Quiz competitions | ధర్మారం, ఆగస్టు 30: క్విజ్ పోటీలను నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో ఉన్న ప్రతిభ వెలుగులోకి వస్తుందని పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల విద్యాధికారి పోతు ప్రభాకర్ అన్నారు. జిల్లా విద్యాశాఖ ఆదేశాల మేరకు ధర్మారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో మండల స్థాయిలో విద్యార్థులకు గణితం, సామాన్య శాస్త్రం సబ్జెక్టులపై శనివారం క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో ప్రభాకర్ ప్రశ్నాపత్రాన్ని విడుదల చేస్తూ విద్యార్థులంతా క్విజ్ పోటీలలో ఉత్సాహంగా పాల్గొనాలని సూచించారు.
ఉపాధ్యాయులు అందించిన విషయ పరిజ్ఞానాన్ని అందుకొని క్విజ్ పోటీలలో పాల్గొంటే పోటీ తత్వంతో పాటు ప్రతిభా పాఠవాలు తెలుస్తాయని అన్నారు. ఈ పోటీలలో మండలంలోని వివిధ ప్రాథమికోన్నత పాఠశాలలకు చెందిన 28 మంది విద్యార్థులు, జెడ్పీ ఉన్నత పాఠశాలలకు చెందిన 22 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. జిల్లా విద్యాశాఖ, గణిత భౌతిక శాస్త్ర, జీవశాస్త్ర ఫోరంల నుండి రిసోర్స్ పర్సన్లు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
సెకండరీ స్థాయి నుండి పీ జస్విక, ఈ జోషిత కేవీ సుభాషిని, ఎన్ సాయికుమార్, కే ప్రణయ్ ఎలిమెంటరీ స్థాయి నుండి టీ వర్షిని, బీ అనిల్ కుమార్, కే శ్రీ నిత్య, ఎం రిషిక, ఎన్ ఇంద్రప్రయదర్శిని జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా విజేతలకు ఎంఈవో ప్రభాకర్ సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్మాస్టర్ ఏ షీలా, రిసోర్స్ పర్సన్లు కృష్ణమోహన్, విజయ్, రఘురాం రెడ్డి, వివిధ పాఠశాల నుంచి వచ్చిన ఉపాధ్యాయులు, సీఆర్పీ కుమారస్వామి పాల్గొన్నారు.