్య శాంతి చర్చల ఆవశ్యకతపై మానవ హక్కుల వేదిక ఆధ్వర్యంలో స్థానిక వినాయక గార్డెన్లో హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ తిరుపతయ్య అధ్యక్షన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ, స్వాతంత్య్రం వచ్చి ఏండ్లు గడిచినా ప్రజలకు కల్తీ లేని ఆహారం, గాలిదొరికే పరిస్థితులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు.
గిరిజన ప్రాంతాల్లోని ఆదివాసీలకు రాజ్యాంగం ప్రత్యేక హక్కులు కల్పించిందని, ఆ హక్కుల ప్రకారం వారు స్వయంపాలన అధికారం కలిగి ఉంటారన్నారు. అలాంటి గిరిజన ప్రాంతాల్లో వారి నిర్ణయాలకు వ్యతిరేకంగా చేసే అధికారం ఎవరికీ లేదన్నారు. ఆదివాసీల హక్కులకు ప్రభుత్వం విఘాతం కలిగిస్తున్నదని ఆరోపించారు. మావోలు, కేంద్రం హింసను వీడాలని, శాంతిచర్చలు జరిపించేందుకు మేం సిద్ధంగా ఉన్నామని తెలిపారు. చర్చలకు సిద్ధంగా ఉన్నామని మావోలు ప్రకటించినప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం మావోలను చుట్టుముట్టేందుకు బలగాలను పంపించడం ధర్మంకాదన్నారు.
చర్చల ప్రక్రియ కోసం అన్నివర్గాల ప్రజలు గొంతువిప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో విజయ, రాజేశ్వర్రావు, రామస్వామి, రమేశ్, సదయ్య, కోటి, వాసుదేవరెడ్డి, రాజు, హరికృష్ణ, రంజిత్, సామ్రాజ్యం, మోహన్, సమ్మయ్య, నరహరి, సంపత్రావు, సజ్జు, ఇమ్రాన్, హరిబాబు, శిరీష, స్రవంతి, తదితరులు పాల్గొన్నారు.